Darling: కాశ్మీర్ షూటింగ్ జ్ఞాపకాలతో నభా నటేశ్
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:37 PM
నభా నటేశ్ హీరోయిన్ గా నటించిన 'డార్లింగ్' సినిమా పరాజయం పాలైంది. అయితే ఆ సినిమా షూటింగ్ ఫహల్గామ్ లో జరిగిన రోజులను తాజాగా నభా నటేశ్ తలుచుకుని భావోద్వేగానికి లోనైంది.
పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh). ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అది ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది.
నభా నటేష్ ఈ విషయమై మాట్లాడుతూ,''పహల్గాం బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ నేను నటించిన 'డార్లింగ్' (Darling) మూవీ షూటింగ్ చేశాం. చుట్టూ 5 కిలోమీటర్ల మేర అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. భూతల స్వర్గమైన పహల్గాంలో ఉగ్రదాడి జరపడం హేయమైన చర్య. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇలాంటి దాడులు జరిగాక ఫిలింమేకర్స్ పహల్గాం వెళ్లాలంటే ఆలోచిస్తారు. స్థానిక ప్రజలు చాలా మంచివారు, మా టీమ్ కు స్నేహితులుగా మారిపోయారు. పహాల్గాం దాడి ఘటన గురించి వినగానే నాకు అక్కడ షూటింగ్ చేసిన రోజులన్నీ కళ్లముందు తిరిగాయి'' అని చెప్పింది. చిత్రం ఏమంటే... 'డార్లింగ్' షూటింగ్ టీమ్ ఎవ్వరూ పహల్గాం షూటింగ్ నాటి అనుభూతులను మీడియాతో పంచుకోనేలేదు. హీరో ప్రియదర్శి (Priyadarshi)తో సహా! ప్రస్తుతం నభా నటేశ్ 'నాగబంధం'తో పాటు 'స్వయంభూ' చిత్రంలో నటిస్తోంది. రెండూ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.