Urvashi - Chiranjeevi: చిరంజీవి మా పాలిట దేవదూత.. ఇక మాటల్లో చెప్పలేను

ABN, Publish Date - Feb 13 , 2025 | 03:29 PM

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనకు, తన కుటుంబానికి దైవంతో సమానం అని చెబుతోంది హీరోయిన్‌ ఊర్వశీ రౌతెల (Urvashi Rautela) ఆయన మాకు ఏమీ కారు.. సినిమాలో నటించిన చిన్న పరిచయం అంతే.

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తనకు, తన కుటుంబానికి దైవంతో సమానం అని చెబుతోంది హీరోయిన్‌ ఊర్వశీ రౌతెల (Urvashi Rautela) ఆయన మాకు ఏమీ కారు.. సినిమాలో నటించిన చిన్న పరిచయం అంతే. కానీ కష్టంలో ఎంతో అండగా నిలిచారు. అందుకే ఆయన్ను దైవంలా భావిస్తున్నామని, తమ బలానికి ఆయనొక లైట్‌హౌస్‌ లాంటివారని అంటోంది ఊర్వశీ. ఇంతకీ ఏం జరిగిందంటే.. (Urvashi gratitude towards Chiranjeevi)


ఇటీవల ఊర్వశీ తల్లి మీను రౌతెల ఆస్పత్రి పాలైంది. ఆమె ఎడమ కాలిలో ఎముకలో ఇంట్రా ఆర్టిక్యూలర్‌ ఫ్రాక్చర్‌ అయింది. అదెంతో ప్రమాదకరమని వైద్యులు చెప్పగా ఊర్వశీ చిరంజీవిని సహాయం కోరింది. అందుకు స్పందించిన చిరంజీవి కోల్‌కత్తా అపోలో ఆస్పత్రి బృందంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చేశారు. డాక్టర్లు సర్జరీ చేయడంతో ఆమె ఆ సమస్య నుంచి గట్టెక్కింది. ఈ విషయమై తమ కుటుంబం చిరంజీవికి జీవిత కాలం రుణపడి ఉంటామని చెబుతోంది.

ఆమె 'చిత్రజ్యోతి'తో మాట్లాడుతూ  "చిరంజీవిగారి సేవా కార్యక్రమాల గురించి ఎంతో విన్నాను. 'వాల్తేరు వీరయ్య’ సాంగ్‌ షూటింగ్‌లో నేను ఆయన్ను ఎంతో గమనించాను. ఆపద అన్నవారికి నేను చూస్తుండగానే ఎంతో సాయం అందించారు. ఆ సాయం నా వరకూ కూడా వచ్చింది. అమ్మ ఎడమ కాలి ఎముకకు పెద్ద సమస్యే వచ్చింది. ట్రీట్‌మెంట్‌ విషయంలో ఎక్కడా సరైన సమాధానం దొరకలేదు. అప్పుడు చిరంజీవిగారి సాయం కోరాను. ఎంతో మొహమాటంగా అడిగాను.


కొండంత ధైర్యానిచ్చాయి

నిర్భయంగా ఉండమని ధైర్యం చెప్పి, ఒక సంరక్షకుడిలా సమస్యకు సంబంధించిన అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కలకత్తాలోని అపోలో సిబ్బందితో మాట్లాడి మంచి వైద్యం అందేలా చేశారు. తదుపరి 'మీ అమ్మగారికి ఏమీ కాదు. ఆరోగ్యంగా ఉంటారు’ అని ధైర్యం చెప్పారు. ఆ సమయంలో ఆయన మాటలు కొండంత ధైర్యానిచ్చాయి. మా కుటుంబానికి శ్వాస నిచ్చిన నిజమైన హీరోలా కనిపించారు. కష్టకాలంలో ఆయన చూపించిన ప్రేమ, అచంచలమైన మద్దతును మాటల్లో చెప్పలేను. భూమ్మీద ఇంకా మంచి, మానవత్వం బతికే ఉందని నిరూపించారు. అంత బిజీ షెడ్యూల్‌లోనూ ఆయన అండగా నిలిచారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ తీసుకున్నారు. ఏ అవసరం వచ్చిన అడగటానికి మొహమాటపడొద్దని పదేపదే చెప్పారు. ఆయన మా పాలిట  సంరక్షకుడిగా, దేవదూతలాగా కనిపించారు. చిరంజీవి చేసిన సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అంటూ ఊర్వశీ రౌతెల భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య చిత్రంలో 'వేర్‌ ఈజ్‌ ద పార్టీ బాసు’ సాంగ్‌లో కనిపించి సందడి చేసారు. 

Updated Date - Feb 14 , 2025 | 07:41 AM