Sai Pallavi: ఆ చీర ధరించే వరకూ నాకు ఒత్తిడే.. ఆ కథేంటంటే..
ABN, Publish Date - Feb 16 , 2025 | 03:22 PM
అందం, అభినయంతో ప్రేక్షకుల్ని అలరించి లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు పొందింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జాతీయ అవార్డు (National Award) కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. అందుకు బలమైన కారణం ఉందన్నారు.
"ప్రేమమ్’లో ‘మలార్’ పాత్రతో ఒక్కసారిగా పాపులర్ అయింది సాయిపల్లవి (Sai Pallavi). 'మలర్’ (malar)నుంచి ‘సత్య’ వరకూ ఏ పాత్ర చేసినా ప్రాణం పెట్టి నటించారు. అందం, అభినయంతో ప్రేక్షకుల్ని అలరించి లేడీ పవర్‌స్టార్‌గా గుర్తింపు పొందింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జాతీయ అవార్డు (National Award) కోసం తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. అందుకు బలమైన కారణం ఉందన్నారు.
‘‘ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకోవాలని నాకెంతో ఆశగా ఉంది. ఎందుకంటే, నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా మామ్మ ఓ చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేను సినిమాల్లోకి రాలేదు. కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకుందామనుకున్నా. ఆ తర్వాత మూడేళ్లకు సినిమాల్లోకి అడుగుపెట్టా. నా తొలి చిత్రం ‘ప్రేమమ్’ కోసం వర్క్ చేశా. పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్ళలో ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటానని నమ్మాను. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప. కాబట్టి, దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా. దానిని అందుకున్నా, అందుకోకపోయినా.. ఈ చీర ధరించే వరకూ నాపై ఒత్తిడి ఉంటూనే ఉంటుంది’’ అని సాయి పల్లవి చెప్పారు.
‘గార్గి’ చిత్రానికి గాను సాయిపల్లవికి జాతీయ అవార్డు వరిస్తుందని అభిమానులు ఎంతో ఆశపడ్డారు. కాకపోతే, చివరకు నిరాశ ఎదురైంది. ఆ ఏడాది నిత్యామేనన్‌ను నేషనల్ అవార్డు వరించింది. తాజాగా తండేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సాయి పల్లవి. నాగచైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ దీనిని నిర్మించారు.