Aa Okkati Adakku: మాట్రిమోనీ నేపథ్యంలో తీసిన ఈ సినిమా ఎలా ఉందంటే...
ABN , Publish Date - May 03 , 2024 | 03:40 PM
ఇవివి సత్యనారాయణ 32 సంవత్సరాల క్రితం తీసిన, విజయవంతమైన సినిమా 'ఆ ఒక్కటీ అడక్కు'. ఇప్పుడు అతని తనయుడు అల్లరి నరేష్ అదే పేరుతో వున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంత గొప్ప పేరు పెట్టుకున్న ఈ సినిమా మరి ఎలా వుందో చదవండి.
సినిమా: ఆ ఒకటీ అడక్కు
నటీనటులు: నరేష్, ఫరియా అబ్దుల్లా, జామీ లీవర్, హర్ష చెముడు, హరితేజ, వెన్నెల కిశోర్, అరియనా గ్లోరీ, రాజా తదితరులు
సంగీతం: గోపి సుందర్
ఛాయాగ్రహణం: సూర్య
నిర్మాత: రాజీవ్ చిలక
దర్శకత్వం: మల్లి అంకం
విడుదల తేదీ: 3 మే, 2024
రేటింగ్: 1.5
-- సురేష్ కవిరాయని
అల్లరి నరేష్ తన కెరీర్‌లో ఎక్కువగా వినోదం నేపధ్యంగా వుండే సినిమాలు ఎక్కువ చేశారు. అయితే గత మూడు సంవత్సరాలలో వినోదాన్ని పక్కన పెట్టి, సీరియస్‌గా వుండే కథలను ఎంచుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ వినోదం నేపధ్యంగా వుండే కథతో 'ఆ ఒక్కటి అడక్కు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పేరుతో ఇంతకు ముందు అల్లరి నరేష్ తండ్రి, దర్శకుడు ఇవివి సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్‌తో ఒక పెద్ద విజయవంతమైన సినిమా తీశారు. (Aa Okkati Adakku Movie Review) ఆ పేరునే మళ్ళీ నరేష్ ఇప్పుడు తన సినిమాకి వాడుకున్నారు. ఫరియా అబ్దుల్లా ఇందులో కథానాయిక, మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Aa Okkati Adakku Story కథ:
గణపతి (అల్లరి నరేష్) రిజిస్టర్ ఆఫీసులో పని చేస్తూ ఉంటాడు, అతనికి వయసు పైబడుతున్నా ఇంకా పెళ్లి అవదు. ఆసక్తికరం ఏంటంటే గణపతి తమ్ముడికి పెళ్ళైపోతుంది, అతని భార్య (జామీ లీవర్), పాప కూడా గణపతితోనే వుంటారు. గణపతికి ఎన్ని సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా కుదరకపోవడంతో అతను హ్యాపీ మాట్రిమోనీ అనే ఒక వివాహాలు కుదిర్చే సంస్థలో తన పేరుని నమోదు చేసుకుంటాడు. వాళ్ళు అమ్మాయిల ఫోటోలను, వారి వివరాలని పంపిస్తామని చెపుతారు. ఈలోగా గణపతికి, సిద్ధి (ఫరియా అబ్దుల్లా) అనే అమ్మాయి పరిచయం అవుతుంది, ఆమెతో ప్రేమలో పడతాడు. సిద్ధిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు, కానీ ఆమె ఆ ఒక్కటి అడక్కు అని సమాధానం చెబుతుంది. (Aa Okkati Adakku Movie Review) వివాహాలు కుదిర్చే సంస్థ అమ్మాయిల ఫోటోలు, నంబర్స్ గణపతికి పంపిస్తారు, కానీ అందులో కొంతమందికి వివాహం అయిపోవటం, కొంతమంది చేసుకోను అని చెప్పటం జరుగుతూ ఉంటుంది. నిరాశతో వున్న గణపతి రెండు సార్లు విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడతాడు. అదే సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. అసలు సిద్ధి అనే అమ్మాయి ఎవరు, ఆమె నేపధ్యం ఏమిటి? ఈ మాట్రిమోనీ సంస్థల నిజస్వరూపం ఏంటి? నిజంగానే వాళ్ళు వివాహాలు కుదురుస్తారా, లేక డబ్బులు కోసం మాయమాటలు చెప్పి, ఎవరివో అమ్మాయిల ఫోటోలు, నంబర్లు ఇస్తుంటారా? గణపతి చివరికి ఏమి చేశాడు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా చూడండి.
విశ్లేషణ:
అల్లరి నరేష్ వినోదం నేపథ్యంలో వుండే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అంటే ఆ సినిమాలో మంచి వినోదం ఉంటుందని ప్రేక్షకుడు ఆశిస్తాడు. కానీ ఇక్కడ దర్శకుడు మల్లి అంకం ఈ సినిమాని ఒక వినోదం వుండే నేపథ్యంలోనూ తీయలేకపోయాడు, అలా అని సీరియస్ సినిమా తీశారా అంటే అది కూడా చెయ్యలేకపోయాడు. అసలు చెప్పాలంటే దర్శకుడు ఎంచుకున్న కథ చాలా బలమైనది, కానీ అతను ఆ కథని సరిగ్గా తెరపై చూపించలేకపోయారు. అంటే సరిగ్గా రాసుకోలేకపోయాడు అని చెప్పాలి. ఇలాంటి కథల్లో భావోద్వేగాలు చాలా ముఖ్యం, కానీ సినిమాలో అవి ఎక్కడా కనిపించవు. (Aa Okkati Adakku Review)
దర్శకుడు తీసుకున్న కథా నేపధ్యం చాలా మంచి టాపిక్, ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ మ్యారేజ్ మ్యాట్రిమోనీలు (వివాహ వేదిక) వాటి వెనకాల వున్న అవకతవకల గురించి.. వందల, వేల సంఖ్యలో పెళ్లికాని యువతీయువకులు ఇలాంటి కొన్ని సంస్థలను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు అనే విషయాన్ని దర్శకుడు చెప్పాలని అనుకున్నాడు, కానీ ఈ సినిమాలో ఆ విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోయాడు. చివరి 20 నిమిషాలు సినిమా కొంచెం సీరియస్ గా వుండి దర్శకుడు చెప్పాలనుకున్నదానిపై ఫోకస్ పెట్టాడు, కానీ మిగతా సినిమా అంత మామూలుగా సాగదీస్తూ, ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా వుండేటట్టుగా చూపించాడు.
