TFI: ఉగ్రదాడిలో మరణించిన వారికి టాలీవుడ్ నివాళి
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:23 PM
కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 శాఖలవారు నివాళి అర్పించారు.
కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఫిలిం ఛాంబర్ (Film Chamber) ఆధ్వర్యంలో నివాళి జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 శాఖలవారు ((TFI tribute) నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో MAA మాజీ ప్రెసిడెంట్, సీనియర్ నటుడు మురళి మోహన్ మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) చాలా దురదృష్టకరమైన పరిణామం. ప్రశాంతకరమైన భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం. ఈ దాడికి ప్రపంచం మొత్తం కూడా బాధకు గురయ్యింది. మన దేశంలో మంచి మంచి పర్యాటక ప్రదేశాలు వున్నా, పక్క దేశాల వారు రావడానికి ఇష్టం చూపించట్లేదు. దానికి కారణం మనలో మనకే తేడాలు ఉండటం. ఆ తేడాలు పక్కన పెట్టి అందరం ఒకటిగా ఉందాం. భారతీయులంతా ఒక్కటిగా ఐక్యమత్యంగా ఉందాం అని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను కట్టడి చెయ్యడానికి సిద్ధమైన అధికారులకు అండగా ఉందాం" అని అన్నారు.
టిఎఫ్టిసి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ " జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను కట్టడి చెయ్యడం కోసం ఉన్న ప్రోగ్రాంలన్ని క్యాన్సిల్ చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నందుకు పరిశ్రమకు నుంచి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థాంక్స్" అన్నారు.
తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ "బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అవగాహన కల్పిస్తాం అంటూ హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో భరత్ భూషణ్ దామోదర్ ప్రసాద్, మురళి మోహన్, ప్రసన్న కుమార్, అనుపమ రెడ్డి మాదల రవి, వల్లభనేని అనిల్, శ్రీధర్, తుమ్మలపల్లి రామకృష్ణ, మాణిక్, ప్రకాష్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.