Game Changer: గేమ్‌ ఛేంజర్‌ - దొంగ దొరికాడు

ABN, Publish Date - Jan 17 , 2025 | 11:22 AM

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని తమ ప్రాంతంలోని లోకల్‌ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నారంటూ ఇటీవల ఒక నెటిజన్‌ సోషల్‌మీడియా లో పోస్ట్‌ పెట్టాడు. దీనిపై సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు.


రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం విడుదలై వారం కాకముందే ఏపీలోని ఓ లోకల్‌ ఛానల్‌లో (Local CHannel) పైరసీ కాపీని ప్రసారం కావడం చర్చనీయాంశమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన చిత్రబృందం ఇటీవల సైబర్‌ క్రేౖమ్‌ (Cyber crime -Piracy print) పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి తాజాగా ఆ ఛానల్‌  నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్లూస్‌ టీమ్‌ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని తమ ప్రాంతంలోని లోకల్‌ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నారంటూ ఇటీవల ఒక నెటిజన్‌ సోషల్‌మీడియా లో పోస్ట్‌ పెట్టాడు. దీనిపై సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందని, పైరసీ కాపీని ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని, దీనివల్ల ఎంతో మంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ రూపుదిద్దుకుంది. కియారా అద్వానీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు (Dil raju) దీనిని నిర్మించారు. భారీ అంచనాలతో జనవరి 10న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని లీక్‌ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్రబృందం సైబర్‌ క్రేౖమ్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారని, రిలీజ్‌ కాగానే ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారని టీమ్‌ ఫిర్యాదులో పేర్కొంది. ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రేౖమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

Updated Date - Jan 17 , 2025 | 11:31 AM