‘వేవ్స్ బజార్’
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:07 AM
ప్రపంచవ్యాప్తంగా వినోద, మీడియా పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధిలో మన దేశం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆకర్షణీయమైన కథనాలతో పాటుగా అత్యాధునిక సాంకేతికత ద్వారా వచ్చే ఆవిష్కరణలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు...

వినోద రంగంలో మన ‘లగాన్’!
ముంబైలో ప్రపంచ ఆడియో విజువల్ ్క్ష ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకు- కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, జ్యూరీ సభ్యుడు ఆమీర్‌ఖాన్ అందించిన వ్యాసం... చిత్రజ్యోతికి ప్రత్యేకం
ప్రపంచవ్యాప్తంగా వినోద, మీడియా పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధిలో మన దేశం కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆకర్షణీయమైన కథనాలతో పాటుగా అత్యాధునిక సాంకేతికత ద్వారా వచ్చే ఆవిష్కరణలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే అనేక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ లభ్యమవుతోంది. స్థానిక భాషల్లో కంటెంట్ లభ్యమవడాన్ని కూడా మనం చూస్తున్నాం. వినోదాన్ని అందించే రంగం మాత్రమే కాకుండా సాంస్కృతికంగా, ఆర్థికంగా, అంతర్జాతీయ సంబంధాల విషయంలోనూ కీలక భూమిక పోషించనుంది. ఈ నేపథ్యంలో- వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకు- ముంబైలో ప్రపంచ ఆడియో విజువల్ ్క్ష ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిలో ‘వేవ్స్ బజార్’ ఒక ముఖ్యమైన భాగం.
వేవ్స్ బజార్ అంటే..
నేను బాలీవుడ్‌లో గత కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నా. వినోదంతో పాటుగా సాంకేతికతో సంబంధమున్న పరిశ్రమ ఇది. ప్రజలందరికీ ఏకీకృతం చేసి.. ముందుకు నడిపించగలిగిన శక్తి కథలకు మాత్రమే ఉందని నేను నమ్ముతాను. ప్రపంచ వినోద పరిశ్రమకు ఒక దిశను చూపించటంలో వేవ్స్ బజార్ కీలక భూమిక పోషిస్తుందని నేను భావిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా వినోద పరిశ్రమతో సంబంధం ఉన్న సాంకేతిక నిపుణులు, వాణిజ్యవేత్తలు, క్రియేటర్స్ అందరినీ ఒక తాటి మీదకు తీసుకువచ్చే ప్రయత్నమే వేవ్స్ బజార్. వీరందరూ ఆన్‌లైన్ పద్ధతిలో అనుసంధానమవుతారు. ఈ వేవ్స్ బజార్‌ను ఈ ఏడాది జనవరి 27వ తేదీన కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ అధికారికంగా ప్రారంభించారు. ఆర్థిక, వాణిజ్య రంగాలకు ప్రతి ఏడాది దావో్‌సలో జరిగే సమావేశాలు ఎంత కీలకమో.. వినోద రంగానికి ఈ వేవ్స్ సమావేశాలు అంత కీలకంగా మారాలనేది ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశం. దీనిలో సినిమాలకు, టెలివిజన్‌కు, రేడియోకి యానిమేషన్‌కు, గేమింగ్‌కు, ప్రకటనారంగానికి, సంగీత రంగానికి, సౌండ్ డిజైన్‌కు సంబంధించిన నిపుణులు అనుసంధానమవ్వచ్చు. తమ సృజనాత్మక ఉత్పత్తులను విక్రయించవచ్చు. లేదా కొనుగోలు చేయవచ్చు. దీనిని ప్రారంభించి మూడు నెలలు అయింది. దీనిలో సుమారు 5500 కొనుగోలుదారులు, 2000 మంది విక్రయదారులు, 1000కి పైగా ప్రాజెక్టులు నమోదయ్యాయి. దీర్ఘకాలంలో ఇది కంటెంట్‌కు సంబంధించిన ఒక నెట్‌వర్కింగ్ హబ్ అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకు ఒక ఫిల్మ్‌మేకర్ తనకు భాగస్వామి కావాలనుకుంటే దీనిలో వెతుక్కోవచ్చు. గేమ్స్‌ను రూపొందిస్తున్న యువ టెక్నిషియన్స్‌కు ఇందులో పెట్టుబడిదారులు దొరుకుతారు. ఆర్టిస్టులకు తాము నటించిన క్లిప్పింగ్స్ దీనిలో ప్రదర్శించుకొనే సౌలభ్యం ఉంటుంది. భౌగోళిక హద్దులు లేకుండా తమ సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించుకోవటానికి వేదిక లభిస్తుంది.
ప్రత్యక్షంగా చూసే అవకాశం..
వేవ్స్ బజార్ కేవలం ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితం. అయితే ఈ సారి జరుగుతున్న వేవ్స్ సమావేశంలో కొందరికి ఈ బజార్‌లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. భవిష్యత్‌లో వినోద రంగానికి సంబంధించిన నెట్‌వర్కింగ్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈ సారి వేవ్స్ బజార్ నిర్దేశిస్తుందనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఒక నటుడిగా నా సృజనాత్మకతకు హద్దులు ఉన్నాయని నేను భావించను. ప్రస్తుతం ఉన్న హద్దులను దాటి నన్ను నేను నిరూపించుకోవటానికి ఉన్న వేదికల కోసం అన్వేషిస్తూ ఉంటాను. వేమ్స్‌లో అలాంటి వేదిక లభించనున్నదని నా నమ్మకం. ఈ వేవ్స్ ప్రస్థానంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక కథను చెప్పే తీరును వేవ్స్ మార్చేస్తుందని నేను భావిస్తున్నా. లగాన్ సినిమాలో బ్రిటి్‌షవారిపై స్థానికులు పట్టుదలతో ఆడి.. అనేక అడ్డంకులు దాటి విజయం సాధిస్తారు. వేవ్స్ కూడా మన దేశానికి అలాంటి లగాన్ మూమెంట్ అని నేను నమ్ముతున్నా.