రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్
ABN, Publish Date - May 09 , 2024 | 07:08 PM
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డుల్ని రాష్ట్రపతి ద్రౌపది (Draupadi Murmu) ముర్ము ప్రదానం చేయగా.. మిగిలిన 65 మందికి గురువారం సాయంత్రం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు.
*AP Elections - Allu Arjun: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఈ అవార్డ్‌ను అందుకునే నిమిత్తం.. బుధవారమే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఢిల్లీకి వెళుతున్న ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. గురువారం ఢిల్లీకి మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తన సతీమణి ఉపాసన (Upasana)తో కలిసి ఈ వేడుకను వీక్షించేందుకు హాజరయ్యారు. చిరంజీవి అవార్డును అందుకునే సమయంలో ఆయన సతీమణి సురేఖ (Surekha), కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన క్లాప్స్‌తో తమ ఆనందాన్ని తెలియజేశారు.
ఇదిలావుండగా.. ఈ ఏడాదిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి సేవలందించిన వారిని పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందించారు. అసాధారణమైన విశిష్ట సేవకు పద్మవిభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు పద్మభూషణ్, విశిష్ట సేవలకు పద్మశ్రీ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది.
Read Latest Cinema News