Kota Factory OTT: ఇండియాస్ ట్రెండ్ సెట్ట‌ర్ వెబ్ సిరీస్‌.. ఇప్పుడు తెలుగులోనూ

ABN, Publish Date - Jun 20 , 2024 | 05:02 PM

మ‌న దేశంలో వెబ్ సీరిస్‌ల‌లో చాలా ప్రాముఖ్య‌త‌, ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ఓ హిందీ వెబ్ సిరీస్ కోటా ఫ్యాక్ట‌రీ కొత్త సీజ‌న్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే రెండు సీజ‌న్లుగా వ‌చ్చిన ఈ సిరీస్‌ ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

Kota Factory

మ‌న దేశంలోని వెబ్ సీరిస్‌ల‌లో చాలా ప్రాముఖ్య‌త‌, ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ఓ హిందీ వెబ్ సిరీస్ కోటా ఫ్యాక్ట‌రీ ( Kota Factory) కొత్త సీజ‌న్ వ‌చ్చేసింది. ఇప్ప‌టికే రెండు సీజ‌న్లుగా వ‌చ్చిన ఈ సిరీస్‌ ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుని ఆల్‌టైమ్ బెస్ట్ షోల‌లో ఒక‌టిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇండియా ఐఎమ్‌డీబీ ర్యాంకింగ్స్‌లో 9.2పైగా రేటింగ్‌తో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. పైగా ఈ సిరీస్ అంతా క‌ల‌ర్‌లో కాకుండా బ్లాక్‌ అండ్ వైట్‌లో సాగ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. మ‌యూర్ మోర్ (Mayur More), జితేంద్ర కుమార్ (Jitendra Kumar), ఉర్వి సింగ్ (Urvi Singh), రేవ‌తి పిళ్లై (Revathi Pillai), అహ్సాస్ చన్నా (Ahsaas Channa) వంటి వారు న‌టించ‌గా రాఘవ్ సుబ్బు దర్శకత్వం వహించారు.

మ‌న దేశంలోనే.. కోచింగ్ సెంటర్ల‌కు బాగా ప్రసిద్ధి చెందిన ఎడ్యుకేషనల్ హబ్ రాజస్థాన్‌లోని కోటా నేప‌థ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేసి ఇంట‌ర్‌లో జాయిన్ అయి JEE and NEET ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతూ ఐఐటీ (IIT) చేరేందుకు వైభ‌వ్ అనే కుర్రాడు చేసిన‌ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ సిరీస్ న‌డుస్తుంది. వైభ‌వ్‌తో పాటు జీతూ, నీనా, ఉద‌య్‌, వ‌ర్తిక‌, సివంగి, మీన వంటి ఐదారు ముఖ్య పాత్ర‌ల చుట్టూనే ఈ సిరీస్‌లో సాగుతుంది. మ‌న దైనందిన జీవితంలో మ‌నకు ఎదురుప‌డే అనేక సంద‌ర్భాలు ఈ సిరీస్‌లో కండ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూయించారు. ఒక్కో ఎపిసోడ్‌ మ‌నం ఒత్తిడుల‌ను ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఎలా చ‌ద‌వాలి, స‌వాళ్ల‌ను ఎలా అధిగ‌మించాలనే మంచి మెసేజ్‌ కూడా ఇస్తుంటాయి.


ముఖ్యంగా తల్లితండ్రుల ఆరాటాలు, కళాశాలల వ్యాపారాలు ఎలా ఉంటాయి, విద్యార్థుల చ‌దువు, అర్థిక‌ కష్టాలు, యవ్వనపు కోరికలు ఎలా ఉంటాయి, వారి మ‌ధ్య‌ పోటీ వాతావ‌ర‌ణం ఏ స్థాయిలో ఉంటుంది, హాస్టల్ జీవితాలు ఎలా ఉంటాయనేది మ‌నం చూసిన, అనుభ‌వించిన ఘ‌ట‌న‌ల‌ను మ‌రోసారి గుర్తుకు తెస్తాయి. ఓ విద్యార్ధికి కొత్త‌గా కోచింగ్ సెంట‌ర్‌లో సీటివ్వ‌డానికి అయా సెంట‌ర్లు ప్ర‌వ‌ర్తించే విధానం, సీటిచ్చిన చివ‌రి సెక్ష‌న్ల‌లో ప‌డేయ‌డం వంటి స‌న్నివేశాలు మ‌న‌కు, మ‌న వాళ్ల‌కు ఎప్పుడో జ‌రిగ‌న‌ట్లే అనిపిస్తుంటాయి. చివ‌రి సెక్ష‌న్లో ఉంటే స‌రైన శిక్ష‌ణ దొర‌క‌ద‌ని, టాప్ 5 సెక్ష‌న్‌లో జాయిన్ కావ‌డానికి వైభ‌వ్ చేసే ప్ర‌య‌త్నాలు మ‌న విద్యా వ్య‌వ‌స్థ‌ల తీరును, విద్యార్థులు ప‌డే తాప‌త్ర‌యం, వారి దైనందిన జీవితం ఎలా ఉంటుంద‌నే స‌న్నివేశాల‌ను చాలా స‌హ‌జంగా చిత్రీక‌రించారు.

ఈ సిరీస్‌లో మొద‌టి రెండు భాగాలు ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోనూ, యూ ట్యూబ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా జూన్ 20 నుంచి కోటా ఫ్యాక్ట‌రీ 3వ సీజన్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుద‌లయింది. వీటిలో మొద‌టి రెండు సీజ‌న్లు తెలుగు భాష‌లోనూ స్ట్రీమింగ్ అవుతుండ‌గా తాజాగా రిలీజైన మూడ‌వ సీజ‌న్ కేవ‌లం హాందీ భాష‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో తెలుగులోనూ తీసుకు రానున్నారు. సో ఆస‌క్తి ఉన్న‌వారు డోంట్ మిస్‌.

Updated Date - Jun 20 , 2024 | 05:02 PM