Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ

ABN , Publish Date - Aug 29 , 2024 | 02:03 PM

నేచురల్ స్టార్ నాని ఫ్యాన్ బేస్ గురించి తెలియంది కాదు. ఆయన హీరోగా, ఎస్.జె. సూర్య విలన్‌గా, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సెన్సేషన్‌ని అందించి టాలీవుడ్ ‘ఓజీ’ సంస్థగా పేరొందిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. పేరులో శనివారం ఉన్నా సరే.. రెండు రోజుల ముందుగానే థియేటర్లలోకి వచ్చిన ఈ ‘సరిపోదా శనివారం’.. ఎలా ఉందంటే?

Saripodhaa Sanivaaram Movie Poster

మూవీ పేరు: ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)

విడుదల తేది: 2024 ఆగస్ట్ 29, గురువారం

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్.జె. సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు

బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: జేక్స్ బిజోయ్

డీవోపీ: మురళి జి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి

రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ

వారానికి ఏడు రోజులు. ఈ ఏడు రోజుల్లో ఏది ప్రత్యేకం అంటే ఏం చెబుతాం. కానీ, సరిపోదా శనివారం అంటూ నాని సినిమా అనౌన్స్ చేయగానే.. శనివారానికి ఓ ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో శనివారానికి ఏదో ఇంపార్టెన్స్ ఉందనేది టైటిల్‌తోనే ప్రేక్షకులలోకి తీసుకెళ్లారు. నేచురల్ స్టార్ నాని ట్రాక్ రికార్డ్, ఎస్.జె. సూర్య ప్రస్తుత ఫామ్, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సెన్సేషన్‌ని అందించి టాలీవుడ్ ‘ఓజీ’ సంస్థగా పేరొందిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో సినిమా అనగానే కచ్చితంగా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ప్రతి శనివారం మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్, ట్రైలర్.. అలాగే నాని, ఎస్.జె. సూర్యల ప్రమోషన్స్ హోరు.. సినిమాని జనాల్లోకి వెళ్లేలా చేశాయి.. టికెట్స్ తెగేందుకు కారణమయ్యాయి. ఇలా ఎన్నో అంచనాల నడుమ, పేరులో శనివారం ఉన్నా సరే.. రెండు రోజుల ముందుగానే థియేటర్లలోకి వచ్చిన ఈ ‘సరిపోదా శనివారం’.. ప్రేక్షకులకు సరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిందో, లేదో రివ్యూలో తెలుసుకుందాం.. (Saripodhaa Sanivaaram Review)


Saripodaa-Sanivaram.jpg

కథ:

చిన్నప్పటి నుంచి ఏ చిన్న సంఘటన జరిగినా కోపంతో ఆవేశానికి లోనయ్యే సూర్య(నాని)ని.. మనిషి కోపానికి ఓ విలువ ఉండాలని చెప్పి తన తల్లి (అభిరామి) ఓ మాట తీసుకుంటుంది. దురదృష్టవశాత్తూ ఆమె క్యాన్సర్‌తో చనిపోతుంది. అప్పటి నుంచి ఎంత కోపం వచ్చినా సరే.. తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శిస్తూ.. వారం మొత్తంలో తనకు కోపం తెప్పించిన అంశాలను రాసుకుని, రౌండ్ చేసి మరీ బదులు తీర్చుకుంటూ ఉంటాడు సూర్య. అలాంటి సూర్య లైఫ్‌లోకి వయలెన్స్ అనే పదమే నచ్చని కానిస్టేబుల్ చారులత (ప్రియాంక అరుళ్ మోహన్) ప్రవేశిస్తుంది. వారి పరిచయం ప్రేమ వరకు వెళుతుంది. కానీ అదే సమయంలో నాని శనివారం కాన్సెప్ట్ తనకి తెలుస్తుంది. నాని గురించి తెలిసిన తర్వాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తన స్టేషన్ సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) చేసే పనులు అస్సలు నచ్చని చారులత.. సోకులపాలెం విషయంలో సూర్య హెల్ప్ ఎందుకు తీసుకోవాలని అనుకుంటుంది? అసలు సోకులపాలెం ఇష్యూ ఏమిటి? ఆ సోకులపాలెంపై దయానంద్ పగబట్టడానికి కారణమేంటి? చివరికి ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేశారు? అసలు చారులత‌కు, సూర్యకు ఉన్న బంధమేంటి? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా? అనేది తెలుసుకోవాలంటే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూడాల్సిందే.


