Kangana Ranaut: ఆందోళన కలిగించే విషయమది

ABN , Publish Date - Sep 17 , 2024 | 04:08 PM

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (kangana Ranaut) ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ (emergency) చిత్రం వాయిదా పడడంపై పోరాటం చేస్తూ వార్తల్లో నిలిచింది.

Kangana Ranaut: ఆందోళన కలిగించే విషయమది

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ (kangana Ranaut) ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆమె నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ (emergency) చిత్రం వాయిదా పడడంపై పోరాటం చేస్తూ వార్తల్లో నిలిచింది. దీనితోపాటు ఆమె ముంబయిలోని తన బంగ్లాను అమ్మేసిందంటూ వార్తలు రావడం కూడా వార్తల్లో నిలవడానికి మరో కారణం. ముంబయిలో బాంద్రాలోని పాలి హిల్‌ ప్రాంతంలో ఉన్న బంగ్లాను కంగనా అమ్మేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.32 కోట్లకు దీన్ని విక్రయించినట్లు బాలీవుడ్‌ మీడియా కథనాలు ప్రచురించింది. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ఆ ఇంటిని ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.

‘నా దృష్టిలో ఆస్తులు అంటే మనకు అవసరమైన సమయాల్లో ఆదుకునేవి. నేను దర్శకత్వం వహించి నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ విడుదల కావాల్సి ఉంది. నాకున్న వ్యక్తిగత ఆస్తులు దానిపై పెట్టాను. కాని సినిమా విడుదల కాలేదు. దీంతో ఆ బంగ్లాను అమ్మక తప్పలేదు’ అని అన్నారు. కంగనా 2017లో కొనుగోలు చేసిన ఈ బంగ్లాను ఆమె ఇటీవల అమ్మేశారు.  ఇంకా ఆమె వివాదాస్పదమైన ‘ఐసీ814:ది కాంధార్‌ హైజాక్‌’ వెబ్‌ సిరీస్‌లో గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఓటీటీ వేదికగా విడుదలయ్యే చిత్రాలకు, సిరీస్‌లకు కూడా సెన్సార్‌షిప్‌ అవసరమని వాదించారు. ‘పార్లమెంట్‌ సమావేశాల్లోనూ నేను సెన్సార్‌ బోర్డు గురించి నా గళం వినిపించాను. ఓటీటీల్లో, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటున్న కంటెంట్‌ను పిల్లలు చూస్తున్నారు. ఈ విషయంలో నేను భయపడుతున్నా. ఇది ఆందోళన కలిగించే విషయం. మనం హింసను పసి హృదయాలకు ఎందుకు చూపించాలి? సెన్సార్‌ బోర్డుతో నేను ఎన్నోసార్లు వాదించాను. మనందరం దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కు కచ్చితంగా సెన్సార్‌ జరగాలి’ అని కంగనా అన్నారు. కంగనా నటించిన ‘ఎమర్జెన్సీ’ సెప్టెంబర్‌ 6న విడుదల కావాల్సి ఉంది.   సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాకపోవడంతో వాయిదా పడింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. 

Updated Date - Sep 17 , 2024 | 04:23 PM