Bhaskhar Maurya: ముత్తయ్య పాట ఆవిష్కరించిన సమంత

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:04 PM

'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'ముత్తయ్య'. ఏడు పదుల వయసులో సినిమాల్లో నటించాలనే కోరికను ఓ వృద్థుడు ఎలా తీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ.

సినిమాల్లో నటించాలని కలలు కనే 70 యేళ్ళ వృద్ధుడి కథతో తెరకెక్కిన సినిమా 'ముత్తయ్య' (Muthayya). ప్రజాదరణకు నోచుకున్న 'బలగం', 'బాపు' చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన కె. సుధాకర్ రెడ్డి (K. Sudhakar Reddy) ఇందులో టైటిల్ రోల్ ను ప్లే చేశారు. నటుడు కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తనకు ఎదురైన అడ్డంకులను ముత్తయ్య ఎదుర్కొనే జర్నీ స్ఫూర్తి దాయకంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను భాస్కర్ మౌర్య (Bhaskhar Maurya) దర్శకత్వంలో వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి (Divakar Mani) ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం.

అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా లండన్ లోని యుకె ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వరల్డ్ ప్రీమియర్ గా ప్రదర్శితమైంది. 28వ కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ లాంగ్వేజెస్ కేటగిరీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, దుబాయ్ లోని మెటా ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి దర్శకుడు, ఇండిక్ చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం అవార్డులను గెలుచుకుంది. ఇది సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ (కెనడా), హ్యాబిటాట్ ఫిల్మ్ ఫెస్టివల్ (న్యూ ఢిల్లీ) ఇండియా, ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ అల్బెర్టా (కెనడా), థర్డ్ యాక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ (కెనడా), సినిమాకింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (బంగ్లాదేశ్), ఇస్చియా గ్లోబల్ ఫెస్టివల్ (ఇటలీ) లలో కూడా ప్రదర్శితమైంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'అరవైల పడుసోడు ఎగిరెగిరి పడతాడు తుమ్మాకో తంబాకో తెలవదులేండి....' అనే గీతాన్ని సోషల్ మీడియా ద్వారా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ గీతాన్ని శివకృష్ణ చారి ఎల్లోజు రాయగా, విద్యాసాగర్ బంకపల్లి పాడారు. దీనికి కార్తీక్ రోడ్రిగ్స్ (Karthik Rodriguez) స్వరాలు సమకూర్చారు.


ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ మౌర్య మాట్లాడుతూ, ''ఈటీవీ విన్ ద్వారా 'ముత్తయ్య' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. నా మొదటి సినిమా అనేక చలన చిత్రోత్సవాలలో గొప్ప గుర్తింపు పొందినందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ముత్తయ్య సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉంది. కె సుధాకర్ రెడ్డి, కొత్త నటుడు అరుణ్ రాజ్ అద్భుతంగా నటించారు'' అని అన్నారు. మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ ను తెలుగువారు ఎప్పుడూ ఆదరిస్తారని, తప్పకుండా తమ చిత్రానికి కూడా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడం పట్ల వృందా ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న 'ముత్తయ్య' చిత్రం ఈ నెల 24న ఈటీవీ విన్ (Etv Win) లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Also Read: డ్రగ్స్‌ తీసుకునే వారితో నటించను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 17 , 2025 | 12:25 PM