Maha Shivaratri Special: తెలుగుతెరపై మహా శివుళ్ళు

ABN, Publish Date - Feb 25 , 2025 | 05:41 PM

మహాశివరాత్రి రోజున యావద్భారతంలో పంచాక్షరీ మంత్రం విశేషంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక తెలుగునేలపై కొలువైన వేలాది శివాలయాల్లోనూ 'ఓం నమశ్శివాయ' అన్న జపం మిన్నంటుతుంది. శివరాత్రి పర్వదినం రాగానే శివతత్త్వం తో రూపొందిన పాత చిత్రాల ప్రదర్శన తప్పనిసరి.


మహాశివరాత్రి రోజున యావద్భారతంలో పంచాక్షరీ మంత్రం విశేషంగా వినిపిస్తూ ఉంటుంది. ఇక తెలుగునేలపై కొలువైన వేలాది శివాలయాల్లోనూ 'ఓం నమశ్శివాయ' అన్న జపం మిన్నంటుతుంది. శివరాత్రి పర్వదినం రాగానే శివతత్త్వం తో రూపొందిన పాత చిత్రాల ప్రదర్శన తప్పనిసరి.  ఆ కాలంలో మహాశివుని పాత్రలో మెప్పించిన మహానటులను గుర్తు చేసుకుంటూ ఉంటారు సినీఫ్యాన్స్.

తెలుగునాట దేవతా మూర్తుల పాత్రలు అనగానే చప్పున గుర్తుకు వచ్చే ఏకైక నటుడు నటరత్న యన్టీఆర్ (NTR)అనే చెప్పాలి. శ్రీమహావిష్ణువు, శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో తనకు తానే సాటి అనిపించుకున్న ఎన్టీఆర్ మహాశివునిగానూ నటించి అలరించారు. రామారావు తొలిసారి 'దక్షయజ్ఞం' (1962) చిత్రంలో శివునిగా నటించారు. అందులో పద్మాసనం వేసుకొని యన్టీఆర్ కూర్చున ఫొటో అప్పట్లో విశేషంగా అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు, కొందరు ఆ చిత్రపటాన్ని ఫ్రేమ్  కట్టించి పూజలు కూడా చేశారు. ఈ నాటికీ యన్టీఆర్ 'దక్షయజ్ఞం'లో ధరించిన శివుని బొమ్మను క్యాలెండర్స్ గా వేస్తూనే ఉండడం విశేషం! ఈ సినిమా షూటింగ్ సమయంలో యన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ చనిపోయారని, అందుకే యన్టీఆర్ తరువాత శివుని పాత్ర వేయలేదని కొందరు కాకమ్మ కథలు చెబుతూ ఉంటారు. కానీ, ఆ తరువాత కేవీ రెడ్డి దర్శకత్వంలో 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' (1968)లోనూ శివుని పాత్ర ధరించారు యన్టీఆర్. ఆ సినిమా పరాజయం పాలవ్వడం వల్ల మరిన్ని కథలూ వినిపించారు కొందరు. కానీ, 'దక్షయజ్ఞం, ఉమాచండీగౌరీ శంకరుల కథ' చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ అలరించడం విశేషం! అప్పట్లో శివరాత్రి వస్తే చాలు జాగారణ ఆటలు అంటూ సెకండ్ షోస్ అయిన తరువాత పాత చిత్రాలను తెచ్చి ప్రదర్శించేవారు. ఆ ప్రదర్శనలో 'దక్షయజ్ఞం, ఉమాచండీగౌరీ శంకరుల కథ' చిత్రాలు చాలా ఊళ్ళలో ప్రదర్శితమయ్యేవి. (Mahashivratri Special)



మరికొందరు కథానాయకులు...
యన్టీఆర్ కంటే ముందు తెలుగు చిత్రసీమలో అందాలనటుడు అనిపించుకున్న సిహెచ్. నారాయణరావు (Ch.Narayana Rao) 'గంగాగౌరీ సంవాదం' (1958)లో శివునిగా నటించారు. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) 'మూగమనసులు' (1964) చిత్రంలో "గౌరమ్మా నీ మొగుడెవరమ్మా..." పాటలో కాసేపు శివునిగా కనిపించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలచింది. దాంతో ఫ్యాన్స్ శివుని గెటప్ యన్టీఆర్ కు అచ్చిరాలేదు అంటూ పుకార్లు లేవదీశారు. కానీ, తెలుగునాట శివుని గెటప్ లో యన్టీఆర్ లా కనిపించిన వారు లేరు. అయితే తెలుగు చిత్రసీమలో ఎక్కువ సార్లు శివుని పాత్రను ధరించి అలరించినది నటుడు ఎమ్.బాలయ్య (M.Balaiah) అనే చెప్పాలి. "పార్వతీకళ్యాణం (1958), మల్లమ్మకథ (1973), భక్త కన్నప్ప (1976), జగన్మాత (1987)" వంటి చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ బాలయ్య శివుని పాత్రలో కనిపించారు.
తెలుగునాట యన్టీఆర్ తరువాత పలుమార్లు దేవతామూర్తుల పాత్రల్లో అలరించిన నటుడు కాంతారావు (Kanta Rao). ఆయన 'భక్త మార్కండేయ' (1956)లో శివుని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.


