Anupam Kher: 23 ఏళ్ళ తర్వాత మరోసారి...
ABN, Publish Date - Apr 29 , 2025 | 10:04 AM
అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం 'తన్వీ: ది గ్రేట్'. ఈ సినిమా హీరోయిన్ ఇంట్రడక్షన్ టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో తూలిపడబోయిన అనుపమ్ తల్లిని కాజోల్ పట్టుకుని నిలబెట్టింది.
ప్రముఖ నటుడు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత అనుపమ్ ఖేర్ (Anupam Kher) అప్పుడెప్పుడో 23 సంవత్సరాల క్రితం 'ఓం జయ్ జగదీశ్' (Om Jai Jagadeesh) మూవీని డైరెక్ట్ చేశాడు. మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు 'తన్వీ: ది గ్రేట్' (Thanvi: The Great) అనే చిత్రాన్ని రూపొందించాడు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (M. M. Keeravani) ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం విశేషం. ఈ సినిమా హీరోయిన్ ఇంట్రడక్షన్ టీజర్ ను సోమవారం ముంబైలో ఆవిష్కరించారు. అలానే ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేసిన శుభాంగి (Subhangi) పరిచయ కార్యక్రమం కూడా ఇదే వేదికపై జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కాజోల్ (Kajol) ముఖ్యఅతిథిగా హాజరైంది. అలానే అనుపమ్ ఖేర్ తల్లి దులారి ఖేర్ (Dulari Kher) సైతం వచ్చారు. అయితే... వీరు వేదిక మీద పక్కకు జరిగే క్రమంలో దులారి తూలి పడబోగా... కాజోల్ ఆమెను ఒడిసి పట్టుకున్నారు. సరిగా నిలబెట్టారు. ఆ క్రమంలో కాజోల్ సైతం ఓ వైపు కు ఒరిగిపోయింది. అయినా సంభాళించుకుని, అనుపమ్ తల్లికి బాసటగా నిలిచింది. దాంతో ఒక్కసారి కంగారు పడిన అనుపమ్ ఖేర్ ఆ తర్వాత తేరుకుని కాజోల్ కు ధ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా టీజర్ లాంచ్ సమయంలో ఇలాంటిది జరగడం ఓ రకంగా శుభ సూచకంగానే తాను భావిస్తున్నానని అనుపమ్ ఖేర్ చెప్పారు.
'తన్వీ: ది గ్రేట్' గురించి ఆయన మాట్లాడుతూ, 'తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'ఓం జయ్ జగదీశ్'కు కథ తాను రాయలేదని, అయితే మంచి ఆర్టిస్టులు లభించడంతో ఈ సినిమా చక్కని ఆదరణ పొందింద'ని అన్నారు. బేసికల్ గా ఆర్టిస్ట్ అయిన తాను ఆ తర్వాత కేవలం నటన మీదనే ఫోకస్ పెట్టానని చెప్పారు. అయితే... తానే రాసుకున్న కథతో ఓ సినిమా తీయాలనే కోరిక కొంత కాలంగా ఉందని తెలిపారు. దాదాపు మూడు, మూడున్నర యేళ్ళుగా 'తన్వీ: ది గ్రేట్' కథను తాను తయారు చేసుకుంటూ వచ్చానని, గత యేడాది షూటింగ్ మొదలుపెట్టి, ఇటీవల పూర్తి చేశానని అన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో మే లో జరుగబోతున్న కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో జరుగబోతోంది. ఈ చిత్రాన్ని అనుపమ్ ఖేర్, ఎన్.ఎఫ్.డి.సి. సహకారంతో నిర్మించారు.
Also Read: Salman Khan: బాలీవుడ్ బిగ్ వన్ షోకు పహల్గాం దెబ్బ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి