TrivikramSrinivas: ఆఖరికి విశ్వక్ సేన్ తో ఇప్పటికయినా మొదలెట్టాడు
ABN , First Publish Date - 2023-04-26T16:29:35+05:30 IST
మొత్తానికి దర్శకుడు కృష్ణ చైతన్య సినిమా పట్టాలెక్కింది. విశ్వక్ సేన్ లీడ్ యాక్టర్ గా చేస్తున్నాడు, అంజలి కూడా వుంది. ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకో ముఖ్య వ్యక్తి ఎవరంటే...
దర్శకుడు కృష్ణ చైతన్య (Krishna Chaitanya), విశ్వక్ సేన్ (Vishwak Sen) సినిమా ఈరోజు అధికారికంగా ప్రారంభం అయింది. చాలా రోజుల తరువాత అంజలి (Anjali) మళ్ళీ ఒక తెలుగు సినిమాలో ఇలా కనిపిస్తోంది. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) సూర్యదేవర నాగ వంశీ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య (Soujanya) నిర్మాతగా వున్న ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య ఒక మంచి ప్రతిభ గల దర్శకుడు, అందులో ఎటువంటి సందేహం లేదు, కానీ పాపం అతనికి నిర్మాతలే సరి అయిన వాళ్ళు దొరకటం లేదు.
ఈ కథని కృష్ణ చైతన్య నితిన్ (Nithiin) తో తీయాల్సి వుంది అని, ఆ తరువాత శర్వానంద్ (Sharwanand) దగ్గరికి కూడా వెళ్ళింది అని ఒక భోగట్టా. మొత్తానికి విశ్వక్ సేన్ తో కృష్ణ చైతన్య సినిమా ప్రారంభం అయింది. అయితే ఇది కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) చలవ వల్లనే అని ఒక టాక్ వినపడుతోంది. ఎందుకంటే త్రివిక్రమ్ కి తెలుసు కృష్ణ చైతన్య టాలెంట్, కానీ పాపం అతను ఈ కథని పట్టుకొని చాలా రోజులు తిరిగాడు, అందరూ బాగుంది అంటున్నారు కానీ, ఎందుకో మరి పట్టాలెక్కలేదు.
కానీ త్రివిక్రమ్ ఈసారి తనే ముందుకు వచ్చి ఎలా అయినా కృష్ణ చైతన్యకి బ్రేక్ ఇవ్వాలి అనుకున్నాడు, అందుకే తన భార్యతో మొదలెట్టిన ప్రొడక్షన్ హౌస్, ప్లస్ తను ఏమి చెప్పినా కాదనకుండా చేసే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ కి చెప్పి ఈ సినిమా తొందరగా పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేసి ఈరోజు సినిమా మొదలెట్టడానికి దోహదం చేసాడు.
90వ దశకంలో రాజమండ్రి పరిసరాల నేపథ్యంలో జరిగిన కథతో రూపొందుతోన్న 'VS11' కోసం ప్రముఖ సాంకేతిక నిపుణులను తీసుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) స్వరకర్త, సినిమాటోగ్రాఫర్ గా అనిత్ మధాది, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ నడికుడికర్, ఎడిటర్ గా జాతీయ అవార్డు విజేత నవీన్ నూలి (Naveen Nooli) వ్యవహరిస్తున్నారు. మే నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది అని చెప్పారు.