ANR: అక్కినేని.. అవార్డులు.. బిరుదులు

ABN , Publish Date - Sep 20 , 2024 | 03:37 PM

బిరుదులు, అవార్డులు వంటివాటికి ఫస్ట్‌ చాయిస్‌ అక్కినేని అని చెప్పాలి.

బిరుదులు, అవార్డులు వంటివాటికి ఫస్ట్‌ చాయిస్‌ అక్కినేని (ANR) అని చెప్పాలి. తొలిగా ‘ధర్మపత్ని’ (1941)లో నటించినా, ఆ తర్వాత మూడేళ్లకు తన రెండో చిత్రం  సీతారామ జననం’ 9Seetharama Jananam) (1944)లో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారిన ఆయన ఏడు దశాబ్దాల తన  సినీ జీవితంలో ఎన్నో బిరుదులు పొందారు, మరెన్నో అవార్డులు అందుకున్నారు. చలన చిత్ర రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కేను అందుకున్న ఆయన, దేశానికి సంబంధించి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను సైతం పొందారు. ఆయనకు రాకుండా మిగిలి ఉన్న గొప్ప పురస్కారం ఏదైనా ఉన్నదంటే అది ‘భారతరత్న’ మాత్రమే.  అక్కినేనిని ఎవరైనా ప్రసావించాలంటే ‘నట సమ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు’ అనే ప్రస్తావిస్తారు. ఆ బిరుదును 1957 ఆగస్ట్‌లో అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డి చేతుల మీదుగా బెజవాడలోనే ఆయన అందుకున్నారు. ఆయన అందుకున్న బిరుదుల్లో ‘నట సార్వభౌమ’, ‘నట రాజశేఖర’, ‘కళాప్రవీణ’, ‘అభినయ నవరస సుధాకర’, ‘కళా శిరోమణి’, ‘అభినయ కళాప్రపూర్ణ’, ‘భారతమాత ముద్దుబిడ్డ’ వంటివి ఉన్నాయి.

ఆయన అందుకున్న ముఖ్యమైన అవార్డులు: (ANR Awards)
1. పద్మశ్రీ : ఏప్రిల్‌ 1967 (కేంద్ర ప్రభుత్వం)
2. పద్మభూషణ్‌: మార్చి 1988 (కేంద్ర ప్రభుత్వం)
3. రఘుపతి వెంకయ్య అవార్డ్‌ : ఏప్రిల్‌ 1990 (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం)
4. దాదాసాహెబ్‌ ఫాల్కే : మే 1991 (కేంద్ర ప్రభుత్వం)
5. అన్న అవార్డ్‌ : నవంబర్‌ 1995 (తమిళనాడు ప్రభుత్వం)
6. ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డ్‌ : నవంబర్‌ 1996 (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం)
7. కాళిదాస కౌస్తుభ : నవంబర్‌ 1996 (మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం)
8. చిత్తూరు వి. నాగయ్య అవార్డ్‌ : మార్చి 2009 (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం)
9. పద్మ విభూషణ్‌ : ఏప్రిల్‌ 2011 (కేంద్ర ప్రభుత్వం)

అక్కినేని జాతీయ పురస్కారం... (Akkineni National Awards)

పద్మ పురస్కారాలు.. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు.. ఇలా ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్న నట శిఖరం అక్కినేని నాగేశ్వరరావు. ఆయన పేరిట ఏటా ఇచ్చే అవార్డు.. ‘అక్కినేని జాతీయ పురస్కారం’. దాని వెనక ఒక కథ ఉంది. 1991లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ అందుకోవడానికి ఆయన ఢిల్లీకి వెళ్లారు. అప్పటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. తనకు ఇంత గౌరవాన్ని అందించిన సినీ పరిశ్రమ పట్ల తన కృతజ్ఞతా భావాన్ని తెలుపుకోవాలనిపించిందంటారాయన. ఆ ఆలోచన ఫలితమే ‘అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌’ ఆవిర్భావం. 2006 నుంచి ఏటా ఈ అవార్డు ప్రదానం చేస్తున్నారు. దేవానంద్‌, షబానా ఆజ్మీ, అంజలీ దేవి, వైజయంతీమాల, బాలచందర్‌, హేమమాలిని, శ్యామ్‌బెనెగళ్‌.. రేఖ, రాజమౌళి తదితరులు ఇప్పటివరకూ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Updated Date - Sep 20 , 2024 | 03:37 PM