Mahanati Savitri: ఆకర్షిస్తోన్న మరపురాని మహానటి విగ్రహం
ABN, Publish Date - Feb 15 , 2025 | 04:35 PM
తెలుగు చిత్రసీమలోనే కాదు యావత్ దక్షిణాదిని తన అభినయంతో ఆకట్టుకున్న మహానటి సావిత్రి (Savitri)ని అభిమానులు మరచిపోలేకున్నారు. ఈ నాటికీ ఆమె నటించిన చిత్రాలు బుల్లితెరపై ప్రత్యక్షమైతే చాలు కళ్ళప్పగించి చూసే అభిమానులున్నారు.
తెలుగు చిత్రసీమలోనే కాదు యావత్ దక్షిణాదిని తన అభినయంతో ఆకట్టుకున్న మహానటి సావిత్రి (Savitri)ని అభిమానులు మరచిపోలేకున్నారు. ఈ నాటికీ ఆమె నటించిన చిత్రాలు బుల్లితెరపై ప్రత్యక్షమైతే చాలు కళ్ళప్పగించి చూసే అభిమానులున్నారు. ముఖ్యంగా సావిత్రి నటించిన "పెళ్ళిచేసిచూడు, దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మకథ, రక్తసంబంధం" వంటి చిత్రాలు టీవీలో ప్రసారమవుతుంటే ఆమె ఆరాధకులు పులకించి పోతూ తిలకిస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు తెలుగునాట కోకొల్లలు కనిపిస్తాయి. 'మహానటి' అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్న ఏకైక నటి సావిత్రి అంటే అతిశయోక్తి కాదు. ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో సావిత్రి అభినయం జనాన్ని ఎంతగానో అలరించింది. అయితే సావిత్రికి ఒక్కటంటే ఒక్క 'పద్మ' అవార్డు కూడా లభించక పోవడం విచారకరం.
ఈ నాటికీ సావిత్రి అభిమానులను ఆ విషయం వేధిస్తూనే ఉంటుంది. ప్రభుత్వ అవార్డుల కన్నా ప్రేక్షకుల రివార్డులే మిన్న అంటూ ఉండేవారు సావిత్రి. ప్రేక్షకులకు సావిత్రిపై ఉన్న అభిమానం, అలాగే తనను ఆదరించేవారి పట్ల ఆమెకున్న గౌరవం ఈ నాటికీ కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. తెలుగునాట ఏ నటికి దక్కనటువంటి గౌరవం సావిత్రికే దక్కుతూ ఉండడం మరింత విశేషం! ఇప్పటికే సావిత్రి గౌరవార్థం కొన్ని విగ్రహాలు వెలిశాయి. మరికొన్ని చోట్ల కూడా సావిత్రి విగ్రహాలను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో సావిత్రి జన్మస్థలమైన గుంటూరు (Gunturu) జిల్లా చినరావూరు (Chinaravuru)లో నెలకొల్పిన సావిత్రి నిలువెత్తు విగ్రహానికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట నాట్యం చేస్తోంది. ఆ పిక్ చూసిన సావిత్రి అభిమానులు ఎంతగానో పులకించి పోతున్నారు. అంతేకాదు, కొందరు చినరావూరుకు వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి రావాలనీ ఆశిస్తున్నారు.
ఆ మాటకొస్తే గతంలోనే గుంటూరులో సావిత్రి నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికీ గుంటూరు వాసులను, అక్కడకు వెళ్ళిన వారిని ఆ విగ్రహం ఆకర్షిస్తూనే ఉంటుంది. గుంటూరు నాజ్ సెంటర్ ఐలాండ్ లో ఏర్పాటయిన సావిత్రి ఏడడుగుల విగ్రహం అభిమానులకు ఓ మధురానుభూతిని పంచుతూనే ఉంది. 2018లో ఈ విగ్రహాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ (Dr.Kodela Siva Prasad) ఆవిష్కరించారు. అంతకు ముందు అంటే 2012లో విజయవాడ (Vijayawada)లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సావిత్రి 'బస్ట్ సైజ్' విగ్రహాన్ని నెలకొల్పారు. సావిత్రి నట వారసురాలుగా పేరొందిన ప్రఖ్యాత నటి వాణిశ్రీ (Vanisri) చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ సాగింది. ఈ రెండు విగ్రహాలు తెలుగువారికి సుపరిచితం కాగా, కొన్ని నెలల క్రితం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balashouri) చినరావూరులో సావిత్రి విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తూ సాగుతోన్న పిక్ ఈ విగ్రహానికి సంబంధించినదే! ఇక్కడే కాదు సావిత్రికి ఎనలేని పేరుప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన మద్రాసు నగరంలోనూ ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి తెలుగువారు భావిస్తున్నట్టు సమాచారం. అది అలా ఉంచితే, సావిత్రి నటజీవితం నాటకరంగం నుండి ఆరంభమయింది. తెనాలి (Tenali)లో పలు నాటకాల్లో సావిత్రి నటించి అలరించారు. ఆ తరువాతే చిత్రసీమలో అడుగుపెట్టా రామె. తమ తెనాలి నుండి ప్రఖ్యాతి గాంచిన పలువురి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు తెనాలికి చెందిన కళాభిమానులు. అలా తెనాలి నుండి విజయవాడకు వెళ్ళే మార్గంలోని కాలువపై ఇప్పటికే కొందరు ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పారు.
ఆ ప్రాంతాన్ని 'తెనాలి బండ్' (Tenali Bund)అని పిలుస్తున్నారు. ఆ ప్రదేశంలో నటశేఖర కృష్ణ (Krishna) విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే తెనాలితో ఎంతో అనుబంధం ఉన్న జగ్గయ్య (Jaggayya), సావిత్రి, జమున (Jamuna) వంటి సినీకళాకారుల విగ్రహాలనూ 'తెనాలి బండ్'పై ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. అమెరికాలోనూ సావిత్రి అభిమానులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు ఆ మధ్య సావిత్రి జీవిత చరిత్రను ఇంగ్లిష్ లో ప్రచురించారు. అలాంటి ప్రవాసులు సైతం భారతదేశంలోని తమ స్వస్థలాలలో మహానటి సావిత్రి విగ్రహాలను నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా విగ్రహాల చర్చ వచ్చినప్పుడు "రాజు నిలచు రాతి విగ్రహముల యందు, సుకవి జీవించు ప్రజల నాల్కలందు..." అన్న గుర్రం జాషువా (Gurram Jashuva) వారి మాట గుర్తుకు రాకమానదు. అయితే కళాకారులు ప్రజల హృదయాల్లోనూ, విగ్రహాల్లోనూ కూడా చోటు సంపాదిస్తారని ఎందరో నిరూపించారు. వారిలో మహానటి సావిత్రి స్థానం ప్రత్యేకం అనే చెప్పాలి.