Vishwambhara: రిలీజ్ సెంటిమెంట్ రిపీట్!?

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:34 PM

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. బ్లాక్ బస్టర్ మూవీ 'ఇంద్ర' విడుదలైన జూలై 24న 'విశ్వంభర' జనం ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న 'విశ్వంభర' (Vishvambhara) చిత్రం జనవరి 10వ తేదీన విడుదల కావాల్సింది. అయితే... రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) కు దారి వదులుతూ ఆ సినిమా విడుదలను వాయిదా వేశారు. నిజానికి భారీ గ్రాఫిక్స్ తో రూపుదిద్దుకుంటున్న కారణంగా 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అప్పటికి ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే... సంక్రాంతి బరి నుండి తప్పుకున్న తర్వాత 'విశ్వంభర'ను మే 9వ తేదీ రిలీజ్ చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆ తేదీ చిరంజీవికి యమాగా కలిసి వచ్చింది. 'గ్యాంగ్ లీడర్' మూవీతో పాటుగా అదే రోజున బ్లాక్ బస్టర్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రాలు విడుదలయ్యాయి. అయితే.. ఇప్పుడు మే 9న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న 'హరిహర వీరమల్లు' రాబోతోందనే ప్రకటన వెలువడింది. దాంతో 'విశ్వంభర' మరోసారి వాయిదా పడక తప్పదని తేలిపోయింది. తనకు బాగా అచ్చివొచ్చిన తేదీని తమ్ముడికిచ్చేసి... చిరంజీవి మరింత వెనక్కి వెళుతున్నాడని అంతా అనుకున్నారు.

తాజాగా 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా... జూలై 24న 'విశ్వంభర' వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. విశేషం ఏమంటే... ఈ తేదీ కూడా చిరంజీవికి బాగా కలిసొచ్చిందే. జూలై 24నే మెగాస్టార్ 'ఇంద్ర' మూవీ విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. అప్పటి వరకూ ఉన్న చిరంజీవి సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ ఈ సినిమా ఏకంగా 122 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అయితే ఆ తర్వాత సంవత్సరం వచ్చిన 'ఠాగూర్' ఈ రికార్డును తిరగరాసి 193 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శితమైంది. ఏదేమైనా 'ఇంద్ర' మూవీ చిరంజీవి కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్. సో... అదే రోజున 'విశ్వంభర' వస్తుండటం అభిమానులను ఆనంద పర్చే అంశం.


'విశ్వంభర'లో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కునాల్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు.

'బింబిసార' ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకోసం ప్రాణం పెట్టి మరీ వర్క్ చేస్తున్నారు. దీనిని విక్రమ్, వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 12న విడుదల చేయబోతున్నారు మేకర్స్. సో... మెగా ఫ్యాన్స్ బీ రెడీ!

Also Read: AA22 X A6: ఆకాశమే హద్దుగా బన్నీ - అట్లీ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 08 , 2025 | 12:47 PM