Nithiin: విజయం కోసం తమ్ముడు తహతహ...

ABN, Publish Date - Apr 21 , 2025 | 11:08 AM

నితిన్ తాజా చిత్రం 'రాబిన్ హుడ్' తీవ్ర నిరాశకు గురిచేయడంతో ఇప్పుడీ యంగ్ హీరో ఆశలన్నీ తన తదుపరి చిత్రం 'తమ్ముడు' మీదనే పెట్టుకున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఖారారైంది.

ప్రముఖ కథానాయకుడు నితిన్ (Nithiin) కొన్నేళ్ళుగా మంచి విజయం కోసం తహతహ లాడుతున్నాడు. ఈ యేడాది మార్చి 28న వచ్చిన 'రాబిన్ హుడ్' (Robinhood) తో నితిన్ ఖచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తాడని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 'రాబిన్ హుడ్' చిత్రం పరాజయం పాలైంది. గతంలో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల 'భీష్మ' (Bheeshma) మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయారు. ఇక నితిన్, అతని అభిమానులు తమ ఆశాలన్నీ 'తమ్ముడు' (Thammudu) మూవీపైనే పెట్టుకున్నారు. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'దిల్' మూవీ అప్పట్లో ఘన విజయం సాధించినా, ఆ తర్వాత వీరి కాంబలో వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' (Srinivasa Kalayanam) ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో 'తమ్ముడు' మూవీని ఎలాగైనా సక్సెస్ చేయాలనే పట్టుదలతో దిల్ రాజు అండ్ టీమ్ ఉంది. ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లోనే 'ఎం.సి.ఎ., వకీల్ సాబ్'' చిత్రాలను రూపొందించిన శ్రీరామ్ వేణు (Sriram Venu) తెరకెక్కిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ యేడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'రాబిన్ హుడ్' రిలీజ్ డేట్ వాయిదా పడుతూ రావడంతో... 'తమ్ముడు' కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. ఇప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి, జూలై 4న ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు భావించారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

ఇదిలా ఉంటే... నితిన్, దిల్ రాజు అనుబంధం ఏనాటిదో. అందుకే జయాపజయాలతో నిమిత్తం లేకుండా వీరి ప్రయాణం కొనసాగుతోంది. 'తమ్ముడు' రిజల్డ్ ఎలా ఉన్నా... నితిన్ తో మరో సినిమా చేయడానికి 'దిల్' రాజు సిద్థమైపోయారు. 'బలగం' (Balagam) ఫేమ్ వేణు, నితిన్ కాంబోలోనే 'దిల్' రాజు 'ఎల్లమ్మ' (Ellamma) చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కె.వి. గుహాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న 'తమ్ముడు' చిత్రానికి బి. అజనీశ్‌ లోక్ నాథ్ (B Ajaneesh Loknath) సంగీతం సమకూర్చుతున్నాడు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సినిమాను పెట్టుకున్న నితిన్ కు 'తమ్ముడు' ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read: Mandaadi: తమిళ చిత్రసీమలోకి సుహాస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 21 , 2025 | 11:08 AM