విజయ్‌కి ఇదే ఆఖరి చిత్రమా?

ABN , Publish Date - Sep 15 , 2024 | 02:44 AM

అగ్రహీరో విజయ్‌ నటించే తదుపరి చిత్రాన్ని శనివారం సాయంత్రం అధికారికంగా వెల్లడించారు. ‘విజయ్‌69’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబరు నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. మరో అగ్రహీరో...

విజయ్‌కి ఇదే ఆఖరి చిత్రమా?

అగ్రహీరో విజయ్‌ నటించే తదుపరి చిత్రాన్ని శనివారం సాయంత్రం అధికారికంగా వెల్లడించారు. ‘విజయ్‌69’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కే ఈ చిత్రం వచ్చే ఏడాది అక్టోబరు నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. మరో అగ్రహీరో అజిత్‌ కుమార్‌కు ‘నెర్కొండ పార్వై’ ‘వలిమై’, ‘తుణివు’ వంటి వరుస హిట్‌ చిత్రాలను అందించిన హెచ్‌.వినోద్‌ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మాత వెంకట్‌ కె.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత స్వరాలు సమకూర్చే ఈ సినిమాలో పూజా హెగ్డే, సిమ్రాన్‌, మమిత బైజులను ఎంపిక చేయగా, విలన్‌ పాత్రను బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ పోషిస్తున్నారు. కెమెరా: సత్యన్‌ సూరియన్‌. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టరులో ‘త్వరలోనే ప్రజాస్వామ్యానికి వెలుగు చూపే వ్యక్తి రాక..’


అంటూ ఆంగ్లంలో రాయగా, ఒక చేతితో టార్చిను పట్టుకుని కనిపిస్తున్నారు. కాగా, ఈ చిత్రం తర్వాత విజయ్‌ సినిమాలకు స్వస్తి చెప్పి.. పూర్తిస్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లో నిమగ్నం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన ‘తమిళగ వెట్రి కళగం’ అనే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

చెన్నై, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 15 , 2024 | 02:44 AM