Prithviraj Sukumaran: ఆ తరహా సన్నివేశాలు చిత్రీకరించలేదు.. అది అపోహ మాత్రమే!
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:09 PM
మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అమలాపాల్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్). బెన్నీ డానియల్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించారు.
మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumara) అమలాపాల్ (Amala paul) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్- the goat life). బెన్నీ డానియల్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించారు. కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్ ‘గోట్ డేస్’ను రచించారు. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళీ నవల ఇది. దీనిని చిత్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి ‘ఆడు జీవితం’ను తెరకెక్కించారు. మార్చి నెలాఖరులో విడుదలైన ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సన్నివేశం తీవ్ర చర్చకు దారి తీసింది. ‘గోట్ డేస్’లో రాసిన విధంగా ఓ వివాదాస్పద సన్నివేశాన్ని చిత్రబృందం షూట్ చేసిందని.. సెన్సార్ అంగీకరించకపోవడంతో దాన్ని తొలగించారని ఆన్‌లైన్‌లో ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. తాము అలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించలేదని వివరణ ఇచ్చారు. ‘‘మేం అలాంటి సీన్ చేయలేదు. సినిమాలో హీరో పాత్ర అలా ప్రవర్తించకూడదని మా దర్శకుడు భావించాడు. 2008లో బ్లెస్సీ ఈ కథతో నా వద్దకు వచ్చినప్పుడు.. ఆ పాత్రకు ఏవిధంగా న్యాయం చేయాలని ఆలోచించా. నవల ప్రకారం ఆ పాత్రను అర్థం చేసుకోవాలా? లేదా బ్లెస్సీ చెప్పిన విధంగా ఊహించుకోవాలా? అని తొలుత గందరగోళానికి గురయ్యా. చివరకు నేనూ - బ్లెస్సీ ఒక నిర్ణయానికి వచ్చి.. ప్రేక్షకులకు చేరువయ్యేలా దానిని తీర్చిదిద్దాం’’ అని అన్నారు.
నజీబ్ పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ 31 కిలోల బరువు తగ్గారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో 72 గంటల పాటు భోజనం లేకుండా కేవలం మంచి నీళ్లు, కొద్దిగా బ్లాక్ కాఫీ మాత్రమే తాగి ఆయన నటించారని దర్శకుడు చెప్పారు.