Shruti Haasan: నేనూ మనిషినే కదా.. కాస్త అర్థం చేసుకోవాలి
ABN, Publish Date - Apr 27 , 2025 | 05:11 PM
శ్రుతీహాసన్ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. నటిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా చక్కని గుర్తింపు తెచ్చుకుంది. అలాగు ముక్కుసూటి మనిషి కూడా. ఎదుటి వ్యక్తి ఎవరైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది.
శ్రుతీహాసన్ (Shruti Haasan) మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. నటిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా చక్కని గుర్తింపు తెచ్చుకుంది. అలాగు ముక్కుసూటి మనిషి కూడా. ఎదుటి వ్యక్తి ఎవరైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇటీవల శ్రుతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. తన గత ప్రేమ కథలను బయటపెట్టారు. ‘‘జీవితంలో ఇలాంటి పని ఎందుకు చేశానా.. అని బాధపడిన సందర్భాలు పెద్దగా ఏమీ లేవు. కానీ, నాకెంతో ఇష్టమైన వారిని కొన్నిసార్లు బాధపెట్టాను. అనుకోకుండా అది జరిగినప్పటికీ.. అలా చేయకుండా ఉండాల్సిందనే భావన ఎప్పటికీ ఉంటుంది. జీవితాంతం వారికి క్షమాపణలు చెబుతూనే ఉంటా. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక విఫల ప్రేమ గాధ ఉంటుంది. మాజీ భాగస్వామి వల్ల మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటాం. నాక్కూడా అలాంటి బ్రేకప్ స్టోరీలు (Shruti Haasan Breakups)ఉన్నాయి. బ్రేకప్ అయ్యాక దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటా. నా లవ్‌స్టోరీలను ఉద్దేశించి చాలామంది మాట్లాడుతుంటారు. ‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్’ (Shruti Haasan boys friends) అని అడుగుతుంటారు. వాళ్లకు అర్థం కాని విషయం ఏమిటంటే.. వారి దృష్టిలో అది కేవలం నంబర్ మాత్రమే.. కానీ, నాకు అలా కాదు. నేను కోరుకున్న ప్రేమను పొందడంలో ప్రతిసారీ ఫెయిల్ అయ్యానని అర్థం. అది నన్ను బాధ పెడుతుంది.
ఎందుకంటే నేనూ మనిషినే కదా. బ్రేకప్ అయినంత మాత్రాన ఆ వ్యక్తిని నేను తప్పుపట్టను. మనిషిలో మార్పు సహజం. రిలేషన్‌షిప్‌లో నేను నిజాయతీగా ఉంటాను’’ అని అన్నారు. తనకు ఎదురైన అవమానాల గురించి చెబుతూ ‘‘కెరీర్ ఆరంభంలో నేను నటించిన సినిమాలు పరాజయం అందుకున్నాయి. తెలుగులో ‘గబ్బర్‌సింగ్’కు ముందు నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో దురదృష్టవంతురాలనే ట్యాగ్ వేశారు. కానీ, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే.. ఆ రెండు చిత్రాల్లో హీరో సిద్థార్థ్. అతడిని మాత్రం ఏమీ అనలేదు. హరీశ్ శంకర్ వల్ల నా కెరీర్ మారింది. ‘గబ్బర్‌సింగ్’తో నేను విజయాన్ని అందుకున్నా. వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయకపోవడాన్ని కూడా కొంతమంది తప్పుగా చూస్తారు. నా మనసుకు నచ్చిన సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాను’’ అని అన్నారు.