Guntur Kaaram: నాలుగు కోట్లతో ఇంటి సెట్, 16 నుండి షూటింగ్ షురూ !
ABN , First Publish Date - 2023-08-11T17:19:42+05:30 IST
ఎట్టకేలకు మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది అని వార్త వచ్చింది. ఈసారైనా సజావుగా సాగుతుందా, లేదో అని మహేష్ అభిమానులు ఆందోళనలో వున్నారు.
మహేష్ బాబు (MaheshBabu) అభిమానులకు మరోసారి శుభవార్త. ఈనెల 16 నుండి 'గుంటూరు కారం' #GunturKaaram షూటింగ్ చేద్దామని దర్శకుడు త్రివిక్రమ్, మిగతా యూనిట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు అని తెలిసింది. ఈ సినిమా గత సంవత్సరం మొదలుపెట్టారు కానీ ఏవేవో కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. పూజ హెగ్డే (PoojaHegde) తప్పుకుంది, సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ (PSVinod) తప్పుకున్నాడు, సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది అని మహేష్ బాబు అభిమానులు ఆందోళన పడుతున్న సంగతి కూడా తెలిసిందే.
అయితే ఇవన్నీ దాటుకొని, ఇప్పుడు ఆగస్టు 16 నుండి షూటింగ్ మొదలెట్టాలి అని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈసారి ఒక ప్రైవేట్ స్టూడియోలో నాలుగు కోట్లతో ఒక ఇంటి సెట్ నిర్మించినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇంతకు ముందే కథానాయకుడు ఇంటిని కూడా హైదరాబాద్ అవుట్ స్కర్ట్ లో ఒక ఇంటి సెట్ వెయ్యడం జరిగింది, అక్కడ కొంత షూటింగ్ కూడా చేసారని కూడా అంటున్నారు. పూజ హెగ్డే ప్లేస్ లో శ్రీలీల (Sreeleela) వచ్చింది, మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) కూడా వచ్చింది, సినిమాటోగ్రాఫర్ గా వినోద్ ప్లేస్ లో మనోజ్ పరమహంస (ManojParamahamsa) అని కూడా తెలిసింది.
ఇప్పుడు ఈ ఇంటి సెట్ రెడీ అయిందని, ఇందులో మహేష్ బాబు లేని సన్నివేశాలు ఈ ఆగస్టు 16 నుండి చిత్రీకరిస్తారని తెలిసింది. తరువాత మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొంటాడు అని కూడా అంటున్నారు. ఇలా ఉంటే, ఈసారి మాత్రం ఎక్కడా గ్యాప్ లేకుండా షూటింగ్ కంటిన్యూ అవుతుందని యూనిట్ సభ్యులు అనుకుంటున్నారు. ఎందుకంటే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) ఇప్పుడు మొత్తం స్క్రిప్ట్ తో వస్తున్నాడని, అందుకని ఇక బ్రేక్ ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు. ఇలా అయితే మహేష్ బాబు అభిమానులకు ఇదొక మంచి శుభవార్తే అని చెప్పొచ్చు. మహేష్ బాబు సినిమా 'సర్కారు వారి పాట' #SarkaruVaariPaata గత సంవత్సరం మే నెలలో విడుదలయింది, తరువాత సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని ఆశగా ఎదురు చూస్తున్న అతని అభిమానులకు ఈ సినిమా షూటింగ్ మొదలవడం ఆనందమే. ఈ సినిమా విడుదల ఎప్పుడనేది తరువాతి మాట, ముందు షూటింగ్ చేస్తే చాలు అన్నట్టుగా వున్నారు అభిమానులు!