Saripodhaa Sanivaaram: నాని సినిమా మల్లాది నవల 'శనివారం నాది' స్పూర్తితో తీసిందా?

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:56 PM

నాని కథానాయకుడిగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకుడు. అయితే ఈ సినిమా కథ ఒరిజినల్ కథేనా, లేక ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన 'శనివారం నాది' నవల స్ఫూర్తిగా తీసుకున్నారా? నవలలో ఒక మహిళా పోలీసు పాత్ర కీలకం, సినిమాలో ప్రియాంక మోహన్ పోలీసు పాత్ర లుక్ విడుదల చేశారు. సినిమా టైటిల్, ఈ లుక్ చూస్తుంటే...

Stills from Saripodhaa Sanivaaram and the cover page of Malladi's novel Sanivaaram Naadi

నాని కథానాయకుడిగా, వివేక్ ఆత్రేయ దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'సరోపోదా శనివారం'. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా వచ్చే నెల ఆగస్టులో విడుదలవుతోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే నాని మొదటి లుక్, అలాగే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక మోహన్ లుక్ కూడా విడుదల చేశారు. నాని ఈ సినిమాలో శనివారం నాడు మాత్రమే ఏదైనా చేస్తాడు అనేట్టుగా ఈ సినిమా టైటిల్ చూస్తేనే అర్థం అవుతోంది. అలాగే ప్రియాంక మొహం చారులత అనే పోలీసు పాత్రలో కనబడుతుంది అని విడుదల చేసిన ఆమె లుక్ బట్టి అర్థం అవుతోంది.

saripodhaasanivaaramstills.jpg

ఇంతకీ ఈ సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ ఒరిజినల్ కథనే తీస్తున్నాడా, లేదా ఎక్కడైనా ఏదైనా నవలని స్ఫూర్తిగా తీసుకున్నాడా అని నవలా సాహిత్యం చదివే వాళ్లలో ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన 'శనివారం నాది' అనే నవల అప్పట్లో సంచలం రేపిన సంగతి తెలిసిందే. అదీ కాకుండా మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన చాలా నవలలు సినిమాలుగా వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇప్పుడు 'సరిపోదా శనివారం' కూడా మల్లాది 'శనివారం నాది' అనే నవల నుండి స్ఫూర్తిగా తీసుకున్నారా? అనే ఒక వాదం వినబడుతోంది. అయితే నవలలో కూడా కథానాయకుడు శనివారం అవగానే ఎదో ఒక సంఘటనకి పాల్పడుతూ ఉంటాడు. అందులో కథానాయకుడుకి కొంచెం నెగటివ్ షేడ్స్ ఉంటాయి. అలాగే నవలలో ఒక లేడీ పోలీసు పాత్ర మంగళ చాలా కీలకమైన పాత్ర వుంది. మరి ఇప్పుడు ఈ సినిమాలో కూడా ప్రియాంక మోహన్ పోలీసు పాత్ర చారులతగా చూపించడం చూస్తుంటే, దర్శకుడు మల్లాది నవలని ఏమైనా స్ఫూర్తిగా తీసుకున్నాడా అని అనిపిస్తోంది.

Saripodhaa-Sanivaram-1.jpg

అయితే ఇంతకుముందు నాని నటించిన 'హాయ్ నాన్న' సినిమా కూడా ఇలాగే ఒరిజినల్ కథ అన్నారు. కానీ తీరా చూస్తే అది ఇంతకు ముందు శోభన్ బాబు, మంజుల నటించిన 'మంచి మనుషులు' సినిమాకి కాపీ. అప్పట్లో 'ఆ గలే లగ్ జా' అనే హిందీ సినిమాకి రీమేక్ గా 'మంచి మనుషులు' సినిమా తీస్తే నాని నటించిన 'హాయ్ నాన్న' ఈ రెండు సినిమాలకి ఫ్రీ మేక్ గా తీశారని విమర్శలు వచ్చాయి. ఇప్ప్పుడు 'సరిపోదా శనివారం' కూడా మల్లాది నవలని స్ఫూర్తిగా తీసుకొని చేశారా, లేదా ఏదైనా వేరే సినిమాకి తీసుకొని చేశారా అన్నది, దర్శక నిర్మాతలకి తెలియాలి, లేదా సినిమా విడుదలైన తరువాత తెలుస్తుంది.

Updated Date - Jul 08 , 2024 | 12:56 PM