Tollywood Box Office: ఈ వారం అయినా హౌస్ ఫుల్ బోర్డు కనిపించిందా?
ABN, Publish Date - May 06 , 2024 | 12:26 PM
గత శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి, అందులో 'ప్రసన్న వదనం' సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా, సినిమా చూడటానికి ప్రేక్షకులు రావటం లేదు. ఎన్నికల హడావిడి, ఎండలు, ఐపీఎల్ కారణం అని అంటున్నారు. ఇంతకీ ఒక్క సినిమా ఒక్క ఆట అయినా హౌస్ ఫుల్ అయిందా?
సుమారు నాలుగైదు వారాలు అయి ఉంటుంది 'టిల్లు స్క్వేర్' విడుదలై, ఎందుకంటే ఆ చిన్న సినిమాకి వచ్చినట్టుగా ఈమధ్య కాలంలో ఏ సినిమాకి రాలేదు ఓపెనింగ్స్, అంతలా వచ్చాయి. 'టిల్లు స్క్వేర్' పెద్ద విజయం సాధించింది. ఆ తరువాత వరసగా సినిమాలు విడుదలవుతున్నాయి కానీ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించటం లేదు. విజయం మాట అటుంచితే, కనీసం ఒక్క సినిమా కూడా హౌస్ ఫుల్ బోర్డు కూడా పెట్టలేదంటే, సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అర్థం చేసుకోవచ్చు.
గత శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటి అడక్కు'. మల్లిక్ అంకం దర్శకుడు ఈ సినిమాకి. ఈ సినిమా ఒక మంచి సామజిక సమస్యని తీసుకొని చేసింది, కానీ దర్శకుడు ఆ సమస్యని వెండితెరపై సరిగ్గా ఆవిష్కరించలేకపోయాడు అని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఈ సినిమా మొదటి రోజు ఎటువంటి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది, కానీ రెండోరోజు కలెక్షన్స్ కొంచెం పరవాలేదు అన్నారు. ఆదివారం కూడా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వున్న ఈ సినిమా నడవటం చాలా కష్టం అని చెపుతున్నారు ట్రేడ్ అనలిస్ట్స్.
ఇక సుహాస్, రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ నటించిన 'ప్రసన్నవదనం' సినిమాకి మంచి విశ్లేషణలు వచ్చాయి కానీ, ఈ సినిమాని చూడటానికైతే మాత్రం ప్రేక్షకులు కరువయ్యారు. సుకుమార్ దగ్గర పని చేసిన వైకె అర్జున్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్నికల ప్రచార హడావిడిలో ప్రజలు ఉన్నందున, తరువాత ఐపీఎల్ మ్యాచులు, దానికితోడు ఎండలు ఇలా అన్నీ ఇదే సమయంలో ఉండటంతో, ఈ సినిమా బాగుంది అన్నా కూడా ఎవరూ చూడటం లేదు.
ఇక 'బాక్' సినిమా పరిస్థితి కూడా అంతే. మిగతా సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా శని, ఆదివారాలు కలెక్షన్స్ కొంచెం పరవాలేదు. కానీ ఆ కలెక్షన్స్ అసలు సరిపోవు అని చెపుతున్నారు. అందుకని ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడినట్టే కనిపిస్తోంది. ఎక్కడ కూడా హౌస్ ఫుల్ బోర్డు మాత్రం కనిపించలేదు ఈ సినిమాకి కూడా. సుందర్ సి దర్శకుడు, కథానాయకుడు ఈ సినిమాకి. ఇందులో తమన్నా, రాశి ఖన్నా కథానాయికలు. ఇంకొక సినిమా 'శబరి' అసలు విడుదలైనట్టు కూడా ప్రేక్షకులకి తెలీదు.
ఇలా నాలుగు సినిమాలు విడుదలై, ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రభావం చూపించలేకపోయాయి. ఈ రాబోయే శుక్రవారం కూడా కొన్ని సినిమాలు విడుదలకు వున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి, కాబట్టి అంతవరకు బాక్స్ ఆఫీస్ బోసిపోవాల్సిందే అని అంటున్నారు. ఆ తరువాత విడుదలయ్యే సినిమాలు ఎలా వుంటాయో చూడాలి మరి.