Surekha Vani: అమ్మ పుట్టినరోజు, కూతురు సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా...
ABN, Publish Date - Apr 29 , 2024 | 03:42 PM
సురేఖావాణి, ఆమె కుమార్తె సుప్రీత ఇద్దరూ సామాజిక మాధ్యమంలో చాలా హల్ చల్ చేస్తూ వుంటారు. తల్లి కుమార్తెలు ఇద్దరూ ఒకరికొకరు తమపై గల అభిమానం, ప్రేమ సామాజిక మాధ్యమంలో చెపుతూ వుంటారు. ఈరోజు సురేఖా వాణి పుట్టిన రోజు సందర్భంగా కుమార్తె సుప్రీత అమ్మపై ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టింది
తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని క్యారెక్టర్ పాత్రలకి సురేఖ వాణి అయితేనే కరెక్టు అనే భావన చాలామంది ప్రేక్షకులకి వుంది. అక్క, వదిన, కోడలు ఇలా ఏదైనా సురేఖావాణి ఇట్టె ఇమిడిపోతుంది. టీవీలో యాంకరింగ్ తో మొదలుపెట్టి తరువాత చాలా షోస్ కి హోస్టుగా కూడా పని చేశారు సురేఖా వాణి. తరువాత సీరియల్స్ లో నటించారు కానీ 'మొగుడ్స్ పెళ్లామ్స్' ఆమెకి ఎంతో పేరు తెచ్చి పెట్టింది. శివాజీ రాజా ఇందులో కథానాయకుడిగా నటించారు.
ఇలా టీవిలో కూడా బాగా ప్రాచుర్యం పొందిన సురేఖా వాణి సినిమా ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా కూడా పని చేశారు. మొదటిసారిగా 'భద్ర' సినిమాలో రవితేజ కి వదినగా నటించి మంచి పేరు సంపాదించారు. కానీ అందరికీ బాగా గుర్తుండిపోయే పాత్ర మాత్రం చిట్టినాయుడు తల్లిగా శ్రీను వైట్ల సినిమా 'రెడీ'లో. రామ్ పోతినేని, జెనీలియా నటించిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అందరితో పాటు సురేఖా వాణికి ఎంతో పేరు తెచ్చిపెట్టిన సినిమా ఇది.
2008లో ఆ సినిమా విడుదలైనా ఈరోజుకి కూడా ఆ సినిమాలో సురేఖావాణి, చిట్టినాయుడు సన్నివేశాలు మీమ్స్ లో వస్తూ ఉంటాయి అంటే ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత పాపులర్ అయిందో చెప్పనవసరం లేదు. ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా సినిమాలు చేశారు సురేఖా వాణి.
ఈమధ్యనే విడుదలైన 'పారిజాత పర్వం' సినిమాలో ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచారు సురేఖా వాణి. అడపా తడపా తెలుగు, తమిళ సినిమాల్లో కనిపిస్తూనే వున్నా, ఇంతకు ముందులా అయితే ఇప్పుడు క్యారెక్టర్ లు మాత్రం ఎక్కువ రావటం లేదనే చెప్పాలి.
సురేఖావాణి లానే ఆమె కుమార్తె సుప్రీత సామాజిక మాధ్యమంలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఒక సినిమా కూడా చేస్తోంది సుప్రీత. అయితే ఎప్పటికప్పుడు తను ఎక్కడవున్నా తన ఫోటోలను మాత్రం తన అభిమానులకోసం సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ ఉంటుంది సుప్రీత.
ఈరోజు సురేఖావాణి పుట్టినరోజు కావటంతో, తన తల్లి గురించి ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది సుప్రీత. ఇప్పటి యువతరం ఎన్నో మానసిక వొత్తిడులకి లోనవుతారు, అలాంటివారిలో తాను కూడా ఉందని, కానీ తన అమ్మే తనకి మంచి థెరపిస్టు అని చెప్పింది సుప్రీత. తన వెనక తన తల్లి ఎప్పుడూ ఉంటూ తనకి చేదోడువాదోడుగా వున్నందుకు ఆమెకి ధన్యవాదములు చెపుతూనే, తల్లికి లవ్ యు అని చెపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది సుప్రీత. ఈ తల్లి కూతుళ్ళ అనుబంధం చూస్తే చాలా ముచ్చటేస్తుంది.