తరువాతి తరం హీరోలయిన శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా శివుని పాత్రల్లో కనిపించారు. యన్టీఆర్ 'పరమానందయ్య శిష్యుల కథ' (1966)లో శోభన్ బాబు (Sobhan Babu) శివునిగా నటించారు. 'శ్రీ వినాయక విజయం' (1979)లో కృష్ణంరాజు (Krishnam Raju)పరమేశ్వరునిగా అభినయించారు. ఒకప్పుడు హీరోగా సాగిన రంగనాథ్ తరువాతి రోజుల్లో కేరెక్టర్ యాక్టర్ అయ్యారు. కృష్ణ 'ఏకలవ్య' (1982)లో రంగనాథ్ (Ranganath) ముక్కంటిగా నటించి మురిపించారు. మరో కేరెక్టర్ యాక్టర్ మల్లికార్జునరావు (Mallikarjuna) సోషియో ఫాంటసీ 'మగరాయుడు' (1994)లో శివునిగా కనిపించారు.


తరువాతి తరంలో....
ఈ నాటికీ టాలీవుడ్ టాప్ స్టార్స్ అనిపించుకుంటున్న వారిలో మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) మూడు చిత్రాల్లో శివునిగా కనిపించారు. ఆయన తొలిసారి 'పార్వతీపరమేశ్వరులు' (1981)లో "నాదనిలయుడే..." అంటూ సాగే పాటలో శివునిగా తెరపై తళుక్కుమన్నారు. తరువాత 'ఆపద్బాంధవుడు' (1992)లో  "హర హర మహాశంకరా..." అంటూ సాగే బాలేలో పరమేశ్వరునిగా కనిపించారు. ఇక కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'శ్రీమంజునాథ' (2001)లో పూర్తిస్థాయిలో ముక్కంటి పాత్రలో నటించారు చిరంజీవి. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన నటసింహ బాలకృష్ణ (Balakrishna) 'సీతారామకళ్యాణం' (1986)లో "ఎంత నేర్చినా... ఎంత చూచినా..." సాంగ్ లో కాసేపు శివునిగా కనిపించారు. 'అన్నమయ్య' (1997)లో శ్రీనివాసునిగా మెప్పించిన సుమన్ తరువాత పలు చిత్రాలలో పౌరాణిక పాత్రలు ధరించారు.  అలా 'శ్రీసత్యనారాయణ స్వామి' (2007)లో సుమన్ (Suman) శివుని పాత్రలో కనిపించారు. అందులో బ్రహ్మ, విష్ణు పాత్రల్లోనూ సుమన్ కనిపించడం విశేషం! జగపతిబాబు (Jagapathi Babu) తన 'పెళ్ళయిన కొత్తలో' (2006) సినిమాలో "మనసు కన్ను చేసుకొని చూడర లోకం..." అనే పాటలో కాసేపు శివునిగా తళుక్కుమన్నారు.



వీరు సైతం..
వెండితెరపై ప్రతినాయకులుగా మెప్పించిన వారు సైతం మహాశివుని పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు జానపద చిత్రాల్లో విలన్ అంటే తానేని చాటుకున్న రాజనాల (Rajanala) 'ఉషాపరిణయం' (1961)లో శివునిగా నటించారు. తరువాత 'శ్రీకృష్ణవిజయం' (1971)లోనూ మరోమారు పరమశివుని పాత్రలో కనిపించారు. తరువాతి రోజుల్లో విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా మెప్పించిన నాగభూషణం (Nagabhushanam) 'ఉమాసుందరి (1956), నాగుల చవితి (1956), భూకైలాస్ (1958)'  వంటి చిత్రాల్లో శివుని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రతినాయక పాత్రల్లో అలరించిన మరో నటుడు ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) కూడా 'శ్రీకృష్ణార్జున యుద్ధం (1963), సత్య హరిశ్చంద్ర (1965), సతీ అనసూయ (1971)'  వంటి చిత్రాల్లో శివయ్య పాత్రలో నటించి అలరించారు. ప్రతినాయకునిగానే కాదు కరుణరస పాత్రల్లోనూ మురిపించిన రావు గోపాలరావు (Rao Gopala Rao)  'మావూళ్లో మహాశివుడు' (1979) చిత్రంలో శివుని పాత్రలో మెప్పించారు. విలక్షణ నటునిగా పేరొందిన ప్రకాశ్ రాజ్ (Prakash Raj) కూడా నాగార్జున 'డమరుకం' (2012)లో శివునిగా కనిపించారు.  మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) సందర్భంగా తెరపై మహాశివుని పాత్రలో కనిపించిన ప్రముఖ నటులను గుర్తు చేసుకున్న వైనమిది.

Updated Date - Feb 26 , 2025 | 11:08 AM