Vincy Aloshious: అందరి వేళ్ళు షైన్ టామ్ చాకో వైపే...

ABN, Publish Date - Apr 17 , 2025 | 03:06 PM

మలయాళంతో పాటు తెలుగులోనూ పలు చిత్రాలలో నటించిన షైన్ టామ్ చాకో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మలయాళ నటి విన్సీ... ఆరోపణలు చేసింది షైన్ మీదనే అని తెలుస్తోంది. ఆమె అతనిపై ఫిల్మ్ ఛాంబర్ లోనూ ఫిర్యాదు చేసిందట.

ప్రముఖ మలయాళ నటి విన్సీ అలోషియన్ (Vincy Aloshious) ఓ మలయాళ నటుడు డ్రగ్స్ మత్తులో తనపై అనుచితంగా ప్రవర్తించాడని చెప్పడంతో అతను ఎవరై ఉంటాడా? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేశారు. ఆమె నటించిన 'సూత్రవాక్యం' మూవీలో కీలక పాత్రలు పోషించిన వారిపై పలు అనుమానాలు రేకెత్తాయి. అయితే... చాలామంది విన్సీతో అసభ్యకరంగా ప్రవర్తించింది షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) అనే నిర్థారణకు వచ్చారు. అతని గత కాలపు చరిత్ర గురించి తెలిసినవారు దీనిని స్పష్టం చేశారు.


నటుడిగా చక్కని పేరు తెచ్చుకున్న షైన్ టామ్ కు మాదక ద్రవ్యాలను తీసుకునే అలవాటు ఉందని సన్నిహితులు చెబుతుంటారు. పలు సినిమాల షూటింగ్స్ కు అతను మత్తు ముందు తీసుకునే పాల్గొనే వాడనే వారూ లేకపోలేదు. అలానే విన్సీతో కలిసి 'సూత్రవాక్యం' (Soothravakyam) షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అతనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటాడనే నిర్ణయానికి వచ్చేశాడు. పైగా షైన్ టామ్ చాకో ను కొకైన్ కు సంబంధించిన కేసులో 2015లో పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఇక తాజాగా ఇన్ స్టాగ్రామ్ వీడియలో తన ఆవేదనను వ్యక్తం చేసిన విన్సీ అలోషియన్ ఇప్పుడు కేరళలోని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోనూ చిత్ర నిర్మాణ సంస్థకు కూడా ఫిర్యాదు చేసిందట. మరి విన్సీ చేసిన ఆరోపణలపై షైన్ టామ్ చాకో ఎలా స్పందిస్తాడో చూడాలి. షైన్ టామ్ చాకో... తెలుగులోనూ 'దసర, దేవర, డాకు మహరాజ్, రంగబలి' తదితర చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు.

Also Read: Nazriya Nazim Fahadh: ఫహద్ రియాక్షన్ ఏమిటో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 17 , 2025 | 03:24 PM