Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ ట్రీట్!
ABN , Publish Date - May 02 , 2024 | 03:01 PM
కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. తాజాగా అల్లరి నరేష్ ఈ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు.
కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం (Malli Ankam) దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ (Chilaka Productions) బ్యానర్‌పై రాజీవ్ చిలక (Rajiv Chilaka) నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ కొంత గ్యాప్ తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో హీరో అల్లరి నరేష్ (Hero Allari Naresh) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఈ సినిమాకు నాన్నగారి క్లాసిక్ సినిమా టైటిల్ పెట్టడం ఎలా అనిపించింది?
ఖచ్చితంగా బరువుగా వుంటుంది. ఆ సినిమాకి, దీనికి పోలిక పెడతారేమో అని కాస్త ఒత్తిడిగా అనిపించింది. అయితే ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. రకరకాల పేర్లు అనుకున్నప్పుడు.. ఒక సందర్భంలో సడన్‌గా ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని వచ్చింది. నిజానికి ఈ కథకి ఈ టైటిలే యాప్ట్. ఇందులో హీరోకి ఏజ్ బార్ అయినప్పటికీ పెళ్లి కాదు. అందరూ తనని పెళ్లి ఎప్పుడు, పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నావ్ అంటే చిరాకుతో చెప్పే డైలాగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. అలా ఆ పేరే ఈ సినిమాకు పెట్టడం జరిగింది. (Allari Naresh About Aa Okkati Adakku)
*Aa Okkati Adakku: నా ఫ్రెండ్స్ లో కొంతమందికి పెళ్లి కాలేదు, వాళ్ళ పెయిన్ ఆధారంగా..: మల్లి అంకం
కొంత గ్యాప్ తర్వాత.. మళ్ళీ కామెడీ సబ్జెక్ట్ చేయడానికి కారణం?
అన్నీ సమాంతరంగా చేయాలనే అలోచనతోనే వున్నాను. ‘నాంది, మారేడుమిల్లి, ఉగ్రం, నా సామిరంగా’ దేనికవే భిన్నమైన సినిమాలు. కామెడీ కథలు బాగా నచ్చితేనే చేయాలని భావించాను. ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ వుంటేనే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు మల్లి ఈ కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లిని ఇప్పటివరకూ ఫన్‌తో చూపించారు. అయితే ఇందులో దాని వెనుక ఒక సమస్య, స్కామ్, పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల వ్యాపారంను వినోదాత్మకంగా చూపిస్తూనే మంచి సందేశం వుంటుంది. సినిమా అంతా ఫుల్ ఎంటర్‌టైనింగా వుంటుంది. చివరి రెండు రీళ్లలో ఎమోషనల్ టచ్ వుంటుంది. (Allari Naresh Interview)
కొత్త దర్శకుడు ఈ కథ చెప్పినపుడు మీకెలా అనిపించింది?
దర్శకుడు మల్లి ఈ కథ చెప్పినపుడు అందులోని పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలని పరిశోధించే ఈ కథని తయారు చేశారు. కథలో సహజత్వం ఉట్టిపడుతుంది. కామెడీలోనే చక్కని సందేశం వుంది. ప్రస్తుతం పెళ్లి చుట్టూ ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయనేది ఇందులో చూపించిన తీరు ప్రేక్షకులని ఆలోజింపచేసేలా వుంటుంది. మల్లి ఈ కథని చాలా బలంగా రాసుకున్నారు. దీనికి రచయితగా అబ్బూరి రవిగారు తోడయ్యారు. కామెడీ, ఎమోషన్ అద్భుతంగా రాశారు.
కామెడీ, మెసేజ్‌ని ఎలా బ్యాలెన్స్ చేశారు?
సినిమా ఆద్యంతం నవ్వులు పంచినప్పటికీ చివర్లో ఒక మంచి సందేశం వుండాలి. కితకితలు కామెడీ సినిమానే. కానీ అందులో చూపించిన ‘ఇన్నర్ బ్యూటీ’ సందేశం ప్రేక్షకులకు అద్భుతంగా కనెక్ట్ అయ్యింది. నాన్నగారి సినిమాల్లో కూడా అంతర్లీనంగా మంచి సందేశం వుంటుంది. ఈ సినిమాలో చూపించే సందేశం కూడా ప్రేక్షకులని కదిలించేలా వుంటుంది.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లాని తీసుకోవడానికి కారణం?
