Mari Selvaraj: నా అంతిమ కన్నీరు ‘వాళై’
ABN , Publish Date - Aug 23 , 2024 | 07:23 AM
‘వాళై’ చిత్రం తన అంతిమ కన్నీరు అని ఆ చిత్ర దర్శకుడు మారిసెల్వరాజ్ అన్నారు. నాకు ఏంటి సమస్య? అని ప్రశ్నించే వారికి, తన గురించి ఆలోచించే వారికి తాను చెబుతున్న సమాధానమే ఈ చిత్రం అని ఆయన పేర్కొన్నారు.
‘వాళై’ (Vaazhai) చిత్రం తన అంతిమ కన్నీరు అని ఆ చిత్ర దర్శకుడు మారిసెల్వరాజ్ ( Mari Selvaraj) అన్నారు. ‘అతనికి ఏంటి సమస్య? అని ప్రశ్నించే వారికి, తన గురించి ఆలోచించే వారికి తాను చెబుతున్న సమాధానమే ఈ చిత్రం అని ఆయన పేర్కొన్నారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నవి స్టూడియోస్, ఫార్మర్స్ మాస్టర్ ప్లాన్ ప్రొడక్షన్స్ కంపెనీలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వాళై’. రెడ్ జెయింట్ మూవీస్ ఈ శుక్రవారం ప్రేక్ష్లకుల ముందుకు తీసుకువచ్చింది.
నిఖిలా విమల్ (Nikhila Vimal), పొన్‌వేల్, రాహుల్, కలైయరసన్, సతీష్‌కుమార్, దివ్య దురైస్వామి, జానకి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా తేని ఈశ్వర్, ఎడిటింగ్ సూర్య ప్రధానమన్, సంగీతం సంతోష్ నారాయణన్. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నైలో జరిగింది.
ఇందులో చిత్రపరిశ్రమకు చెందిన వెట్రిమారన్, పా.రంజిత్, మిష్కిన్, శశి, నెల్సన్ దిలీప్ కుమార్, అమీర్, నటులు శరత్ కుమార్, హరీష్ కళ్యాణ్, సూరి, నిర్మాత కలైపులి ఎస్.థాను సహా పలువురు సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.
ఇందులో చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ మాట్లాడుతూ, ‘ఇకపై నేను మంచి చిత్రాలను తెరకెక్కించినప్పటికీ నా కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా ‘వాళై’ సినిమానే చెప్పుకుంటా. నా అంతిమ కన్నీరు ఏది అంటే అది ‘వాళై’ మాత్రమే. వీటి సమస్య ఏంటి అని ప్రశ్నించే వారందరికీ ఈ సినిమానే సమాధానం. నా బాధను, ఏడుపును నా దర్శకుడు రామ్‌కు చెబుతుండగా, అదే కళ అని గ్రహించాను. అందుకే అతనికి ఈ సినిమాను అంకితం చేస్తున్నా’ అని పేర్కొన్నారు.