Chiranjeevi: 100వసారి రక్తదానం.. మహర్షి రాఘవను సత్కరించిన చిరు
ABN, Publish Date - Apr 18 , 2024 | 10:24 AM
మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి నటుడు మురళీ మోహన్.. రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్ప రికార్డ్. ఈ సందర్భంగా మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సత్కరించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ (Chiranjeevi Blood Bank).. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన సంస్థ. ఈ విషయంలో ఈ బ్లడ్ బ్యాంక్ స్థాపకులైన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి అండదండగా నిలుస్తోంది మాత్రం ఆయన అభిమానులే. లక్షలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 26 ఏళ్లుగా నిరంతర సేవలను అందిస్తోంది. ఈ బ్లడ్ బ్యాంకుకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో నటుడు మహర్షి రాఘవ (Maharshi Raghava) కూడా ఒకరు.
*Hari Hara Veera Mallu: ‘ధర్మం కోసం యుద్ధం’ త్వరలో!
మెగాస్టార్ చిరంజీవిపై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి నటుడు మురళీ మోహన్ (Murali Mohan).. రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం. ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం (100th Blood Donation) చేయటం గొప్ప రికార్డ్. మహర్షి రాఘవకు అప్పుడే మెగాస్టార్ ఓ మాటిచ్చారు. అదేంటంటే.. ‘నువ్వు 100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని’ అప్పట్లో రాఘవకు చిరంజీవి (Chiranjeevi) మాటిచ్చారు.
అయితే అనుకోకుండా 100వ సారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నై (Chennai)లో ఉన్నారు. అయినా సరే తన మాటని నిలబెట్టుకున్నారు చిరు. హైదరాబాద్ (Hyderabad) వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం (Blood Donation) చేసిన మురళీ మోహన్‌ను కూడా కలవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరితో పాటు మహర్షి రాఘవ సతీమణి శిల్పా చక్రవర్తి కూడా సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ శేఖర్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు (Chiranjeevi Eye and Blood Bank) సీఓఓ రమణస్వామి నాయుడు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష ఆధ్వర్యంలో మహర్షి రాఘవ రక్తదానం చేశారు. ఈ సందర్భంలో మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఆయన సతీమణి శిల్పా చక్రవర్తి (Shilpa Chakraborty)తో కలిసి ‘ఆపద్బాంధవుడు’ (Aapadbandhavudu) చిత్రంలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 3 నెలలకు ఒకసారి చొప్పున 100 సార్లు రక్తదానం చేయటం గొప్పవిషయమని ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల్లో మహర్షి రాఘవ ప్రప్రథముడని చిరంజీవి అభినందించారు.