L2: Empuraan : సినిమా పెట్టిన చిచ్చు....
ABN, Publish Date - Apr 01 , 2025 | 11:52 AM
ఇటీవల విడుదలైన 'ఎంపురాన్' మూవీతో మోహన్ లాల్, పృధ్వీరాజ్ మధ్య ఊహించని అగాధం ఏర్పడిందని కేరళ సినీ వర్గాలు చెబుతున్నాయి. పృథ్వీరాజ్ చేసిన పనికి మోహన్ లాల్ క్షమాపణలు చెప్పాల్సి రావడమే దానికి కారణమట!
2019లో వచ్చిన 'లూసిఫర్' (Lucifer) మూవీతో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకుడిగా మారాడు. ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. అంతేకాదు... మోహన్ లాల్ (Mohan Lal) తో పృధ్వీరాజ్ కు ఓ స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. దాంతో మోహన్ లాల్ తోనే దర్శకుడిగా తన రెండో సినిమా 'బ్రో డాడీ' (Bro Daddy) ని రూపొందించాడు. మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా పృథ్వీరాజ్ కు మంచి పేరే తెచ్చిపెట్టింది. ఈ ఉత్సాహంతోనే 'లూసిఫర్'కు సీక్వెల్ గా 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan) మూవీని రూపొందించాడు పృథ్వీరాజ్ సుకుమారన్.
భారీ అంచనాలతో తెరకెక్కిన 'ఎంపురాన్' మార్చి 27న జనం ముందుకు వచ్చింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఈ సినిమాలో హిందుత్వ వాదులను దారుణంగా చూపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో 'ఎంపురాన్' మేకర్స్ ను నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో పృథ్వీరాజ్ సుకుమారన్ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు. రచయిత మురళీగోపీ ఉచ్చులో పడి పృథ్వీరాజ్ లక్ష్మణ రేఖను దాటేశాడనే మాట బాగా వినిపిస్తోంది. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కేరళలో మనుగడ కోసం ఆ పార్టీ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓ స్థానాన్ని కూడా గెలుచుకుంది. ఇది గిట్టక రచయిత మురళీ గోపీ... అప్పుడెప్పుడో జరిగిన గుజరాత్ అల్లర్లను బేస్ చేసుకుని, హిందుత్వా వాదులను శత్రువులుగా చూపేలా ఈ కథ రాశాడని అంటున్నారు. అప్పటి అల్లర్ల బాధితుల నుండి ఓ హీరోని తయారు చేసి, ఇప్పుడున్న హిందుత్వ పార్టీ లోని వ్యక్తిని విలన్ గా చిత్రీకరించి అతన్ని అంతమొందించేలా ఈ కథను తయారు చేయడాన్ని నిరసిస్తున్నారు. దీనికి నేపథ్యంగా కేరళలోని ప్రస్తుత పార్టీలు, అవి అవినీతిలో కూరుకపోవడాన్ని చూపించారు. దాంతో కేరళలోని అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఈ సినిమాను ఓన్ చేసుకోలేకపోతున్నాయి. కమ్యూనిస్టులైతే ఇందులో తమ పార్టీని, తమ విధానాలను తక్కువ చేసి చూపించారని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు లోలోపల కాస్తంత సంతోషంగా ఉన్నారు. కేరళలోని బీజేపీ వర్గాలు ఎటూ తేర్చుకోలేకుండా మౌనం దాల్చాయి.
'ఎల్ 2: ఎంపురాన్' పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడంతో కేరళలో కంటే ఇతర ప్రాంతాలలో ఈ సినిమా మీద నిరసన అత్యధికంగా వ్యక్తమైంది. కేంద్రంలోని బీజేపీని, అక్కడి జాతీయ నాయకులు తెలివిగా ఈ సినిమాతో టార్గెట్ చేశారని, ఉద్దేశ్యపూర్వకంగానే హిందుత్వ వాదాన్ని అవమానించారని, దానికి గుజరాత్ అల్లర్లను పావుగా వాడుకున్నారని విమర్శలు చేస్తున్నారు. కరసేవలకు ప్రయాణిస్తున్న సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనానికి కారకులు ఎవరనేది సినిమాలో చూపించకుండా... గుజరాత్ లో ముస్లింపై జరిగిన మారణహోమానికి హిందూ నేతలే కారణమన్నట్టు చూపించడాన్ని కొందరు తప్పు పట్టారు. పైగా ఆ ప్రతీకార దాడులను చాలా భయంకరంగా చూపించారని, అలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఎలా ఇస్తారంటూ సెన్సార్ వర్గాలపైనా విమర్శలతో దాడి చేశారు. జాతీయ స్థాయిలో ఈ రకమైన నిరసనలు వెల్లువెత్తడంతో చిత్ర కథానాయకుడు మోహన్ లాల్ బేషరతుగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెప్పాడు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తామని మాట ఇచ్చాడు. రచయిత మురళీ గోపీ ఈ సినిమా గురించి ఎవరు ఎలా మాట్లాడుకున్నా... తాను పట్టించుకోనని తెగేసి చెప్పేశాడు. దర్శకుడు పృథ్వీరాజ్ వ్యూహాత్మక మౌనం పాటించాడు. అతని తల్లి మాత్రం తన కొడుకును ఈ మొత్తం వ్యవహారంలో బలిపశువును చేస్తున్నారంటూ వాపోయింది. ఆమె ప్రకటన చూస్తుంటే... అది మోహన్ లాల్ ను ఉద్దేశించి చెప్పినట్టుగానే అనిపిస్తోందని కొందరంటున్నారు.
కొన్నేళ్ళుగా మోహన్ లాల్, పృథ్వీరాజ్ మధ్య గురుశిష్య సంబంధం ఉందని, పృధ్వీరాజ్ ను మోహన్ లాల్ ఎంతో నమ్మి, ప్రోత్సహించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇప్పుడీ 'ఎంపురాన్' మూవీతో పృథ్వీరాజ్ ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారని వారు అంటున్నారు. వివాదాలకు దూరంగా ఉండే మోహన్ లాల్ మొదటిసారి ఈ సినిమా కారణంగా ఇబ్బందుల్లో పడ్డారని వారు వాపోతున్నారు. ఇదిలా ఉంటే... కాంట్రవర్సీల కారణంగా 'ఎంపురాన్' ఇప్పటికే 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. కానీ చిత్ర దర్శక, నిర్మాతలు సక్సెస్ మీట్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు... ఇక 'లూసిఫర్ -3' కూడా ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. మరి... మోహన్ లాల్, పృథ్వీరాజ్ మధ్య ఏర్పడిన ఈ అగాథాన్ని ఎవరు పూడ్చుతారో చూడాలి.
Also Read: Tamannaah Bhatia: అజయ్ దేవగన్ మూవీలో ఐటమ్ సాంగ్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి