Thangalaan Review: ‘బంగారం’లాంటి సినిమా..
ABN, Publish Date - Aug 15 , 2024 | 05:54 PM
పొన్నియన్ సెల్వన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత విలక్షణ నటుడు విక్రమ్ నటించిన మరో ప్రయోగాత్మక హిస్టారికల్ చిత్రం తంగలాన్. స్వాతంత్య్రానికి ముందు కోలార్ గోల్డ్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించడంతో పాటు స్టూడియో గ్రీన్‌తో కలిసి నిర్మించారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..
మూవీ పేరు: తంగలాన్
విడుదల తేదీ: 15.08.2024
నటీనటులు: విక్రమ్, పార్వతి తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్
సినిమాటోగ్రఫీ: కిశోర్ కుమార్
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
ఎడిటర్: RK సెల్వ
బ్యానర్స్: స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్
నిర్మాతలు: కెఈ జ్ఞానవేల్ రాజా, పా. రంజిత్
రచన, దర్శకత్వం: పా. రంజిత్
గత కొంతకాలంగా విడుదల వాయిదా పడుతూ ఎట్టకేలకు ‘ఇండిపెండెన్స్’ని పొందింది విక్రమ్ నటించిన హిస్టారికల్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రం ‘తంగలాన్’. రిలీజ్‌కు ముందు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ.. ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఎక్కడా డ్రాప్ అవ్వనీయలేదు. విలక్షణ నటుడు విక్రమ్ చేస్తున్న మరో విలక్షణ చిత్రంగా ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మేకర్స్ వెనకడుగు వేయలేదు. అలా అంతకంతకు అంచనాలను ఈ సినిమా పెంచుకుంటూనే వచ్చింది. హీరో విక్రమ్‌తో పాటు దర్శకుడు పా రంజిత్ కూడా సినిమాలను రూపొందించడంలో తనదైన మార్క్, ఆర్ట్ వర్క్ ప్రదర్శిస్తూ ప్రత్యేక గుర్తింపును పొందారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ని సొంతం చేసుకుంది? ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అందుకుందా? లేదా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం అంటే 18వ శతాబ్దం బ్రిటీష్ హయాంలో కోలార్ గోల్డ్ మైన్స్ పరిసరాల్లో జరిగే కథగా ఈ సినిమా మొదలవుతుంది. ఓ మారుమూల గ్రామంలో ‘తంగలాన్’ తెగకు చెందిన ప్రజలు అంటరానివారిగా నివసిస్తూ ఉంటారు. వారిలో ఈ తెగ పేరే తన పేరుగా ఉన్న తంగలాన్ (విక్రమ్).. భార్య (పార్వతి తిరువోతు), ఐదుగురి పిల్లలతో కలిసి తనకున్న ఐదు గుంటల భూమిలో పంట పండించుకుంటూ జీవిస్తుంటారు. అయితే ఈ భూమిని ఆ ప్రాంత పాలకుడు (జమీన్) లాగేసుకుంటాడు. తంగలాన్ తెగ జీవనం కష్టంగా ఉన్న సమయంలో ఓ బ్రిటీష్ అధికారి అక్కడి గోల్డ్ మైన్స్ నుంచి బంగారం తీయడానికి మనుషులు కావాలని వస్తాడు. అప్పటికే అక్కడి బంగారు గనుల గురించి తన ముత్తాతల కాలంలో జరిగిన సంఘటనలను తంగలాన్ తన పిల్లలకు కథలుగా చెబుతూ వస్తుంటాడు. ఆ బంగారు నిధికి ఓ జాతి, పిశాచాలు వంటి కాపాలా ఉంటాయని, వాటిని దాటుకుని దానిని తీసుకురావడం కష్టమనే విషయం తంగలాన్‌కు తెలుసు. అయినా సరే, బ్రిటీష్ వ్యక్తికి సాయం చేస్తే.. తన జాతి బాగుపడుతుందని, తన భూమి తనకు వస్తుందని తంగలాన్ ధైర్యంగా తనతో పాటు తన తెగకు చెందిన మరికొందరిని తీసుకుని బ్రిటీషర్‌కి సాయంగా వెళతాడు. అలా వెళ్లిన తంగలాన్.. అప్పటి వరకు ఎవరూ సాధించలేని బంగారు నిధిని సాధించగలిగాడా? అసలు ఆరతి (మాళవిక మోహనన్) ఎవరు? తన తెగని ఉన్నతంగా చూడాలనుకున్న తంగలాన్ కల నిజమైందా? తన భూమి తన చేతికి వచ్చిందా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. వెండితెరపై పా. రంజిత్ క్రియేట్ చేసిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా ఆరంభమే పచ్చటి పొలాల మధ్య ప్రారంభమై.. నాటి వారి వ్యవసాయం ఎలా చేశారో చూపిస్తూ క్షణాల్లోనే సినిమాలో లీనమై, ఆ పాత్రల చుట్టే తిరిగేలా చేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా, సస్పెన్స్ మొయింటెన్ చేస్తూ తర్వాత ఏం జరగబోతోందనే ఆసక్తికరమైన పాయింట్‌ను సినిమా చివరి వరకు కంటిన్యూ చేశారు. నాగుపాములతో సీన్స్, మాళవిక మోహనన్‌తో వచ్చే యాక్షన్ సీన్స్ చూసే ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ తెప్పిస్తాయనడంలో ఎలాంటి అతిశయం లేదు. తంగలాన్‌గా విక్రమ్ నటన మెస్మరైజ్ చేస్తుంది. అత్యాశ అనే కాన్సెప్ట్‌తో వెనుకబడిన జాతి ఇతివృత్తంగా పా. రంజిత్ ఓ అద్భుతమైన కథని తయారు చేశాడు. ఈ కథని నోటితో చెప్పడం ఈజీనే కానీ.. తెరరూపమివ్వడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఆ విషయం ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తుంది. ఎక్కడ ఏ కొంచెం తేడా జరిగినా.. పూర్తి సినిమా దెబ్బతినే లక్షణమున్న సినిమా ఇది. కానీ, పా. రంజిత్ అన్ని దినుసులు పర్ఫెక్ట్‌గా సెట్ చేసి, ధైర్యంగా ఈ సినిమాను తెరకెక్కించినందుకు అతనికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఈ సినిమా చూస్తున్నంతసేపు, చూసిన తర్వాత.. ఈ సినిమా కోసం పా. రంజిత్ చేసిన వర్క్, ఈ సినిమా కోసం నటీనటుల కష్టం, ముఖ్యంగా విక్రమ్ కష్టం కళ్లముందే కదలాడుతుంది. పా. రంజిత్ సినిమాలంటేనే ఆర్ట్ వర్క్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి. అలాగే ఆయన టచ్ చేసే పాయింట్ కూడా వివాదాలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో కూడా కొన్ని సన్నివేశాలు అలానే ఉంటాయి కానీ.. తన క్రాఫ్ట్ వర్క్‌తో రంజిత్ మెప్పించాడనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ కథని మలచడం మరో విశేషంగా చెప్పుకోవాలి. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పొందాలి అనుకున్నవాళ్లంతా నిరభ్యంతరంగా ఈ సినిమాని థియేటర్లలో చూడొచ్చు.
నటీనటుల, సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..
విక్రమ్ నటన నభూతతో న భవిష్యత్ అన్న రేంజ్‌లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఓ పది, పదిహేను మంది కమల్‌హసన్‌లు ఏమైనా ఆవహించారా అనేలా తంగలాన్ పాత్రలో విక్రమ్ జీవించేశాడు. ఒకటి కాదు రెండు పాత్రలలో విక్రమ్ కనిపిస్తాడు. రెండు పాత్రలలోనూ విక్రమ్ నటన హైలెట్ అనేలా ఉంది. ఎందుకు ఆయనని విలక్షణ నటుడని అంటారో ఈ సినిమా చూస్తే మరోసారి అర్థమవుతుంది. అలాగే విక్రమ్ భార్యగా పార్వతి, బంగారు నిధి కాపాల యువతిగా మాళవికా మోహనన్ తమ కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒక్కరు అని చెప్పడానికి లేకుండా.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. సాంకేతికంగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. సినిమాటోగ్రాఫర్ కిశోర్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్.. ఇంకా ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్స్ డిజైనర్.. వీరందరికీ కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అక్కడక్కడా కాస్త సాగదీత సన్నివేశాలు ఉన్నప్పటికీ.. తెరపై కనిపించే ప్రపంచంలో ప్రేక్షకులు వాటిని పట్టించుకోరు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్‌గా ‘తంగలాన్’తో ప్రేక్షకులు ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తారు.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే సీన్స్‌తో థ్రిల్ అవుతారు. నటీనటుల అవతారాలు చూసి ఇది మనం చూసే సినిమా కాదులే అనుకుంటే మాత్రం.. ఓ మంచి సినిమాను మిస్ అయినట్లే.
ట్యాగ్‌లైన్: ‘తంగలాన్’.. ‘బంగారం’లాంటి సినిమా..