Singer Pravashti: పాడుతా తీయగా పై ఫైర్ అయిన సింగర్

ABN, Publish Date - Apr 21 , 2025 | 02:01 PM

పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ నుండి ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి... అక్కడ తనకు జరిగిన అవమానాన్ని వీడియో రూపంలో బయట పెట్టింది.

పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎస్. బి. బాల సుబ్రహ్మణ్యం (S. P. Bala subrahmanyam) చేసిన గొప్ప పనుల్లో ఒకటి 'పాడుతా తీయగా' (Padutha Teeyaga) కార్యక్రమాన్ని నిర్వహించడం. 1996లో మొదలైన ఈ కార్యక్రమం ఆయన మరణానంతరం కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోని వేలాది మంది గాయనీ గాయకుల ప్రతిభను బాలు వెలికి తీశారు. మట్టిలో మాణిక్యాల వంటి వారి గాత్రానికి మరింత మెరుగులు దిద్ది వారిని సూపర్ సింగర్స్ ను చేశారు. సినిమా రంగంలోనూ వారికి అవకాశం వచ్చేలా చూశారు. ఇవాళ తెలుగు చిత్రసీమలో ఉన్న ప్రముఖ గాయనీ గాయకులు 'పాడుతా తీయగా' లో ఒకప్పుడు పాల్గొన్న వారే! బాలు కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ (S.P. Charan) 'పాడుతా తీయగా' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకూ మచ్చ పడకుండా సాగిపోయిన ఈ కార్యక్రమంపై ఇప్పుడు నీలినీడలు అలుముకున్నాయి. ముఖ్యంగా గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొని బాలు నుండి ప్రశంసలు అందుకున్న గాయని ప్రవస్తి (Singer Pravasthi) విమర్శనాస్త్రాలు సంధించింది.


ప్రస్తుతం ప్రసారం అవుతున్న 'పాడుతా తీయగా' సిల్వర్ జూబ్లీ ఎపిపోడ్స్ పై ప్రవస్తి తన అసంతృప్తిని వెల్లడించింది. గతంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా సిల్వర్ జూబ్లీలోనూ ఆమెకు నిర్వహకులు అవకాశం కల్పించారు. అయితే ఈ ప్రోగ్రామ్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత గత కొంతకాలంగా 'పాడుతా తీయగా'లో తనకు జరిగిన చేదు అనుభవాలను ప్రవస్తి బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఆమె తన అసంతృప్తిని వెళ్ళగక్కింది. ఎలిమినేట్ అయినందుకే ఆమె ఇలా మాట్లాడుతోందనే కామెంట్స్ కూడా నెటిజన్స్ నుండి వచ్చాయి. అయితే... వాళ్ళలో చాలామందివి ఫేక్ అక్కౌంట్లు కావడంతో... వారిపై ప్రవస్తి ఎదురు దాడికి దిగింది. తనతో పాటు ఆ పోటీలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ తమ అభిమానులతో తనపై దూషణ పర్వం మొదలు పెట్టారని ఆమె ఆరోపించింది.

కార్యక్రమ నిర్వాహకులైన జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ మీదనే కాకుండా... 'పాడుతా తీయగా' న్యాయనిర్ణేతలపైనా ప్రవస్తి విమర్శలు చేయడం విశేషం. ప్రముఖ గాయని సునీత (Suneetha)... ఎంతో అందమైన వారని పొగుడుతూనే ఆమె మనసు అంత అందమైంది కాదని తేల్చిచెప్పేసింది ప్రవస్తి. తాను ఎప్పుడు పాడటానికి సిద్థమైనా సునీత ఏదో ఒక వంక పెట్టేవారని, అలానే తన తోటి న్యాయనిర్ణేతలను ఇన్ ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించేవారని ప్రవస్తి ఆరోపించింది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) గురించి మంచి మాటలు చెబుతూనే లిరికల్ గా తాను తప్పు పాడితే వేలెత్తిచూపిన ఆయన, మరికొందరు సింగర్స్ విషయంలో ఆ పని చేయలేదని తెలిపింది. ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) ని సైతం ప్రవస్తి వదిలిపెట్టలేదు. గాయనీ గాయకులంటే ఆయనకు గౌరవం లేదని చెప్పింది. ఇక కాస్ట్యూమ్స్ విభాగం వారు తనను బాడీ షేమింగ్ చేసేవారని, బొడ్డు కిందకు చీరకట్టమని చెప్పేవారని వాపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి చేదు అనుభవాలు తనకు ఎదురు కాలేదని, ఇప్పుడింతా దారుణంగా వ్యవహరించడం చూసి తట్టుకోలేకే ఈ విషయాలను బయటపెడుతున్నానని తెలిపింది. మంచి గాయని కావాలనే తన కోరిక ఈ విమర్శల కారణంగా తీరదని తెలుసని, గాయనిగా ఇక తనకు భవిష్యత్తు ఉండదని అనుకుంటున్నానని, అన్నింటికీ సిద్థపడే ఈ విమర్శలు చేస్తున్నానని ప్రవస్తి చెప్పింది. మరి 'పాడుతా తీయగా' నిర్వాహకులు ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: Yash: రావణపాత్రలోకి అడుగుపెట్టబోతున్న యశ్

Also Read: Nithiin: విజయం కోసం తమ్ముడు తహతహ...

Also Read: NTR: ఆడవేషంలో పెద్దాయన....

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 21 , 2025 | 02:01 PM