Mega Star Chiranjeevi: 'విశ్వంభర' సెట్స్ కి అనుకోని అతిధి వచ్చి ఆశ్చర్యపరిచారు
ABN , Publish Date - May 29 , 2024 | 03:48 PM
చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రీకరణ జరుగుతున్న సెట్స్ కి తమిళ సూపర్ స్టార్ అజిత్ అనుకోని అతిధిగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదే స్టూడియోలో అజిత్ సినిమా 'గుడ్ బాడ్ అగ్లీ' చిత్రీకరణ కూడా జరుగుతూ ఉండటం ఆసక్తికరం. ఈ ఇద్దరు నటులూ ఒకప్పటి పాత సంగతులను గుర్తు చేసుకున్నారు.
మెగా స్టార్ చిరంజీవి అన్నపూర్ణ స్టూడియోలో తన 'విశ్వంభర' సినిమా చిత్రీకరణలో బిజీగా వున్నారు. అదే స్టూడియోలో ఇంకో పక్కన తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రీకరణ కూడా జరుగుతోంది. అయితే ఈరోజు 'విశ్వంభర' సెట్స్ పైకి అజిత్ వచ్చి చిరంజీవిని ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అజిత్ ఇప్పుడు తమిళంలో సూపర్ స్టార్, కానీ అతని మొదటి సినిమా తెలుగులో వచ్చిన 'ప్రేమ పుస్తకం'. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కుమారుడు శ్రీనివాస్ ఆ చిత్రానికి దర్శకుడు. కానీ సినిమా చిత్రీకరణ మధ్యలో ప్రమాదవశాత్తు దర్శకుడు శ్రీనివాస్ మరణించాడు.
అప్పటి అజిత్ మొదటి సినిమా ఆడియో విడుదల వేడుకకి చిరంజీవి ప్రత్యేక అతిధిగా వెళ్లారు. మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత అజిత్ ఇలా చిరంజీవిని సినిమా సెట్స్ పై కలవటం, వాళ్లిద్దరూ ఎన్నో పాత విషయాలు మాట్లాడుకోవటం జరిగింది. అజిత్ 'గుడ్ బాడ్ అగ్లీ' సినిమాకి అధిక రవిచంద్రన్ దర్శకుడు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. చిరంజీవి 'విశ్వంభర' సినిమాకి మల్లిడి వసిష్ఠ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి తన సామాజిక మాధ్యమంలో అజిత్ తో వున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ, అప్పటి సంగతులను నెమరువేసుకున్నారు. 'ప్రేమ పుస్తకం' సినిమా మ్యూజిక్ లాంచ్ నేనే చేసాను. అలాగే అజిత్ భార్య షాలిని చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో బాలనటిగా చేసింది. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇవన్నీ చిరంజీవి తన పోస్టులో ప్రస్తావిస్తూ, అజిత్ ఇప్పుడు పెద్ద స్టార్ అయినా ఎటువంటి భేషజం లేకుండా, సింపుల్ గా వున్నారు అని చెప్పారు. ఇలా అనుకోని అతిధి అజిత్ 'విశ్వంభర' సెట్స్ కి వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.