Naani: రూమర్స్ కు ఘాటుగా బదులిచ్చిన 'పారడైజ్' టీమ్
ABN, Publish Date - Apr 03 , 2025 | 02:06 PM
నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ మంచి విజయాన్ని అందుకుంది. నాని హీరోగా నటించిన 'హిట్ -3' మే 1న విడుదల కాబోతోంది. ఈ టైమ్ లో నాని 'ది ప్యారడైజ్' మూవీపై కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నేచురల్ స్టార్ నాని (Naani) సహజంగా ఎవరి విషయంలోనూ అనవసరంగా జోక్యం చేసుకోడు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. విజయాలు లభిస్తే పొంగిపోవడం, అపజయాలకు కృంగిపోవడం అతనికి అలవాటు లేవు. చిత్రసీమలో దాదాపు రెండు దశాబ్దాలుగా ఉన్న నాని వివాదాల జోలుకు వెళ్ళింది. తాజాగా ప్రశాంతి తిపుర్నేనితో కలిసి నాని నిర్మించిన 'కోర్ట్' (Court) సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిన్న సినిమా అతి తక్కువ రోజుల్లోనే రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే మే 1న విడుదల కాబోతున్న తన సినిమా 'హిట్ 3' (Hit -3) ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాడు నాని.
ఇదే సమయంలో నాని నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise) కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. 'ది ప్యారడైజ్'కు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయని, నానికి ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో దీనిని పక్కన పెట్టాడని చెబుతూ రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'దసరా' సినిమాలోని రా అండ్ రస్టిక్ ను చూసి కొందరు తట్టుకోలేకపోయారు. లవర్ బోయ్ గా ఉండే నానితో ఇలాంటి రగ్గడ్ క్యారెక్టర్ చేయించారేమిటీ? అని ఆశ్చర్యపోయారు. అయితే నాని ఆ పాత్రను నూరు శాతం నమ్మారు. దానికి ప్రాణం పోశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'దసరా' మంచి విజయాన్ని అందుకోవడమే కాదు... నానిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిందనే పేరు తెచ్చిపెట్టింది. అందుకే వెంటనే శ్రీకాంత్ ఓదెల రెండో ప్రాజెక్ట్ 'ది పారడైజ్'కు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు... శ్రీకాంత్ ఓదెల తో మెగాస్టార్ చిరంజీవికి ఓ కథ చెప్పించి, ఆయన నుండి అనుమతి తీసుకున్నాడు. ఈ సినిమాకు నాని కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. నాని, శ్రీకాంత్ ఓదెల మధ్య ఇంత బలమైన మైత్రీ బంధం ఉంటే... వారి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ వార్తలు రావడం 'ది ప్యారడైజ్' టీమ్ ను అప్ సెట్ కు గురిచేసింది. దాంతో 'గజరాజు నడిస్తే గజ్జికుక్కలు అరుస్తాయి' అంటూ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా బదులిచ్చింది. అంతేకాదు... తెలుగు సినిమా రంగం గర్వపడేలా 'ది ప్యారడైజ్'ను తెరకెక్కించబోతున్నామని, త్వరలోనే తమ సత్తా ఏమిటనేది అందరికీ తెలుస్తుందని టీమ్ తెలిపింది.
నిజానికి గతంలోనూ నాని సినిమాలు కొన్ని పరిమితి దాటిన బడ్జెట్ కారణంగా ఆగిపోయాయని, మరికొన్ని చేతులు మారాయని వార్తలు వచ్చాయి. కానీ ఇలాంటి వాటిని నాని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. తనకు నచ్చిన నిర్మాతలతో, నచ్చిన స్క్రిప్ట్ తో ముందుకు సాగాడు. 'ది ప్యారడైజ్' మూవీ ప్రకటన వచ్చినప్పుడు కంటే... దాని టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది దానిని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. వారే ఇప్పుడీ సినిమా ఆగిపోయిందంటూ నెగెటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారేమోనని సినిమా బృందం భావిస్తోంది. అందుకే స్పష్టమైన క్లారిటీతో ఈ అనుమానాలకు చెక్ పెట్టింది. అన్నీ అనుకున్నట్టు సజావుగా జరిగే నిర్మాత సుధాకర్ చెరుకూరి వచ్చే మార్చి 26న 'ది ప్యారడైజ్'ను ఇంగ్లీష్, స్పానిష్ తో సహా ఎనిమిది భాషల్లో విడుదల చేయడం ఖాయం.
Also Read: Siddu: జాక్... కొంచెం క్రాక్ మాత్రమే కాదు తేడా కూడా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి