Trisha - Charmy: ఈనాటి ఈ బంధమే నాటిదో...

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:21 PM

త్రిష, ఛార్మి మధ్య స్నేహం రెండు దశాబ్దాల నాటింది. ఇటీవల రీ-యూనియన్ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను ఛార్మి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దాంతో ఛార్మి నిర్మించబోయే చిత్రంలో త్రిష నాయికగా నటిస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సహజంగా రెండు కొప్పులు కలిసి ఒక చోట సామరస్యంగా ఉండవని అంటూ ఉంటారు. అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఒక్క చోట స్నేహంగా ఉండేది తక్కువని చెబుతారు. ఇక సినిమా రంగంలో అయితే... ఒక హీరోయిన్ తో మరొక హీరోయిన్ కు సరిపడదని అంటారు. ప్రొఫెషనల్ రైవలరీ కారణంగా పైకి నవ్వుతూ పలకరించుకున్నా... లోపల మాత్రం ఒకరిపై ఒకరికి అసూయ, ద్వేషాలు కామన్ అనే గుసగుసలు వినిపిస్తుంటాయి. కానీ సినిమా రంగంలోనూ కొందరు హీరోయిన్ల మధ్య స్నేహ కుసుమాలు పూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పట్లో జయప్రద (Jayaprada), జయసుధ (Jayasudha) కలిసి మెలిసి బాగానే ఉండేవారు. వీరిద్దరితో శ్రీదేవి (Sridevi) కాస్తంత రిజర్వ్డ్ గా ఉండేదని అనుకునే వారు. అలానే శ్రీదేవితో పాటు జయప్రద కూడా హిందీ చిత్రసీమలోకి వెళ్ళి అగ్ర కథానాయికగా రాణించింది. వీరిద్దరూ కలిసి కొన్ని తెలుగు, హిందీ చిత్రాలలో నటించినా పెద్దంత అనుబంధాన్ని అయితే బయట ప్రదర్శించిన దాఖలాలు లేవు.


WhatsApp Image 2025-04-09 at 12.47.50 PM.jpeg

ఈ తరంలో హీరోయిన్లు కలిసి సినిమాలు చేయడం అనేది చాలా రేర్. ఒకరి అవకాశాలు ఒకరు కొల్లగొట్టిన సందర్భాలే అధికం. దాంతో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, స్నేహం ఉండే పరిస్థితి చాలా తక్కువ. అయితే ఈ విషయంలో ఛార్మి (Charmy), త్రిష (Trisha) ఎక్సెప్షన్ అనే చెప్పాలి! ఎందుకంటే ఇరవై వసంతాలుగా వీరిమధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ చాలా కాలం క్రితం ప్రభాస్ (Prabhas) మూవీ 'పౌర్ణమి'లో నటించారు. ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపించలేదు కానీ షూటింగ్ సమయంలో బాగానే టైమ్ స్పెండ్ చేశారు. పంజాబీ అమ్మాయి ఛార్మి తెలుగు సినిమాతోనే కెరీర్ ప్రారంభించి, ఆపై కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది. తమిళ అమ్మాయి త్రిష కృష్ణన్ తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఆ రకంగా ఇరవై యేళ్ళ క్రితం వారి మధ్య చిగురించిన స్నేహం ఇప్పటికే కొనసాగుతుండటం విశేషమే. ఇదే విషయాన్ని ఛార్మి తమ రీ-యూనియన్ ను తెలియ చేసే ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. రెండు దశాబ్దాలు గడిచినా... త్రిషా ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతుండగా, ఛార్మి మాత్రం నటనకు స్వస్తి పలికి, నిర్మాతగా మారిపోయింది.


విజయ్ సేతుపతి సరసన త్రిష!

ప్రస్తుతం ఛార్మి, పూరి జగన్నాథ్‌ (Puri Jaganadh) తో కలిసి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా సినిమా నిర్మించబోతోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. త్రిష, ఛార్మి మధ్య ఉన్న స్నేహం కారణంగా పూరి డైరెక్షన్ లో నిర్మించే ఈ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే... 2018లో విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించిన '96' సినిమా తమిళంలో ఘన విజయాన్ని సాధించింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న త్రిషను ఆ సినిమా మరోసారి హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. అక్కడ నుండి త్రిష ఇక వెనుదిరిగి చూసుకున్నదే లేదు. అలానే పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోనూ త్రిష గతంలో 'బుజ్జిగాడు' మూవీలో చేసింది. ఇక ఛార్మితో స్నేహం ఉండనే ఉంది. సో... ఆ రకంగా పాత పరిచయాలు, అనుబంధాల కారణంగా విజయ్ సేతుపతి సినిమాలో త్రిషను లీడ్ క్యారెక్టర్ కు తీసుకునే ఛాన్స్ లేకపోలేదు.

Also Read: Sai Abhyankar: క్రేజీ ప్రాజెక్ట్ కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 09 , 2025 | 01:22 PM