మల్లి గారు ఈ కథ అనుకున్నప్పుడే హీరోయిన్ ఫరియా అయితే జోడి బావుంటుందని అనుకున్నారు. ఫరియాకి కథ చెప్పడం, కథ నచ్చి చేయడం జరిగింది. తను సెట్స్‌కి వచ్చిన తర్వాత అందరూ మా ఇద్దరి హైట్ గురించి మాట్లాడుకున్నారు. తొలిసారి యాపిల్ బాక్స్ ఎత్తు లేకుండా చేసిన సినిమా ఇది(నవ్వుతూ). తను అద్భుతమైన నటి. మంచి డ్యాన్సర్. చిన్న చిన్న కౌంటర్లు కామికల్‌గా ఇచ్చిన తీరు నన్ను సర్‌ప్రైజ్ చేసింది. తనకి మంచి కామెడీ సెన్స్ వుంది. మా జోడి కూడా చాలా బాగుంటుంది. (Hero Allari Naresh)
చాలా రోజుల తర్వాత కామెడీ సినిమా చేయడం ఎలా అనిపించింది?
కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. ఈ మధ్య కొంచెం ఫైట్లు చేసి బెండు తీరిపోయింది(నవ్వుతూ). మళ్ళీ కామెడీ చేయడం చాలా హ్యాపీగా వుంది. మళ్ళీ కామెడీ సినిమా చేయడం హోమ్ గ్రౌండ్‌లో ఆడినట్లుగా వుంది. కామెడీకి ఇదివరకటి కంటే ఆదరణ పెరిగింది. ‘సామజవరగమన, డీజే టిల్లు’ లాంటి హ్యుమర్ వున్న సినిమాలు బాగా వర్కవుట్ అవుతున్నాయి. కంటెంట్, హ్యుమర్ బావుంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు.
అప్పటి ‘ఆ ఒక్కటీ అడక్కు’లో బాల నటుడిగా చేశారు కదా.. మళ్ళీ ఆ టైటిల్‌తో హీరోగా చేయడం ఎలా అనిపించింది?
సమ్మర్ హాలీడేస్‌కి నాన్నగారు షూటింగ్‌లో వుంటే వైజాగ్ వెళ్లాను. అప్పుడు ఏమీ తెలీదు. నటించమంటే చేసేశాను. తర్వాత సినిమాల్లోకి వచ్చాను. ఈ రోజు అదే టైటిల్‌తో సినిమా చేయడం ఫుల్ సర్కిల్‌లా అనిపించింది. ఇప్పుడు చాలా మంది అది ఈవీవీ గారి సూపర్ హిట్ టైటిల్ తెలుసా?అంటే.. నాకే కొంచెం టెన్షన్ వస్తుంది. అయితే టైటిల్ తప్ప, ఆ సినిమాకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా గమ్మత్తుగా వుంటుంది. మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్‌లో పని చేస్తుంటాడు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తుంటాడు కానీ తనకి పెళ్లి కాదు. అది ఇంకా ఫస్ట్రేషన్ (నవ్వుతూ)
గతంలో మీ నుంచి ఏడాదికి కనీసం మూడు సినిమాలు ఉండేవి?
ఇకపై మళ్లీ ఉంటాయి. ఇప్పటికే ‘నా సామిరంగ’ వచ్చింది. మే 3న ఈ సినిమా వస్తుంది. ‘బచ్చల మల్లి’ జూలై లేదా ఆగస్ట్‌లో రావచ్చు. డిసెంబర్‌లో మరో సినిమా వచ్చే అవకాశం వుంది.
డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు?
ప్రస్తుతం నా దృష్టి నటనపైనే వుంది. దర్శకత్వం చేసే ఆలోచనలు ప్రస్తుతానికి లేవు. అందరూ ‘సుడిగాడు 2’ కోసం అడుగుతున్నారు. ఓ ఐడియా వచ్చింది. అది రాస్తున్నా.
