Empuraan: నిర్మాత కార్యాలయంలో ఈడీ సోదాలు...

ABN, Publish Date - Apr 04 , 2025 | 01:36 PM

'ఎంపురాన్' నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. దాంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు పలురకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

మోహన్ లాల్ (Mohanlal) కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prudhviraj Sukumaran) తెరకెక్కించిన 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan) మూవీలో ఓ సీన్ ఉంది. జాతీయ పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పే కేరళ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె... తన నిర్ణయం కారణంగా కేంద్రం తనపై ఈడీ తో కేసులు పెట్టించే అవకాశం ఉందని చెబుతుంది. ఒక వేళ తనను అధికారులు అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేస్తే తనకు మద్దత్తుగా నిలవమని పార్టీ నాయకలును కోరుతుంది. చెప్పినట్టుగానే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ ను రాజకీయ ప్రయోజనాలకు ఆమె ఉపయోగించుకుంటుంది. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే... ఈడీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది ఇవాళ ప్రతిపక్షానికి చెందిన చాలామంది చేసే ఆరోపణ.


చిత్రం ఏమంటే... సరిగ్గా 'ఎంపురాన్' సినిమా నిర్మాత గోకులం గోపాలన్ (Gokulam Gopalan) విషయంలో అదే జరిగింది. ఈ సినిమాపై పలు వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మోహన్ లాల్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. చిత్ర రచయిత దీనిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని చేతులు దులుపుకున్నాడు. చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పెదవి విప్పలేదు కానీ అతని తరఫున తల్లి పత్రికా ప్రకటన ఇస్తూ... తన కొడుకును బలి పశువును చేస్తున్నారని, చిత్ర నిర్మాతలకు, మోహన్ లాల్ కు అన్నీ ముందే తెలుసు అని స్పష్టం చేసింది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ, చిత్ర బృందమే సినిమాను రీ-సెన్సార్ కు పంపింది. టైటిల్ కార్డ్స్ లో ఉన్న బీజేపీ ఎంపీ సురేష్‌ గోపీ పేరును తొలగించింది. కొన్ని వివాదాస్పద అంశాలను మూడు నిమిషాల పాటు ఎడిట్ చేసింది. కొన్ని అభ్యంతరకర పదాలను మ్యూట్ చేసింది. ఆ తర్వాత మరోసారి సినిమాను జనంలోకి తీసుకొచ్చింది. అయితే సినిమాలో చూపించిన మాదిరిగానే కేంద్రం 'ఎంపురాన్' మేకర్స్ పై కక్ష కట్టిందని కొందరు ఆరోపిస్తున్నారు.


శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు 'ఎంపురాన్' నిర్మాత గోకులమ్ గోపాలన్ ఆఫీస్ లో సోదాలు చేశారు. కేరళ లోనూ, చెన్నయ్ లోని కోడంబాకం కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. దాంతో కేంద్రం కక్ష గట్టి గోకులం గోపాలన్ ఆఫీసులపై ఈడీని ఉసిగొల్పిందని కొందరు ఆరోపిస్తున్నారు. నిజానికి చిట్ ఫండ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న గోకులమ్ గోపాల్ పై కొన్నేళ్ళుగా ఈడీ అధికారులు నిఘా పెట్టారు. రెండేళ్ళ క్రితం కూడా పన్నులు ఎగ్గొట్టిన కేసులో గోకులం గోపాలన్ ను కొచ్చి కార్యాలయంలో ఈడీ అధికారులు విచారించారు. అయితే ఇప్పుడు విదేశీ నిధులను సేకరించారనే ఆరోపణలు వచ్చి సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే... 'ఎల్ 2: ఎంపురాన్' సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. అయితే ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ గత కొంతకాలంగా తీసిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దాంతో 'ఎంపురాన్' అనుకున్న సమయానికి విడుదల అవుతుందో లేదో, కోర్టు నుండి బయ్యర్ల నుండి ఇబ్బందులు ఎదురు కావచ్చుననే సందేహాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో గోకులమ్ గోపాలన్ ఈ మూవీ విడుదలను భుజానికెత్తుకుని బయటపడేశాడు. అదే లైకా ప్రొడక్షన్ చేతుల్లోనే మూవీ ఉండి ఉంటే... విడుదల అయ్యేదో లేదో తర్వాత సంగతి కానీ... గోకులమ్ గోపాలన్ కు ఈ కొత్త చిక్కులు వచ్చి ఉండేవి కావని సన్నిహితులు వాపోతున్నారు. మొత్తం మీద సినిమాలో రచయిత మురళీ గోపీ ఏ సన్నివేశాలు అయితే రాశారో అవే నిజంగా జరిగాయని సినీజనం అంటున్నారు.

Also Read: Pawan Kalyan: అజ్ఞాతవాసి... ట్రెండింగ్ లో ఎందుకంటే...

Also Read: Ramgopal Varma: శారీ మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 04 , 2025 | 01:40 PM