Nani.jpg

విశ్లేషణ:

సూర్య (నాని) చిన్నప్పటి పాత్రతో సినిమా ‘మొదలు’ అవుతుంది. తన చుట్టూ జరిగే అన్యాయాలను చూసి, వాటిని ఎదురించే క్రమంలో సూర్య కోపానికి లోనవడం అనేది చిన్నప్పటి పాత్రతోనే మొదలుపెట్టి.. కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. తల్లి మరణం అనంతరం శనివారం కాన్సెప్ట్‌ని ఎలా అమలు పరిచేది కూడా తండ్రి (సాయికుమార్) పాత్రతో రివీల్ చేయడం నుంచి ఒక్కసారిగా హీరోయిన్ ఎంట్రీతో కథకు ‘మలుపు’ ఇచ్చారు. ఈ మలుపులో సీఐ దయానంద్ క్యారెక్టర్‌ని పరిచయం చేసిన తీరు ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తుంది. దయానంద్‌కు సోకులపాలెంకు ఉన్న కనెక్షన్‌ని.. చారులత ద్వారా సూర్య శనివారం కాన్సెప్ట్‌కి కనెక్ట్ అయ్యేలా చేసి.. ప్రేక్షకులకు ‘ఆటవిడుపు’నిచ్చాడు దర్శకుడు. ఇక ‘మధ్యభాగం’ మొదలెట్టిన ఎపిసోడ్ అయితే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. ఆ తర్వాత దయా, అతని సోదరుడు కూర్మానంద్ (మురళీశర్మ), సూర్యలతో ‘దాగుడుమూతలు’ ఆడించి.. ఫైనల్‌గా సోకులపాలెంలో ‘ముగింపు’నిచ్చారు. ఈ కథ మొదలు నుంచి ముగింపు వరకు దర్శకుడు వివేక్ ఆత్రేయ తన మార్క్‌ను ప్రదర్శించాడు. మరీ ముఖ్యంగా దయా పాత్రని రాసుకున్న తీరు, ఆ పాత్రకు తీసుకున్న నటుడి ఎంపికతోనే సినిమా సగం సక్సెస్ కొట్టారు. అలాగే సినిమా అర్థం కావడానికి మినిమమ్ డిగ్రీలు చదవాల్సిన అవసరం లేకుండా.. నీట్‌గా తనదైన శైలిలో దర్శకుడు కథని నడిపించాడు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో పాత్రలని పరిచయం చేస్తూ.. ఆ పాత్రలతో పాటు ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లిన విధానం కాస్త ల్యాగ్ అనిపించినా.. సినిమా గ్రాఫ్‌ను మాత్రం ఎక్కడా పడిపోనివ్వలేదు. సెకండాఫ్‌ మొదలయ్యే యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకు ఎంతో కీలకం. ఆ ఎపిసోడ్‌లో దర్శకుడి రచనా పటిమకు, ‘టైమ్’కు మంచి మార్కులు పడతాయి. ఆ తర్వాత వచ్చే దాగుడుమూతలు కొత్తగా అనిపించినా.. క్లైమాక్స్ మాత్రం కాస్త రొటీన్ అనే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో సాయికుమార్ ఎంట్రీ‌.. కాస్త గ్రాఫ్‌ని నిలబెట్టింది. దీపావళి పాఠం, ఎదురు దెబ్బ ఫిలాసఫీ, ‘ఈగ’ నాని -సమంత, నిజమైన కోపానికి ఇచ్చే వివరణ.. ఇవన్నీ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. వీటన్నింటినీ మించి ఎస్.జె. సూర్య పెర్ఫార్మన్స్, కాపీ-టీ-వాటర్ బాటిల్ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. ఫైనల్‌గా కొన్ని లాజిక్స్ పక్కనెట్టి చూస్తే మాత్రం.. యాక్షన్ నిండిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాలో సరిపోయేంత ఉందనే చెప్పుకోవచ్చు. (Saripodhaa Sanivaaram Movie Review)


