Kollywood: ధనుష్‌ కు మూడు రెట్లు ఎక్కువగా శివ కార్తికేయన్...

ABN , Publish Date - Apr 07 , 2025 | 02:45 PM

కోలీవుడ్ లోని యంగ్ హీరోస్ లో శివ కార్తికేయన్ రేంజ్ హఠాత్తుగా పెరిగిపోయింది. అతనిప్పుడు ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

కోలీవుడ్ లో ఇప్పుడు మీడియం హీరోలదే హవా! యాంకర్ గా వచ్చి ఆపైన సినిమాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ తారాస్థాయిని చేరుకున్నాడు శివ కార్తికేయన్ (Shiva Karthikeyan). అయితే... తమిళ చిత్రసీమలో ఇవాళ ఏ స్థాయి హీరోకూ సాలీడ్ హిట్స్ అనేవి పడటం లేదు. అజిత్ (Ajith) కు మంచి విజయం దక్కి చాలా కాలమే అయ్యింది. దాంతో అతని అభిమానులు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇక విజయ్ (Vijay) ఇప్పుడు సినిమాల మీద కంటే... రాజకీయాల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. పొంగల్ కు రాబోతున్న 'జన నాయగన్' (Jana Nayagan) ఆయన చివరి చిత్రం అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇక రజనీకాంత్ (Rajinikanth) 'జైలర్' (Jailer) సక్సెస్ తర్వాత వచ్చిన 'లాల్ సలామ్' (Lalsalaam) ఆడలేదు. దాంతో ఆగస్ట్ 14న రాబోతున్న 'కూలీ'తో ఆయన తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని నమ్ముతున్నారు. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' (Vikram) మంచి విజయాన్ని అందుకున్నా... ఆ తర్వాత సోలోగా చేసిన 'ఇండియన్ -2' పరాజయం పాలైంది. ఇక విక్రమ్, శింబు, సూర్య, కార్తీ వంటి వాళ్ళు కూడా జయాపజయాలతో కుస్తీలు పడుతున్నారు.


ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ మూవీ 'అమరన్' దీపావళి కానుకగా వచ్చి ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ ను వసులూ చేసింది. ఈ మూవీతో అతను ఓవర్ నైట్ బిగ్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ సుధా కొంగర దర్శకత్వంలో 'పరాశక్తి' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు అతను ఏకంగా రూ. 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. చిత్రం ఏమంటే... హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించిన ధనుష్‌ కూడా ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లేదట. ధనుష్‌ మొన్నటి వరకూ పది కోట్ల రూపాయలను మాత్రమే తీసుకునే వాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరోగా, డైరెక్టర్ గా ధనుష్ కు మిశ్రమ స్పందనే లభిస్తోంది. అతని తాజా చిత్రం 'జాబిలమ్మ నీకు అంతకోపమా' తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆడలేదు. ధనుష్ (Dhanush) హీరోగా నటించిన 'సార్' సినిమా మంచి విజయాన్ని సాధించింది. గత యేడాది ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్, రాయన్' చిత్రాలు విడుదలయ్యాయి. వాటికి మిశ్రమ స్పందనే లభించింది. దాంతో త్వరలో రాబోతున్న 'కుబేర' మీద ధనుష్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అలానే స్వీయ దర్శకత్వంలో 'ఇడ్లీ కడై' అనే సినిమాలో ధనుష్‌ హీరోగానూ నటించాడు. అది అక్టోబర్ లో వస్తోంది. మరి ఈ రెండు సినిమాలు హిట్ అయ్యి ధనుష్‌ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. సో... ఓవర్ ఆల్ గా చూసుకుంటే... ధనుష్ కంటే కూడా ఇవాళ విజయాలలోనూ, పారితోషికంలోనూ శివ కార్తికేయన్ దే పైచేయిగా ఉంది.

Also Read: Ajith Kumar: గుడ్ బ్యాడ్ అగ్లీ వస్తోందట...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 07 , 2025 | 02:45 PM