‘పెళ్లి’ అనేది యూనివర్సల్ పాయింట్ కదా.. ఈ సినిమా మిగతా భాషల్లో చేసే ఆలోచన ఉందా?
నిజానికి నిర్మాత రాజీవ్‌కి ఈ ఆలోచన వుంది. బాలీవుడ్‌లో చేయాలని అనుకున్నారు. అయితే ఇక్కడ ఫ్రూవ్ చేసుకొని అక్కడ చేసే అవకాశం వుంది.
నిర్మాత రాజీవ్ గురించి?
-రాజీవ్ చాలా మంచి నిర్మాత. ఆయనకి యానిమేషన్ కంపెనీ వుంది. ఛోటా భీమ్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇది ఆయనకు తొలి సినిమా అయినప్పటికీ సినిమాపై ఆయనకు పూర్తి అవగాహన వుంది. చాలా పాషన్ వున్న నిర్మాత. అలాంటి నిర్మాత మన ఇండస్ట్రీకి అవసరం. అలాంటి నిర్మాతకు సక్సెస్ వస్తే నాలుగు సినిమాలు చేస్తారు. నాలుగు కుటుంబాలు బ్రతుకుతాయి.
జామీ లివర్ (Jamie Lever) గురించి?
యంగ్ కోవై సరళ లాంటి పాత్ర కావాలన్నపుడు జామి లివర్‌ని ఎంపిక చేశాం. తను అద్భుతమైన ఆర్టిస్ట్. తను సోషల్ మీడియాలో చేసే కామెడీ వీడియోలు అదిరిపోతాయి. ఈ సినిమా తనకి కలిసొచ్చి తెలుగులో మరిన్ని చిత్రాలు చేస్తుందని ఆశిస్తున్నాను.
ఈ వారం మీ సినిమాతో పాటు దాదాపు నాలుగు సినిమాలు వస్తాయి కదా.. ఈ పోటీని ఎలా చూస్తారు?
సమ్మర్ సినిమాల సీజన్. ఈ సమ్మర్‌లో పెద్దగా సినిమాలు రాలేదనే చెప్పాలి. ‘ఆ ఒక్కటీ అడక్కు’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ అంతా చూసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా. మంచి సీజన్‌లో వస్తుంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి. అందులో నా సినిమా కూడా వుండాలని కోరుకుంటున్నాను.
ఈవీవీ బ్యానర్ మళ్ళీ మొదలుపెడతారా?
కథలు వింటున్నాము. ఆ బ్యానర్‌లో చేయదగ్గ కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. ‘ఎవడిగోల వాడిది’ లాంటి సినిమా చేయాలని నా కోరిక.
ఇంకా ఎలాంటి జోనర్ సినిమాలు చేయాలనుకుంటున్నారు?
అన్నీ రకాల సినిమాలు చేయాలి. డార్క్ హ్యుమర్ వున్న కథలు చేయడానికి కూడా ఇష్టపడతాను. ప్రేక్షకులు ఇప్పుడు కథలో నుంచి పుట్టిన కామెడీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి కథలపై దృష్టిపెడుతున్నాను. అలాగే ‘పుష్పక విమానం’ వంటి మూకీ సినిమా చేయాలని వుంది. ఇంకా ‘జోకర్’ లాంటి క్యారెక్టర్ చేయాలని వుంది. మనం నవ్వుతుంటే ఆడియన్స్ భయపడాలి.
ఏ హీరోలతో కలిసి పని చేయాలని వుంది?
వెంకటేష్‌గారితో కలిసి చేయాలని వుంది. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. ఆయన నేను కలసి ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. అలాగే అందరి హీరోలతో చేయాలని వుంటుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారితో ఒక్క సీన్ అయిన షేర్ చేసుకోవాలని వుంటుంది.
కొత్తగా చేస్తున్న సినిమాలు?
‘బచ్చల మల్లి’ షూటింగ్ జరుగుతోంది. మరో రెండు ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాను. త్వరలోనే చెబుతాను.
Read Latest Cinema News