Nani-surya.jpg

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమాలో నాని (Natural Star Nani) హీరో. కానీ కొన్ని సీన్లలో నానిని డామినేట్ చేసేంతగా దయా పాత్రలో ఎస్.జె. సూర్య (SJ Suryah) విజృంభించేశాడు. హీరోగా సూర్య పాత్రలో నానిని తక్కువ చేయలేం కానీ.. విలన్‌గా ఎస్.జె. సూర్య స్క్రీన్‌ని నమిలేశాడు. అతిక్రూరమైన శాడిస్ట్ తరహా పాత్రలో ఎస్.జె. సూర్య అభినయం ఈ సినిమాకు ప్లస్.. ప్లస్.. ప్లస్ అంతే. విలనిజంతో నవ్వించడం, క్లాప్స్ కొట్టించుకోవడం అంటే.. అంత సామాన్యమైన విషయం కాదు. కానీ ఎస్.జె. సూర్య తన విలనిజంతో మెప్పించడమే కాకుండా.. మిగతావి కూడా చేసి చూపించాడు. అందుకే ఈ సినిమాలో దయా పాత్రకు ఎస్.జె. సూర్య‌ని తప్ప వేరేకరిని ఊహించలేం. నాని విషయానికి వస్తే.. అంతకు ముందు చేసిన MCA మూడ్‌ని క్యారీ చేస్తూ.. శనివారం వచ్చేసరికి మాత్రం కొత్త తరహా నాని ఇందులో కనిపిస్తాడు. నాని పాత్రలో మెరుపులేం లేవ్ కానీ.. ఆ నేచురాలిటీ మాత్రం మిస్సవలేదు. హీరోయిన్‌గా ప్రియాంక క్యూట్‌గా కనిపించింది. రెండు, మూడు సీన్లు తప్పితే.. ఆమె పాత్రకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. కాస్త స్క్రీన్ స్పేస్ పెరగడానికి నానితో డ్యూయట్స్ కూడా లేవు. సాయికుమార్ ఎప్పటిలానే తన అనుభవాన్ని ప్రదర్శించారు. నాని తల్లి పాత్రలో చేసిన అభిరామి కనిపించింది కొంచెం సేపే అయినా మంచి మార్కులు వేయించుకుంటుంది. మురళీశర్మ పాత్రకు కూడా పెద్దగా స్కోప్ లేదు కానీ.. ఉన్నంతలో తన మార్క్‌ని ప్రదర్శించాడు. హర్షవర్ధన్, శివాజీరాజా, అజయ్, అదితిబాలన్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ వంటి వారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ప్రతి డిపార్ట్‌మెంట్ కూడా తమ ప్రతిభను కనబరిచారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సంగీతం మెయిన్ హైలెట్స్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ పరంగా.. నిడివి విషయంలో కాస్త దృష్టి పెట్టాల్సింది. 174 నిమిషాల నిడివి అంటే దాదాపు 3 గంటల సినిమా ఇది. ఇంతకు ముందు నానితో చేసిన ‘అంటే సుందరానికీ’ విషయంలోనూ వివేక్ ఆత్రేయకు ఈ విషయంలోనే సూచనలు వెళ్లాయి. ఈ సినిమా విషయంలోనూ నిడివి సమస్య అయ్యే అవకాశం ఉంది. కానీ సాధ్యమైనంతగా ఇంకా చెప్పాలంటే పాటలకు ప్రత్యేకంగా టైమ్ ఇవ్వకుండా.. కథలోనే కలిసేలా బ్యాక్‌గ్రౌండ్‌తోనే లాక్కొచ్చారు. ఏ సీన్ కట్ చేస్తే.. సింక్ అవ్వలేదంటూ ప్రేక్షకులు ‘జడ్జిమెంట్ రాంగ్’ అంటారేమో అని అనుకుని ఉండొచ్చు. ఆర్ట్ వర్క్, నిర్మాణ విలువలు, డైరెక్షన్ అన్నీ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. (Saripodhaa Sanivaaram Movie)

ట్యాగ్‌లైన్: సుధా.. సరిపోతుందిరా!

Updated Date - Aug 29 , 2024 | 02:15 PM

Saripodhaa Sanivaaram Trailer: నాని.. 'సరిపోదా శనివారం' ట్రైలర్

Saripodhaa Sanivaaram X Review: నాని ‘సరిపోదా శనివారం’ ఎలా ఉందంటే! ట్విట్ట‌ర్ రివ్యూ

Saripodhaa Sanivaaram: ఉల్లాసంగా.. ఉత్సాహంగా 

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ సెకండ్ సింగిల్ ఉల్లాసం సాంగ్

Saripodhaa Sanivaaram: నాని సినిమా మల్లాది నవల 'శనివారం నాది' స్పూర్తితో తీసిందా?