Janhvi Kapoor: జాన్వీపై కన్నేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
ABN , Publish Date - Jan 24 , 2025 | 01:36 PM
Janhvi Kapoor: 'దేవర'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ పై ఓ మ్యూజిక్ డైరెక్టర్ కన్నేశాడు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్‌ల్ల తర్వాత జాన్వీ కావాలంటున్నాడు. సాయి పల్లవి మంచి డ్యాన్సరే కానీ.. జాన్వీనే కావాలంటున్న ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..

దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అయితే ఈ సినిమా ఆమెకి డ్రీమ్ కాలేకపోయింది. ఆమె పాత్రకు సినిమాలో పెద్ద స్కోప్ లేకపోవడంతో సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా, ఆమె సొగసు, డాన్సులకు మాత్రం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పాటు చరణ్-బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగానే టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జాన్వీపై కన్నేశాడు. ఏమైందని ఆశ్చర్యపోతున్నారా? ఇంతకీ ఏం జరిగిందంటే..
సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో పాన్ ఇండియన్ షేక్ చేసిన ఫ్రాంచైజీ 'పుష్ప'. పుష్ప 1 సినిమాలో 'ఊ అంటావా.. ఊఊ అంటావా' అనే స్పెషల్ సాంగ్ తో సమంత ఉర్రూతలూగించా, 'పుష్ప 2'లో శ్రీలీల 'కిస్సిక్'మనిపించింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆంగ్ల మీడియా ఛానెల్ 'పుష్ప' మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో మాట్లాడుతూ 'పుష్ప 3'లో స్పెషల్ సాంగ్ ఎవరు చేయనున్నారని ప్రశ్నించాడు. దీనికి దేవి సమాధానమిస్తూ.. " 'పుష్ప 2'లోని కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవుతారని మాకు ముందే తెలుసు. శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌కు చెప్పాను. ఎంతోమంది అగ్ర కథానాయికలు మొదటిసారి నా కంపోజిషన్‌లోనే ప్రత్యేక గీతాల్లో అలరించారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ వీళ్లందరూ అగ్రస్థానంలో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్‌ల్లో నటించారు. ఇక పుష్ప 3 (Pushpa 3) సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేవారి గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. పాట ఆధారంగా హీరోయిన్‌ను ఎంపిక చేస్తారు. మంచి డ్యాన్సర్లు అయితే బాగుంటుంది. సాయి పల్లవి డ్యాన్స్‌కు నేను అభిమానిని. అలాగే జాన్వీ కపూర్ అద్భుతమైన డ్యాన్సర్. ఆమె పాటలు కొన్ని చూశాను. శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఆమెలో ఉంది. జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక అని నేను అనుకుంటున్నా. ఇలాంటి పాటలు హిట్ కావడానికి డ్యాన్స్ కూడా ముఖ్య కారణం" అని అన్నారు.