AISF: అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసులు...
ABN, Publish Date - Apr 22 , 2025 | 01:51 PM
అల్లు అర్జున్, శ్రీలీల కార్పొరేట్ కాలేజీల ప్రకటనల్లో నటించడాన్ని వామపక్ష వాద విద్యార్థి సంస్థ ఎ.ఐ.ఎస్.ఎఫ్. తప్పుపట్టింది. కాలేజీ స్థితిగతులు తెలుసుకోకుండా ఇలా ప్రకటనల్లో నటించడం కరెక్ట్ కాదని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తోంది.
ఇటీవల ఐఐటి - జేఈఈ ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా కార్పొరేట్ కాలేజీలు స్టార్స్ తో ప్రకటనలను గుప్పించాయి. ఈ విషయంలో వామపక్ష పార్టీల విద్యార్థి విభాగం ఎ.ఐ.ఎస్.ఎఫ్. సీరియస్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ శ్రీలీలపై ఫైర్ అయ్యింది. ఎందుకంటే వీరిద్దరూ కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్ వ్యవహరిస్తున్నారు. అయితే... వారు ఏ కాలేజీలను ప్రమోట్ చేస్తున్నారో... ఆ యా విద్యాసంస్థలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నాయని ఎ.ఐ.ఎస్.ఎఫ్. ఆరోపించింది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన నటీనటులపై కేసులు పెట్టినట్టుగానే వీరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది. కాలేజీలు, వాటి యాజమాన్యం చేసే దారుణాలను పట్టించుకోకుండా కేవలం కోట్ల పారితోషికానికి ఆశపడి ఇలాంటి ప్రకటనలు చేయడం తగదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విజయవాడ సిటీ కౌన్సిల్ తెలిపింది. సహజంగా స్టార్స్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రమోట్ చేస్తే... అక్కడ విద్యా, వసతి సౌకర్యాలు బాగుంటాయని విద్యార్థులు భావిస్తారని, కానీ కాలేజీలో చేరిన విద్యార్థుల జీవితాలతో ఆ యా సంస్థలు ఆడుకుంటున్నాయని వాపోయింది. వీరు నటించే యాడ్స్ కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్, శ్రీలీలపై చర్యలు తీసుకోవాలని ఎ.ఐ.ఎస్.ఎఫ్. డిమాండ్ చేసింది. కార్పొరేట్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలకు నీళ్ళు వదిలి, లక్షలు ఆర్జించడమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, లక్షలాది మంది విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి నిర్వహిస్తున్న హాస్టల్స్ లో కనీస వసతులు కూడా ఉండకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఎ.ఐ.ఎస్.ఎఫ్. పేర్కొంది.
ఇలాంటి కార్పొరేట్ కళాశాల అకృత్యాలను వాటి బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించే నటీనటులు గమనించాలని, చాలా కాలేజీలు ఎక్కడో నార్త్ లో వచ్చిన ర్యాంకులను తమ విద్యా సంస్థలకు వచ్చినట్టుగా చూపిస్తున్నారని, వీటి నిజానిజాల నిగ్గు తేల్చాల్సి ఉందని వారు డిమాండ్ చేశారు. మరి దీనిపై అల్లు అర్జున్, శ్రీలీల ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: Aamir Khan: వెండితెరపైకి అమీర్ 'మహాభారతం'
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి