Tamannaah, Raashi Khanna: తెలుగు సినిమాకే దిక్కులేదు, డబ్బింగ్ సినిమా పరిస్థితి ఏంటి ?
ABN, Publish Date - Apr 29 , 2024 | 01:00 PM
తెలుగు సినిమాలు చూడటానికే ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావటం లేని ఈ సమయంలో, తమిళ సినిమా అనువాదం చేసి తెలుగులో విడుదల చేస్తున్నారు, ఈ సమయంలో ఎవరైనా పట్టించుకుంటారా అని ఒక చర్చ నడుస్తోంది
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి నడుస్తోంది, దానికి తోడు ఎండలు విపరీతంగా వున్నాయి. అందుకే గత రెండు వారాల నుండి తెలుగు సినిమాలు పెద్దగా విడుదలవడం లేదు, విడుదలైన సినిమాలకి చూడటానికి ప్రేక్షకులే కరువయ్యారు. థియేటర్ కి సినిమాలు చూడటానికి రావటం లేదు ప్రేక్షకులు. కారణం పైన చెప్పిన ఎన్నికలు, ఎండలు, దానికితోడు సాయంత్రం ఐపీల్ మ్యాచులు కూడా ఉండటం.
ఇలా తెలుగు సినిమాలకే దిక్కు లేకుండా పోయింది, మరి ఈ సమయంలో అనువాద చిత్రాలని ఎవరు పట్టించుకుంటారు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన 'బాక్' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది తమిళ సినిమా, తెలుగులోకి కూడా అనువాదం అయింది. ఇందులో తమన్నా భాటియా, రాశి ఖన్నా ఇద్దరూ కథానాయికలు వున్నారు, ఇద్దరూ చాలా గ్లామరస్ గా ఇందులో కనిపిస్తారు అని కూడా అంటున్నారు. సుందర్ సి ఇందులో నటించారు కూడా.
మరి తెలుగు సినిమాలు చూడటానికే ప్రేక్షకులు రావటం లేదు అనుకున్నప్పుడు, ఈ అనువాద సినిమా చూడటానికి ఎవరొస్తారు? ఈమధ్య కొన్ని సినిమాలు ఓటిటి లో ప్రసారం చేసుకోవడానికి ముందుగానే అమ్మేసుకుంటున్నారు, అలా నిర్మాత కొంచెం లాభం పొందుతూ ఉండటంతో, ఇక థియేటర్స్ లో విడుదలైన తరువాత డబ్బులు వస్తే ఏంటి, రాకపోయినా పరవాలేదు అనే భావనతో ఇటువంటి సమయంలో విడుదల చేస్తున్నారు అని ఇంకో టాక్ కూడా వుంది.
ఇప్పుడు 'బాక్' సినిమాకి అసలు ఎటువంటి బజ్ లేనేలేదు. నిన్న ఎదో తెలుగులో ఒక ఈవెంట్ చెయ్యాలి కాబట్టి అన్నట్టుగా ఒకటి చేసేశారు, కానీ ఈ సినిమా విడుదలవుతున్న సంగతే ఎవరికీ తెలియదు. మరి అటువంటప్పుడు ఈ సినిమా విడుదలైన థియేటర్స్ లో నడుస్తుందా? ఒకటి రెండు రోజులు ఆడించి తీసేసే సినిమాలు ఇవన్నీ అని పరిశ్రమలో ఇంకో టాక్ నడుస్తోంది.