Allu Arjun - Netizens: ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయ్ బన్నీ!
ABN , Publish Date - Aug 22 , 2024 | 02:48 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu Arjun) మరోసారి వార్తలో నిలిచారు. తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడు అని చెబుతూ నంద్యాల వైపీసీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu Arjun) మరోసారి వార్తలో నిలిచారు. తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడు అని చెబుతూ నంద్యాల వైపీసీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లి మద్దతు తెలిపారు. తన మేనమామ వరసైన పవన్ కల్యాణ్‌కు (Pawan kalyan) మాత్రం సోషల్ మీడియాలో ఓ ట్వీట్‌తో సరిపెట్టారు. దీనిపై అప్పుడు పెద్ద చర్చే నడిచింది. మెగా ఫ్యాన్స్‌తోపాటు పలువురు ప్రత్యక్షంగానే బన్నీని విమర్శించారు. నాగబాబు కూడా పరోక్షంగా కామెంట్స్ చేశారు. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడే అయినా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేశారు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందనే రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఆ గాయం మానక ముందే మరో అంశంపై పరోక్షంగా సెటైర్లు వేశాడు బన్నీ.
సుకుమార్ భార్య సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము పుష్ప- 2 క్లైమాక్స్ షూటింగ్లో ఉండగా సుకుమార్ భార్య తబిత వచ్చి ఈ సినిమా ఈవెంట్‌కి రావాలని పిలిచారు. ఇప్పటివరకు నేను చేస్తున్న అన్ని సినిమాల్లో అతి కష్టమైన షూటింగ్ ‘పుష్ప 2’ క్లైమాక్స్(Pushpa 2). అలాంటి పరిస్థితిలో కూడా ఆమె పిలిచిందని వచ్చాను. ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి, వారికి అండగా మనం నిలబడగలగాలి, నాకు ఇష్టమైతేనే వస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా’’ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఉద్దేశం సుకుమార్ భార్య తీసిన సినిమా గురించే అయినా.. నెటిజన్లు మాత్రం శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలిపిన విషయానికి లింక్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దానికే కౌంటర్‌గా బన్నీ మాట్లాడారని భావిస్తున్నారు. (Mega VS Allu Fans)
ఇదిలా ఉంటే ఫ్యాన్స్ విషయంలో మరో మాట మాట్లాడి ట్రోలర్స్‌కు, మీమర్స్‌కు పని పెట్టారు బన్నీ. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా హీరోని చూసి అందరూ ఆయనకు ఫ్యాన్స్ అవుతారు. కానీ నేను మాత్రం ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యాను’’ అని వ్యాఖ్యానించారు. జనరల్‌గా హీరోకి ఫ్యాన్స్ పుట్టుకొస్తారు. ఫ్యాన్స్ వల్ల హీరో కావడం ఏంటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్. బన్నీ ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పారా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. బన్ని తండ్రి టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత, తాత అల్లు రామలింగయ్య స్టార్ కమెడీయన్ అనే బ్యాగ్రౌండ్ ఉన్నా తన మావయ్య చిరంజీవి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని బన్నీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని కొందరు బన్నీకి గుర్తు చేస్తున్నారు.
‘‘సినిమా హిట్ అయినా, అవ్వకపోయినా థియేటర్‌లో మొదటి సినిమా టికెట్ తెగేది మెగా అభిమానులదే అని, చిరంజీవి వేసిన రోడ్డు మీద మేమంతా నడుస్తున్నాం, రోడ్డు వేసినవాడు గొప్ప కానీ, డ్రైవ్ చేసేవాడు గొప్ప కాదు’’ అని గతంలో మీరు చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయ్ బన్నీ? మీకంటూ ఫ్యాన్ బేస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ నెట్టింట ప్రశ్నిస్తున్నారు. ‘బన్ని మాటలకు అర్థాలే వేరులే’ అని నెట్టింట మీమ్స్ విపరీతంగా తిరుగుతున్నాయి. ఏదేమైనా మరోసారి బన్నీ చేసిన వ్యాఖ్యలు ఆయనని వార్తలలో నిలబెట్టేస్తున్నాయి.