Guntur Kaaram: మహేష్ బాబు సినిమా 'ఓ మై బేబీ' పాట లేకుండానే విడుదల?
ABN , Publish Date - Dec 23 , 2023 | 09:59 AM
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా ఈమధ్యనే విడుదలైన పాట 'ఓ మై బేబీ' లేకుండానే విడుదల కావొచ్చు అని ఒక టాక్ పరిశ్రమలో నడుస్తోంది.
మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram సినిమా జనవరి 12, సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలకి సిద్ధంగా వుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గరనుంచి వివిధ కారణాలతో వివాదాల్లో ఉంటూనే వుంది. ఈ సినిమాకు సంగీతం ఎస్ థమన్ (SThaman) ఇస్తున్నారు, కాగా రామజోగయ్య శాస్త్రి (RajajogayyaSastry) పాటలు రాసారు. అయితే తాజాగా ఈ సినిమానుండి వచ్చిన 'ఓ మై బేబీ' #OhMyBaby పాట సామజిక మాధ్యమాల్లో వివాదాలకు దారితీసింది.
ఈ పాట మహేష్ బాబు అభిమానులకి నచ్చకపోవటంతో అందరూ సంగీత దర్శకుడిని, రచయితని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. దానితో రచయిత శాస్త్రిగారు సామజిక మాధ్యమైన 'ఎక్స్' నుండి తప్పుకున్నారు. ఇలా ట్రోల్ చేసినప్పుడే, ఈ చిత్ర నిర్మాత నాగ వంశి మహేష్ బాబు అభిమానులను కోతులతో పోలుస్తూ ఒక పోస్ట్ పెట్టారు, మళ్ళీ తీసేసారు. అయితే ఈ పాట కోసం ఒక ప్రత్యేక సెట్ వేసి చిత్రీకరణ జరపాలని అనుకున్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ పాటని అసలు షూట్ చెయ్యలేదని ఒక వార్త ప్రచారంలో వుంది. అసలు ఈ పాట సినిమాలో లేకుండానే సినిమా విడుదల కావొచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ పాట మహేష్ బాబు కి కూడా నచ్చలేదని, అభిమానులకి, మహేష్ బాబు కి నచ్చని పాట మళ్ళీ సినిమాలో ఎందుకు అని, ఈ పాటని అసలు షూటింగ్ కూడా చెయ్యకుండా ఆపేసినట్టుగా పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు. అందుకని ఈ పాట సినిమాలో లేకుండానే జనవరి 12న విడుదల చేయొచ్చు అని కూడా అంటున్నారు.
ఇప్పుడు ఇంకో టాక్ నడుస్తోంది ఏంటంటే, థమన్ ఒక కొత్త పాట ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని, అందుకోసం రాత్రి పగలూ కష్టపడుతున్నారని నడుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు, ఈ చిత్ర నిర్వాహకులే దీని గురించి మాట్లాడాలి అని అంటున్నారు. కొత్తపాట ఇచ్చినా, ఆ పాటకి షూటింగ్ జనవరి మొదటి వారంలో పూర్తి చెయ్యగలిగేటట్టు ఉండాలి అని కూడా అంటున్నారు. మహేష్ ఒక వారం రోజుల పాటు విదేశాలకి కుటుంబంతో కొత్త సంవత్సరం పండగకి వెళతారు అని కూడా అంటున్నారు. అతను జనవరి 4న హైదరాబాద్ మళ్ళీ వస్తారని కూడా టాక్.