Gandhi Tatha Chettu: ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్ వచ్చేసింది.. ట్రైలర్ ఎవరు రిలీజ్ చేశారో తెలుసా?
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:14 PM
‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్. ఇప్పుడాయన కుమార్తె సుకృతి వేణి నటిగా మారారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాలలోకి వెళితే..
దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి. ఇప్పుడాయన తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. జనవరి 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన సోషల్ మీడియా వేదిక ద్వారా విడుదల చేశారు.
‘‘ ‘గాంధీ తాత చెట్టు’ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా ఇది అనిపిస్తుంది. సుకృతికి మరియు ఈ సినిమా టీమ్ అందరికీ నా అభినందనలు’’ అని ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా సూపర్ స్టార్ మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశం’’తో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. గాంధీగా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది. ఇక ట్రైలర్ విడుదల చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.