Sumanth Prabhas: గోదారి గట్టుపైన.... సుమంత్ ప్రభాస్

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:41 PM

'మేమ్ ఫేమస్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ప్రభాస్ తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాడు. దానికి 'గోదారి గట్టుపైన' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

న్యూ ఏజ్ మూవీ 'మేమ్ ఫేమస్' తో హీరోగా తెరంగేట్రమ్ చేసిన సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇది రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. అభినవ్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఆర్. ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్స్ తో పాపులరైనా సుభాష్ చంద్ర ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిధి ప్రదీప్ (Nidhi Pradeep) కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు (Jagapathi Babu) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం చిత్ర నిర్మాతలు ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి 'గోదారి గట్టుపైన' (Godari Gattupaina) అనే టైటిల్ ను పెట్టినట్టు తెలిపారు. 'సంక్రాంతి వస్తున్నాం' మూవీ లోని హిట్ పాట నుండి ఈ పదాలను తీసుకున్నామని అన్నారు.


'గోదారి గట్టుపైన' సినిమా గురించి దర్శకుడు సుభాష్‌ చంద్ర మాట్లాడుతూ, ''ఒక చల్లని సాయంత్రం వేళ ప్రశాంతమైన గోదావరి నది ఒడ్డున మీ స్నేహితులతో కూర్చుని సమయం గడపడం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. అందమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. గోదావరి జిల్లాలోని వేల్పూరు, రేలంగి, భీమవరం నేపథ్యంలో కథ సాగుతుంది. అందుకే ఈ మూవీకి 'గోదారి గట్టుపైన' అనే పేరు పెట్టాం. పశ్చిమ గోదావరి ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలను ఈ సినిమాలో చూడొచ్చు'' అని అన్నారు. ఇందులో రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణవర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నాగ వంశీకృష్ణ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Kollywood: ధనుష్‌ కు మూడు రెట్లు ఎక్కువగా శివ కార్తికేయన్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 07 , 2025 | 03:41 PM