Vijay Devarakonda: పాకిస్థాన్‌కు ఆ రోజు ముందుంది..
ABN, Publish Date - Apr 27 , 2025 | 01:15 PM
భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌పై ఆ దేశ ప్రజలే తిరగబడే రోజులు రానున్నాయన్నారు హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).
భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌పై ఆ దేశ ప్రజలే తిరగబడే రోజులు రానున్నాయన్నారు హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. కశ్మీర్ భారతదేశానిదే అని నినదించారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘రెట్రో’ (Retro) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్య (Suriya) కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. పూజా హెగ్డే (pooja Hegde) కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా మే 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ, సూర్య పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నివాళులు అర్పించారు.
కశ్మీర్లో దురాగతాలకు కారణం..
‘‘పహల్గాంలో జరిగిన ఘటన ఎంతో బాధాకరం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా, మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. చదువు లేకపోవడమే కశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాలకు కారణం. వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్‌వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలి. ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో తెలియదు. కశ్మీర్ ఇండియాదే. వాళ్ళు మనవాళ్లే.రెండేళ్ల కిందట అక్కడ షూటింగ్‌కు వెళ్లా. చక్కగా చూసుకున్నారు. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బంది పడుతుంటే, వాటి సంగతి చూసుకోకుండా ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్‌పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు పోతే, ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించటం నేర్చుకోవాలి. మనం జీవితంలో ముందుకు వెళ్లాంటే అందుకు తాళం చెవి చదువు ఒక్కటే. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది’’ అన్నారు
సూర్య గురించి మాట్లాడుతూ ‘‘సూర్యలా విభిన్నమైన జానర్లు చేయడానికి.. ప్రయోగాత్మక పాత్రలు పోషించడానికి చాలా ధైర్యం కావాలి. నేను నటుణ్ని అవ్వాలనుకుంటున్న రోజుల్లో కచ్చితంగా కలవాలనుకున్న హీరో సూర్య. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేసినా కానీ కుదర్లేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఈ వేదికపై తనని ఇలా కలుసుకుని.. నా జ్ఞాపకాల్ని పంచుకోవడం ఎంతో ప్రత్యేకంగా ఉంది. సినిమాలు హిట్టవుతుంటాయి.. ఫ్లాప్ అవుతుంటాయి. కానీ, తెరపై సూర్య నటన చూసినప్పుడల్లా.. అది అందరిలో ఓ ఇన్స్‌పిరేషన్ ఇస్తుంది. ‘రెట్రో’తో కచ్చితంగా ఓ అద్భుతమైన షో చూపించనున్నారు’’ అన్నారు.