స్కూల్ అడ్మిషన్లలోనే కులం అనే కాలమ్ తొలగించాలి: దర్శకుడు
ABN, Publish Date - May 14 , 2024 | 03:04 PM
దర్శకుడు అనేవాడు సమాజం చైతన్యం కోసం కృషి చేయాలి. పేర్ల వెనుక ఉన్న కులాల పేర్లను ప్రభుత్వం తొలగించడం భావ్యం కాదు. ఈ పనిచేసే ముందు.. పాఠశాల అడ్మిషన్ సమయంలో కులం అనే కాలమ్ పూర్తిగా రద్దు చేయాలని కోరారు దర్శకుడు పేరరసు. ‘కుళందై కేరాఫ్ గౌండంపాళెయం’ మూవీ ఆడియో వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేఎస్ రవికుమార్ (KS Ravikumar) దర్శకత్వం వహించిన ‘పొన్ విలంగు’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రంజిత్ అనేక చిత్రాల్లో విలన్, సహాయ నటుడుగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో ‘భీష్మర్’ అనే చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. ఇపుడు ‘కుళందై కేరాఫ్ గౌండంపాళెయం’ (Kulanthai Care Of Koundampalayam) అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీపాసతాయ్ మూవీస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో ఆల్ఫినా హీరోయిన్‌గా నటించగా, ఇతర పాత్రల్లో ఇమాన్ అన్నాచ్చి తదితరులు నటించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక తాజాగా నగరంలో జరిగింది. ఇందులో సీనియర్ దర్శకుడు, తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయకుమార్, కోశాధికారి పేరరసు, దర్శకుడు ప్రవీణ్ గాంధీ, స్టంట్ మాస్టర్ కణల్ కన్నన్ సహా పలువురు పాల్గొని ఆడియో రిలీజ్ చేసి, చిత్ర బృందాన్ని అభినందించారు.
*Allu Arjun: నాగబాబు పోస్టు అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేసిందా?
ఈ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు (Director Perarasu) మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో నటించి ఒక మహిళను మోసం చేయడం, అత్యాచారం చేయడం ఒక్కటే. మహిళలను మోసం చేసేవాడిని మృగజాతికి చెందిన వ్యక్తిగా పరిగణించాలి. ఈ సినిమా ట్రైలర్ చూస్తే, ఒక తండ్రి స్థానంలో హీరో రంజిత్ ఉండి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలందరికీ కూడా ఇదే తరహా కోపం రావాలి. దర్శకుడు అనేవాడు సమాజం చైతన్యం కోసం కృషి చేయాలి. పేర్ల వెనుక ఉన్న కులాల పేర్లను ప్రభుత్వం తొలగించడం భావ్యం కాదు. ఈ పనిచేసే ముందు.. పాఠశాల అడ్మిషన్ సమయంలో కులం అనే కాలమ్ పూర్తిగా రద్దు చేయాలి’ అని కోరారు.
దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ (RV Udayakumar) మాట్లాడుతూ.. ఈ సినిమాకు గౌండంపాళెయం అని టైటిల్ పెట్టడం వల్ల ఇది కులానికి చెందిన చిత్రంగా చూడొద్దు. నేను ‘చిన్న గౌండర్’ చిత్రాన్ని తెరకెక్కించిన సమయంలో ఎలాంటి సమస్యలు లేవు. పైగా ఆ చిత్రాన్ని సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిపారు. అందువల్ల ఈ చిత్రాన్ని మరో కోణంలో చూడకుండా హిట్ చేయాలి’ అని కోరారు. ఆ తర్వాత హీరో రంజిత్, హీరోయిన్ ఆల్ఫినా, కణల్ కన్నత్‌తో సహా యూనిట్ సభ్యులు ప్రసంగించారు.
Read Latest Cinema News