Samyuktha: జోరు పెంచిన సంయుక్త...
ABN , Publish Date - Apr 08 , 2025 | 09:56 AM
సంయుక్త తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రను వేయడానికి విశేషమైన కృషి చేస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఇప్పటికే రెండు చిత్రాలు చేసిన ఆమె మూడో చిత్రానికీ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది.
మలయాళ నటి సంయుక్త (Samyuktha) టాలీవుడ్ లో సైన్ చేసిన మొదటి సినిమా 'విరూపాక్ష' (Virupaksha). కానీ ఆ సినిమా విడుదలలో జరిగిన జాప్యంతో 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) తో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశేషం ఏమంటే తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో తనకుంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సంయుక్త. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చక్కని తెలుగును మాట్లాడటానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని సినిమా రంగంలోని ప్రముఖులు సైతం అభినందించారు. అక్కడ నుండి వరసుగా తెలుగులో అవకాశాలు అందుకుంటూనే ఉంది.
విశేషం ఏమంటే... సంయుక్తతో ఒకసారి పనిచేసిన హీరోలు కానీ నిర్మాణ సంస్థలు కాని తిరిగి ఆమెతో వర్క్ చేయడానికి ఆసక్తి చూపుతుంటాయి. నటన పట్ల ఆమెకు ఉన్న పేషన్, వృత్తిపట్ల ఉన్న నిబద్ధత అందుకు నిదర్శనం అని వారు చెబుతుంటారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలోనే సంయుక్త ఆ తర్వాత 'సార్' (Sir) మూవీ చేసింది. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తెలుగులో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే సంస్థ మరో తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా నిర్మించబోతోంది. దీనిని కూడా 'సార్' మూవీ డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరినే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో సూర్య సరసన 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా తమిళ నాయిక కయాదు లోహర్ ను ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు కయాదు స్థానంలో సంయుక్తను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే... సంయుక్త కు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఇది మూడో సినిమా.
ఇప్పటికే సంయుక్త ఐదు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అందులో బాలకృష్ణ (Balakrishna) 'అఖండ -2', నిఖిల్ 'స్వయంభూ', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా ఉన్నాయి. అలానే శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీలోనూ సంయుక్త నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మెలోడీ గీతం ప్రోమో సోమవారం విడుదలైంది. పూర్తి పాట బుధవారం విడుదల కానుంది. ఇంతేకాదు... యోగి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంయుక్త దానికి తానే ప్రెజెంటర్ గానూ వ్యవహరిస్తోంది. మొత్తానికి తెలుగు సినిమా రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి సంయుక్త అన్ని రకాలుగా గట్టి కృషే చేస్తోంది.
Also Read: Dhanush – Karthi : మల్టీస్టారర్ మూవీకి నిర్మాత కరువు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి