Sandeep Reddy Vanga: భద్రకాళిలో చిరు ఉగ్రరూపం..
ABN, Publish Date - Feb 04 , 2025 | 07:01 AM
Sandeep Reddy Vanga: తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్ లో తన నూతన కార్యాలయాన్ని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆఫీస్ లో చిరు ప్లాప్ మూవీ పోస్టర్ ఒకటి హైలెట్ గా నిలుస్తుంది. దీని వెనుక అసలు కథ ఏంటంటే..
తెలుగు సినీ పరిశ్రమకు సిసలైన మార్గదర్శకుడు మెగాస్టార్ చిరంజీవి. జెనరేషన్ ఏదైనా సినిమాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటని ప్రశ్నిస్తే వాళ్ళ నుంచి మొదటి సమాధానం చిరంజీవి పేరే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నా సీనియర్, యంగ్, ఫ్రెష్ ఆర్టిస్ట్ చాలా మంది తమ ఇన్స్పిరేషన్ చిరు అనే చెబుతున్నారు. అలాగే పలు సందర్భాలలో వాళ్ళు చిరుకు ఎంత పెద్ద ఫ్యాన్స్ అనేది ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన సినిమాలతో విమర్శకులను, బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తనదైన స్టైల్ లో అభిమానాన్ని చాటుకున్నాడు.
సందీప్ రెడ్డి వంగా అంటేనే.. బోల్డ్, రా, ఇంటెన్సిటీ. తాజాగా ఆయన హైదరాబాద్ లో తన నిర్మాణ సంస్థ భద్రకాళి కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఓపెన్ చేశారు. ఆయన తన ఆఫీస్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన సినీ అభిమానులకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇందులో ప్రపంచ సినిమా మార్గదర్శకుడు 'మార్టిన్ స్కోర్సెస్' టాక్సీ డ్రైవర్, 'డేవిడ్ ఫించర్స్' ఫైట్ క్లబ్, 'స్టాన్లీ కుబ్రిక్' క్లాక్‌వర్క్ ఆరెంజ్, 'పాల్ థామస్ ఆండర్సన్' దేర్ విల్ బి బ్లడ్ ఫోటో ఫ్రేమ్స్ ఆకర్షించాయి. కానీ అన్నింటికంటే 'పులి రాజు' ఫోటో ఫ్రేమ్ ఆకర్షణీయంగా కనిపించింది. ఇంతకీ ఆ పులి రాజు ఎవరు? దాని కథ ఏంటంటే..
1987 ప్రముఖ దర్శకుడు భారతీ రాజా తెరకెక్కించిన క్లాసిక్ 'ఆరాధన' . సుహాసిని కథానాయకి. సుప్రీం హీరో చిరు కథానాయకుడు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం హైలెట్. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు పులిరాజు. పొగరు, కోపం అణువణువు నిండిపోయి ఉంటాయి. ఇతని ప్రవర్తన ఏ స్థాయిలో ఉంటుందంటే కన్నతల్లిని సైతం తూలనాడేంత. కానీ జెన్నిఫర్ అనే టీచర్ పులి రాజు చెంప చెళ్లుమనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన ఒక యాంగ్రీ లుక్ ఇస్తారు. సరిగ్గా అదే ఫ్రేమ్ ని సందీప్ రెడ్డి వంగా తన భద్రకాళి ఆఫీసులో హైలెట్ చేసి పెట్టుకున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి ఇంటెన్సివ్ యాంగ్రీ క్యారెక్టర్లను డిజైన్ చేసిన సందీప్ కు పులి రాజు పాత్ర ఇన్స్పిరేషన్ కావడంలో ఎలాంటి సందేహం లేదు.