మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tabu: ఇప్పుడు అలా కాదు.. కాలం మారిందిలా

ABN, Publish Date - Apr 14 , 2024 | 04:01 PM

నాలుగు దశాబ్దాలుగా తెర మీద కనపడుతోంది. బాలీవుడ్‌తోపాటుదక్షిణాది భాషల్లోనూ నటిగా ఆమె క్రేజ్‌ వేరు. ఆమే.. టబు. ఇటీవలే ‘క్రూ’ చిత్రం విడుదలైన సందర్భంగా టబు గురించి కొన్ని విశేషాలు..

నాలుగు దశాబ్దాలుగా తెర మీద కనపడుతోంది. బాలీవుడ్‌తోపాటుదక్షిణాది భాషల్లోనూ నటిగా ఆమె క్రేజ్‌ వేరు. ఆమే.. టబు. ఇటీవలే ‘క్రూ’ (Crew) చిత్రం విడుదలైన సందర్భంగా టబు (Tabu) గురించి కొన్ని విశేషాలు..

ఇటీవలే కరీనా కపూర్‌, కృతిసనన్‌తో కలసి టబు ఎయిర్‌ హోస్టుగా  ‘క్రూ’ చిత్రంలో నటించింది. ఈ కామెడీ ఫిల్మ్‌లో టబు నటనకు ఫిదా అవుతున్నారు. టబు ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు నలభై రెండేళ్లయింది.. అంటే ఎవరూ నమ్మరు. అయినా ఇప్పటికీ నటిగా ఆమె ఏమాత్రం తగ్గలేదు. ‘మేల్‌ ఓరియంటెడ్‌ ఇండస్ట్రీలో ఓ ముగ్గురు కథానాయికలం కలసి వందకోట్ల వసూళ్లను సాధించాం. ఇదెంతో ఆనందం’ అంటుంది టబు.

ఇదీ నేపథ్యం

టబు నేపథ్యం హైదరాబాద్‌తో ముడిపడి ఉంటుంది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. పూర్తి పేరు తబస్సుమ్‌ ఫాతిమా హష్మీ. తన తండ్రి పాకిస్తాన్‌ నటుడు. పేరు జమాల్‌ అలీ హష్మీ. తల్లి పేరు రిజ్వానా. ‘మా అమ్మ నుంచి విడిపోయాక మా అమ్మమ్మతో కలసి హైదరాబాద్‌నుంచి మనాలి వెళ్లిపోయాం. అక్కడ రెండు పెంపుడు కుక్కలు, చేపలు నా ప్రపంచం. మా పూర్వీకులు అంతా చదువుకున్నవాళ్లే. అమ్మమ్మ దగ్గర ప్రపంచం అర్థమైంది. పుస్తకాల నుంచి ఉర్దూ కవిత్వం వరకూ చదివా. 1975-76 ప్రాంతంలో చిన్నప్పుడు అమ్మమ్మతో, కజిన్స్‌తో కలసి సాయంత్రాల్లో సినిమా చూడటం, వీధి చివర దోశలు తినటం బాగా గుర్తు. మా అమ్మమ్మతో సంభాషించేప్పుడు సినిమాల కంటే ఉర్దూ కవిత్వమే డామినేట్‌ చేసేది’ అంటుంది టబు.

అలా ఇండస్ట్రీలోకి..

స్కూలింగ్‌ చదివేప్పుడే ‘బజార్‌’ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత దేవానంద్‌ కూతురిగా పధ్నాలుగేళ్ల వయసులో ఓ సినిమా చేసింది. అయితే కథానాయికగా ఆమె తొలి చిత్రం ‘కూలి నంబర్‌ 1’ (తెలుగు) కావటం విశేషం. ‘జీత్‌’ తర్వాత .. 1996 సంవత్సరంలో వచ్చిన ‘కాదల్‌ దేశం’ (ప్రేమదేశం) చిత్రంతో ఆమె దక్షిణాదిలో పాపులర్‌ అయింది. అదే ఏడాది ‘మచ్చిస్‌’ చిత్రంతో నటిగా జాతీయ అవార్డు దక్కించుకుంది. ‘ఇరువర్‌’, ‘చాచి 420’, ‘బివి నంబర్‌ వన్‌’ ‘హమ్‌ సాత్‌ సాత్‌ హే’, ‘చాందినీ బార్‌’, ‘మక్బూల్‌’, ‘మీనాక్షి- ఎ టేల్‌ ఆఫ్‌ త్రీ సిటీస్‌’, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘హైదర్‌’, ‘దృశ్యం’, ‘అందాధూన్‌’.. ఇటీవల వచ్చి ‘క్రూ’ చిత్రం వరకూ టబు పాత్రలు గుర్తుండిపోయేవే. అందుకే ఆమె నటనకు జాతీయస్థాయిలో క్రేజ్‌ ఉంది.

భిన్నంగా ఉంటా...

‘కొత్త పాత్రలు వస్తే వదులుకోను. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించాలి. చిన్నప్పటి నుంచీ ఇదే తీరు. ‘మక్బూల్‌’, ‘చాందినీ బార్‌’, ‘హైదర్‌’ లాంటివి అలాంటివే. ఫలానా దర్శకుడు మంచి కథనంతో వచ్చి ‘మీరైతే సరిపోతారు ఈ పాత్రకు’ అంటుంటారు. ఇది నిజంగా గొప్ప విషయం అనిపిస్తుంది. నాకోసమే పాత్రలు రాసే రచయితలున్నారు. ఇప్పటి వరకూ 92 చిత్రాల దాకా నటించా. అన్ని చిత్రాల స్ర్కిప్టును చదివా. 1990ల్లో రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసిన సందర్భాలెన్నో. ఏడాదికి పన్నెండు చిత్రాలు విడుదలయ్యేవి. ఇప్పుడు అలా కాదు.. ఏడాదికి రెండు చిత్రాల్లో నటిస్తే గొప్ప విషయం. కాలం మారిందిలా. మెయిన్‌  స్ట్రీమ్  ప్రేక్షకులు మారిపోయారు. కొత్త కాన్సెప్టులు ఉంటేనే చూస్తున్నారు. ఇచ్చిన పాత్రలో ప్రేక్షకులను ఎలా మెప్పించామన్నదే యాక్టర్‌కు ఉన్న సవాల్‌. ’’

Indian 2: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో  బిజీ... విడుదల అప్పుడే. 


Updated Date - Apr 14 , 2024 | 04:03 PM