దానికి తోడు ఈ సినిమాకి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే పేరు కూడా పెట్టారు. ఇదే పేరుతో 32 సంవత్సరాల క్రితం నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ సినిమా తీశారు. అది మొదటి నుండి చివరి వరకు వినోదాత్మకంగా ఉంటూ పెద్ద విజయం సాధించింది. అందులో వినోదంతో పాటు, మాటలు, పాటలు, ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా, ఆహ్లాదంగా ఉంటాయి. ఈ సినిమాకి వచ్చేసరికి ఇందులో అన్నీ మైనస్. పాటలు, మాటలు, సంగీతం అన్నీ సినిమాకి ఎటువంటి ఉపయోగంగా వుండవు, ఛాయాగ్రహణం కూడా మామూలుగా ఉంటుంది. వినోదాత్మక సన్నివేశాలు అన్నీ ఇంతకు ముందు సినిమాల్లో వచ్చినవే. ఈ మాట్రిమోనీ సంస్థల వలన పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు, అలాగే కొన్ని కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయన్నది భావోద్వేగంగా చూపిస్తే బాగుండేది. ఈ సినిమాలో అది లేదు.
ఈమధ్య చిన్నా, పెద్ద ఎటువంటి కథానాయకుడు అయినా అతనికి కొంచెం హైప్, ఎలేవేట్ కావాలని, చెయ్యాలని అనుకుంటున్నారేమో? అందుకనే ఇందులో కూడా నరేష్‌ని పరిచయం చేసే సన్నివేశం ఒక పెద్ద పోరాట సన్నివేశంతో చూపిస్తారు. అది అవసరమా? నరేష్ అనగానే అలాంటివి ప్రేక్షకుడు ఆశిస్తాడా? అసలు కథానాయకుడు అనగానే ఇలాంటి బలవంతంగా పెట్టే సన్నివేశాలు అవసరమా? కథ ఏమి చెప్పాలనుకున్నారో దానిపై దృష్టి పెట్టకుండా, ఇలాంటివి చేస్తేనే సినిమాపై పట్టు పోతుంది. ఈ 'ఆ ఒక్కటి అడక్కు' కథపై దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా ఒక మంచి సినిమా అయి ఉండేది, అలా కాకుండా కేవలం వినోదంపైనే (అది కూడా పండలేదు) దృష్టి పెట్టి సినిమాని ఒక సాదాసీదా మామూలు సినిమాగా చుట్టేశారు అనిపించింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే నరేష్ కి ఇలాంటి పాత్రలు చెయ్యడం కొత్తేమీ కాదు, ఇంతకు ముందు చాలానే చేశాడు. అయితే కథలో బలం లేకపోతే అతను మాత్రం ఏమి చేస్తాడు. ఫరియా అబ్దుల్లా తన పాత్రకి న్యాయం చేసింది కానీ, ఆమె పాత్రని సరిగ్గా రాయలేదు. వెన్నెల కిషోర్ అన్ని సినిమాల్లోనూ ఒకేలా వున్నట్టుగా అనిపిస్తోంది. అదే పాత్ర, అదే వినోదం, చూడటానికి విసుగ్గా వుంది. హర్ష చెముడు కూడా ఈమధ్య ప్రతి సినిమాలో కనిపిస్తున్నాడు, కానీ అతని పాత్ర కూడా రొటీన్ అయిపొయింది. జామీ లీవర్ నరేష్ వదినగా బాగానే చేసింది. హరితేజ పరవాలేదు. అరియనా గ్లోరీ కూడా ఫరియా స్నేహితురాలిగా కనపడుతుంది. మురళి శర్మ రెండో సగంలో కనిపిస్తారు, ఇది అతనికి ఇంకో పాత్ర. అంతే. గౌతమి జడ్జిగా బాగున్నారు. సంగీతం, నేపధ్య సంగీతం, మాటలు, పాటలు ఆసక్తికరంగా లేవు. ఛాయాగ్రహణం అంతంతమాత్రంగానే వుంది.
చివరగా, 'ఆ ఒక్కటి అడక్కు' అనే సినిమా వినోదాత్మకంగా ఉంటుంది అనుకొని వెళ్లిన ప్రేక్షకుడికి తీవ్ర నిరాశే మిగులుతుంది. (Aa Okkati Adakku Movie Review) నాన్న తీసిన సినిమా పేరుతో వచ్చిన నరేష్, సుమారు మూడు సంవత్సరాల తరువాత తనకి బాగా అలవాటైన వినోదం నేపథ్యంలో చేసిన ఈ సినిమాని తొందరగానే మర్చిపోతారు ప్రేక్షకులు.